సుమారు రెండేండ్ల క్రితం, నేను ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతంలో ఉన్న వేడిగా, దుమ్ముతో నిండిన షాహ్పూర్ పట్టణంలో నివసిస్తున్నప్పుడు ఇన్స్పెక్టర్ కీమత్ లాల్‌ను కలిశాను. కీమత్ లాల్ స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఇన్చార్జిగా ఉండేవాడు. అతను భారీకాయంతో ఉండేవాడు. సోమరిపోతు స్వభావం కలవాడు. కానీ, చాలామంది సోమరులలాగే అతనూ తెలివైనవాడు. చాలా ఏండ్లు ఇన్‌స్పెక్టర్‌గానే ఉండిపోయి, తర్వాత పదోన్నతిపై ఆశలన్నీ వదులుకున్నాడు. అదృష్టం తనకు వ్యతిరేకంగా ఉందని అనేవాడు. తాను అసలు పోలీసై ఉండకూడదు. అతను మకర రాశిలో పుట్టాడు, నిజానికి రెస్టారెంట్ వ్యాపారంలోకి వెళ్ళి ఉండాల్సింది, కానీ ఏదైనా చేయడానికి ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది.
నాకూ, ఇన్స్పెక్టర్కి పెద్దగా పోలికలు లేవు. అతనికి దాదాపు నలభై ఏళ్లు, నాకు ఇరవై ఐదు. కానీ మేమిద్దరం ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళం. షాహ్పూర్లో అలా మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు. అంతేకాకుండా, మా ఇద్దరికీ బీరంటే చాలా ఇష్టం. షాహ్పూర్లో వినోదం కోసం ఏ ప్రదేశాలూ లేవు. మండుటెండ, తూర్పు నుండి సుడిగాలిలా ఎగిరే దుమ్ము, లెక్కలేనన్ని ఈగల్లాగే ఉండే దోమలు. ఇంకా ఒకేరకమైన ఆ జీవితం వల్ల, ఎప్పుడూ తాగే నిమ్మరసం కంటే బలమైనది ఏదైనా తాగాలనే దాహం వేసేది. మా ఇల్లు పట్టణ శివార్లలో ఉండేది. అక్కడ మాకు పెద్దగా ఏ ఆటంకాలు కలిగేవి కావు. వారంలో రెండు మూడు సాయంత్రాలు, సూర్యుడు అస్తమిస్తూ, చల్లగా ఉండే చీకటి, ఎత్తైన పైకప్పు గల పడకగది నుండి బయటకు రావడానికి వీలయ్యే వేళలో, ఇన్స్పెక్టర్ కీమత్ లాల్ వరండా మెట్లపై కనిపించే వారు. ఆయన రుమాలుకు బదులుగా ఒక చిన్న తువాలును వాడుతూ, దానితో ముఖానికి ఉన్న చెమటను తుడుచుకునేవారు.
ఒక పోలీస్ ఇన్స్పెక్టర్కు సేవ చేసే అవకాశం వచ్చిందన్న ఉత్సాహంతో, నాకున్న ఒకేఒక పనివాడు గ్లాసులు, ఒక ఐస్ బకెట్, ఇంకా కొన్ని మంచి ఇండియన్ బీర్ సీసాలతో హడావిడిగా బయటకు పరిగెత్తుకొచ్చేవాడు. ఒక సాయంత్రం మేము నాలుగో సీసా కూడా తాగేశాక నేను అన్నాను, “ఇన్స్పెక్టర్ గారూ, మీ వృత్తి జీవితంలో మీరు కొన్ని ఆసక్తికరమైన కేసులు చూసి ఉంటారు.”
“వాటిలో చాలా వరకు చాలా చప్పగా ఉండేవి” అని అతను అన్నాడు. “కనీసం సఫలమైనవైనా, సంచలనాత్మక కేసులు, సాధారణంగా పరిష్కారం కాకుండానే మిగిలిపోయేవి-లేకపోతే నేను ఇప్పటికి సూపరింటెండెంట్ అయ్యేవాడిని. మీరు హత్య కేసుల గురించి మాట్లాడుతున్నారు అనుకుంటాను. అంతర్గత వ్యవహారాల మంత్రిపై జరిగిన కాల్పుల ఘటన మీకు గుర్తుందా? నేను ఆ కేసులో ఉన్నాను, కానీ అది ఒక రాజకీయ హత్య, అందుకే మేము దాన్ని ఎప్పుడూ పరిష్కరించలేక పోయాము.”
“మీరు పరిష్కరించిన ఒక కేసు గురించి చెప్పండి. ఒక ఆసక్తికరమైన కేసు’’ నేను అన్నాను. అతను అసౌకర్యంగా కనిపించడంతో, “మీరు ఆందోళన చెందకండి, ఇన్స్పెక్టర్. నేను ఎంత బీరు తాగినా, చాలా గోప్యత పాటించే వ్యక్తిని” అని అన్నాను.
“కానీ మీరు ఎలా జాగ్రత్తగా ఉండగలరు? మీరు ఒక రచయిత కదా.”
నేను అభ్యంతరం తెలిపాను. రచయితలు సాధారణంగా చాలా వివేకంతో ఉంటారు. వారు ఎప్పుడూ వ్యక్తుల, ప్రదేశాల పేర్లను మారుస్తుంటారు.
అతను అరుదుగా నవ్వే చిరునవ్వుతూ నా వైపు చూసి, “ఒకవేళ నన్ను ఒక కథలో పెడితే, మీరెలా వర్ణిస్తారు?”
“ఓహ్, నేను నిన్ను ఇలాగే వదిలేస్తాను. ఎలాగూ నిన్ను ఎవరూ నమ్మరు.” అతను ఉదారంగా నవ్వి, మరికొంత బీరు పోశాడు. “నేను కూడా పేర్లు మార్చగలననుకుంటాను మీకు ఒక చాలా ఆసక్తికరమైన కేసు గురించి చెబుతాను. బాధితుడు ఒక అసాధారణ వ్యక్తి, అలాగే హంతకుడు. కానీ మీరు ఈ కథను రాయనని మాట ఇవ్వాలి.”
“నేను ప్రమాణం చేస్తున్నాను” నేను అబద్ధం చెప్పాను.
“మీకు పనౌలి తెలుసా?”
“కొండల్లోనా? అవును, నేను అక్కడికి ఒకటి రెండు సార్లు వెళ్లాను.”
“మంచిది, అయితే నేను మరీ వివరంగా చెప్పనవసరం లేకుండానే మీరు నన్ను అనుసరిస్తారు. ఇది సుమారు మూడేళ్ల క్రితం, నేను పనౌలిలో నియమితుడినైన కొద్ది కాలానికే జరిగింది. అక్కడ పెద్దగా ఏమీ జరిగేది కాదు. కొన్ని దొంగతనాలు, మోసాలు జరిగేవి, వేసవిలో అప్పుడప్పుడు ఒక గొడవ జరిగేది. దాదాపు ప్రతి పదేళ్లకు ఒకసారి హత్య జరిగేది. పనౌలి రాణిని తను కూర్చునే గదిలో గొడ్డలితో తల పగలగొట్టి చంపారు, అది ఒక పెద్ద సంఘటనగా మారింది. నేను పనౌలిలో ఉండాలంటే ఆ కేసును పరిష్కరించాల్సిందేనని నాకు అర్థమైంది. సమస్య ఏమిటంటే, రాణిని ఎవరైనా చంపి ఉండవచ్చు, ఆమె చనిపోయినందుకు తమ సంతృప్తిని దాచుకోని వారు కూడా కొందరు ఉన్నారు. ఆమె ఒక అపఖ్యాతి పాలైన మహిళ. ఆమె భర్త చనిపోయాడు, పిల్లలు చెల్లాచెదురయ్యారు, ఇక ఆమె డబ్బు గురించి చెప్పాలంటే, ఆమె ఎప్పుడూ అంత ధనవంతురాలైన రాణి కాదు. పట్టణం శివార్లలోని ఒక పాత ఇంట్లో ఒంటరిగా ఉండేది. ఒక వంశపెద్దలా కఠినమైన అధికారంతో ఆ ప్రాంతాన్ని పాలించేది. ఆమెకు ఒక సేవకుడు ఉండేవాడు, శవం దగ్గర పోలీసులకు కనిపించిన వ్యక్తి అతనే. వాడు తడబడుతూ, మాటలు రాక మౌనంగా ఉండటంతో, నేను వెంటనే అతన్ని అరెస్టు చేశాను. అతను బహుశా నిర్దోషి కావచ్చు, కానీ నేరం జరిగిన ప్రదేశంలో మొదట కనిపించిన వ్యక్తిని, ముఖ్యంగా అతను సేవకుడు అయితే, పట్టుకోవాలని ఒక ప్రాథమిక నియమం. కానీ మేము అతన్ని కొట్టి వదిలేశాం. అతను మాకు పెద్దగా ఏమీ చెప్పలేదు, పైగా అతని వద్ద బలమైన సాక్ష్యం కూడా ఉంది. గాయాన్ని బట్టి, రాణిని చంపడానికి ఉపయోగించిన గొడ్డలి ఒక చిన్న కట్టెలవాడి గొడ్డలి అయి ఉంటుందని మేము ఊహించాము. మాకు ఆ ఆయుధం దొరకలేదు. దానిని ఒక పురుషుడో, స్త్రీనో ఉపయోగించి ఉండవచ్చు. రాణి మీద పగ ఉన్న స్త్రీ పురుషులు చాలా మంది ఉన్నారు. ఆమె యువతులను అక్రమంగా రవాణా చేసి తన ఆదాయాన్ని పెంచుకుంటోందని పుకార్లు ఉన్నాయి. అందుకు కావలసిన పరిచయాలు ఆమెకు ఉన్నాయి. ఆమె వద్ద అపారమైన సంపద ఉందని, అది తన గోదాములో దాచిపెట్టి ఉందని కూడా అంటుంటారు. మాకు ఎలాంటి నిధి దొరకలేదు. దెబ్బతిన్న షటిల్ కాక్ల వలె పుకార్లు చాలా ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. వాటిని అనుసరించి నా సమయాన్ని వృధా చేయడం ఆపాలని నిర్ణయించుకున్నాను. దానికి బదులుగా, రాణితో వ్యక్తిగత సంబంధీకులకు, భౌతికంగా సన్నిహితంగా ఉన్న వ్యక్తులకే నా విచారణను పరిమితం చేశాను. మొదటగా, పనౌలిలో ఇల్లు ఉన్న, బొంబాయికి చెందిన కపూర్‌గారు అనే ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త ఉండేవారు. ఆయన రాణికి పాత అభిమాని అని చెప్పుకునేవారు. ఆయన అప్పుడప్పుడు ఆమెకు డబ్బు అప్పుగా ఇచ్చేవారని, ఆమెతో స్నేహం ఉంటూనే, అధిక వడ్డీ వసూలు చేసేవారని నేను కనిపెట్టాను. అప్పుడు ఆమెకు దగ్గరలో పొరుగున ఒక అమెరికన్ మిషనరీ, అతని భార్య ఉండేవారు. వారు రాణిని క్రైస్తవ మతంలోకి మార్చడానికి ప్రయత్నించేవారు. డెబ్బై ఏళ్ల ఒక ఆంగ్ల అవివాహిత. తను, రాణి ఒకరినొకరు తీవ్రంగా ద్వేషించుకుంటున్నారన్న నిజం ఏమాత్రం దాగలేదు. తమ ఉన్నత వర్గపు పొరుగువారితో సఖ్యతగా లేని ఒక స్థానిక కౌన్సిలర్, అతని కుటుంబం, దగ్గరలోనే దుకాణం నడిపే ఒక దర్జీ ఉండేవాడు. నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తులలో ఎవరికీ రాణిని చంపడానికి బలమైన కారణాలు లేవు. కానీ ఆ దర్జీ కుమార్తె నాకు ఆసక్తిని కలిగించింది.
ఆమె పేరు కుసుమ్. ఆమె వయసు పన్నెండు, పదమూడేండ్లు. సన్నగా, నల్లగా, అందమైన నల్లని కళ్ళు, చురుకైన, ప్రశాంతమైన చిరునవ్వుతో ఉండేది. నేను రాణి గారి ఇంటి పరిసరాల్లో మామూలుగా విచారణ చేస్తుండగా, ఆ అమ్మాయి ఎప్పుడూ తప్పించుకోవడానికి ప్రయత్నించడం గమనించాను. నేను ఆమెను రాణి గురించి, తన గురించి ప్రశ్నించినప్పుడు అస్పష్టంగా, తెలివితక్కువదిగా నటించింది. కానీ ఆమె తెలివితక్కువది కాదని నేను పసిగట్టాను. నాకు నమ్మకం అనిపించింది. ఆమెకు రాణి గురించి ఏదో అసాధారణమైన విషయం తెలుసు. ఆమెకు తెలిసిన వారు కూడా ఉండవచ్చు, కానీ ఆ విషయం నాకు చెప్పడానికి భయపడుతుందని. తరచుగా, హత్య గురించి ఏదైనా విషయం గురించి నేను ఆమెతో మాట్లాడినప్పుడు, ఆమె కళ్ళలో భయం చూశాను. ఆమె ఎవరినో కాపాడుతూ ఉండవచ్చు.
ఆ అమ్మాయి ప్రాణానికి ప్రమాదం ఉండవచ్చని నేను అనుకోవడం మొదలుపెట్టాను. ఆమె కళ్ళలో ఒక తాజాదనం, అమాయకత్వం, ఆశ్చర్యం కనిపించాయి. ఆమెపై ఒక నిశితమైన నిఘా ఉంచాను. ఆమె నాకు నచ్చింది. ఆమె యవ్వనం నాకు నచ్చింది. నాకు వీలైనప్పుడల్లా, దయతో తండ్రిలా ఆమెతో మాట్లాడేవాడిని. పనౌలి ఎప్పుడూ నన్ను ఊపిరి ఆడకుండా చేస్తుందని నాకు తెలిసినప్పటికీ, ఆమె నన్ను ఇష్టపడుతుందని, జీవితంలోని ఎత్తుపల్లాలను చూసి నవ్వుకుంటుందనీ, ఆమె నాకు ఏదో చెప్పాలనుకుంది, కానీ చివరి క్షణంలో ఎప్పుడూ వెనక్కి తగ్గేది.
అప్పుడు, ఒక మధ్యాహ్నం నేను రాణి గారి ఇంట్లో ఆమె సామాన్లు సర్దుతుండగా, గడప దగ్గర ఒక సన్నని పగులులో ఏదో మెరుస్తూ కనిపించింది. కిటికీలోంచి సూర్యరశ్మి ప్రసరించి ఆ చిన్న వస్తువుపై పడకపోతే నేను దాన్ని గమనించి ఉండేవాడిని కాదు. నేను వంగి ఒక గాజు ముక్కను తీశాను. అది పగిలిపోయిన ఒక గాజులో భాగం. నేను ఆ ముక్కను చేతిలో తిప్పి చూశాను. దాని రంగు, డిజైన్‌లో ఏదో పరిచయం ఉన్నట్లు అనిపించింది. కుసుమ్ కూడా ఇలాంటి గాజులే వేసుకునేది కదా? నేను ఆ అమ్మాయి కోసం వెతకడానికి వెళ్లాను కానీ ఆమె వాళ్ళ నాన్న దుకాణంలో లేదు. ఆమె కట్టెలు ఏరడానికి కొండ కిందికి వెళ్లిందని చెప్పారు.
నేను కొండ కింద ఉన్న సన్నని దారిలో నడిచాను. అది రాళ్ళూ, బ్రహ్మజెముడు మొక్కల చుట్టూ తిరిగి, ఆ తర్వాత ఓక్ చెట్ల అడవిలోకి దారితీసింది. నేను అడవి అంచున కుసుమ్‌ను చూశాను, ఆమె పక్కన ఒక పుల్లల కట్ట ఉంది.
‘‘నువ్వు ఎప్పుడూ ఒంటరిగా తిరుగుతూ ఉంటావు. నీకు భయంగా అనిపించదా?’’ అని అడిగాను.
‘‘నేను ఒంటరిగా ఉన్నప్పుడు సురక్షితంగా ఉంటుంది’’ ఆమె బదులిచ్చింది. ‘‘ఇక్కడికి ఎవరూ రారు’’.
నేను ఆమె మణికట్టుకు ఉన్న గాజుల వైపు చూశాను, వాటి రంగు పగిలిన ముక్క రంగుతో సరిపోలడాన్ని గమనించాను. నేను ఆ పగిలిన గాజు ముక్కను అందిస్తూ, ‘‘ఇది నాకు రాణి గారి ఇంట్లో దొరికింది. కిందపడిపోయి ఉంది’’ అని అన్నాను.
నేను చెప్పేది పూర్తి చేసే వరకు ఆమె ఆగలేదు. భయంతో కూడిన చూపుతో, ఆమె గడ్డిలోంచి ఒక్కసారిగా లేచి అడవిలోకి పారిపోయింది. నేను నివ్వెరపోయాను. అలాంటిది అసలు ఊహించలేదు. ఆ పగిలిన గాజుకు అంత ప్రాముఖ్యత ఏముంది? దారిని కప్పి ఉన్న నునుపైన పైన్ ఆకులపై జారుతూ, నేను ఆ అమ్మాయి వెనుక పరుగెత్తాను. నేను చెట్ల మధ్య వెతుకుతుండగా, నా వెనుక వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు వినపడింది. వెనక్కి తిరిగితే, ఆ అమ్మాయి ఒక బండరాయిపై నిలబడి చేతిలో గొడ్డలితో నావైపు చూస్తోంది. నేను తన వైపు చూస్తూ ఉండటం గమనించి, కుసుమ్ గొడ్డలిని పైకెత్తి, ఆ వాలులోంచి నా వైపు దూసుకొచ్చింది. ఆమె గొడ్డలితో నా మీదికి దూసుకొస్తుండగా, నేను నోరు తెరిచి చూస్తూ ఉండిపోవడం తప్ప మరేమీ చేయలేనంతగా దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆమె పరుగులోని ఆ వేగానికి ఆమె సరిగ్గా నా మీదికి దూసుకొచ్చి ఉంటే ఆ గొడ్డలి, నా పుర్రె ఎంత మందంగా ఉన్నప్పటికీ, నుజ్జునుజ్జు అయి ఉండేది. కానీ ఆమె నాకు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉండగానే, ఆ గొడ్డలి ఆమె చేతుల నుండి ఎగిరింది. దానికి ప్రాణం ఉన్నట్టుగా అది గాలిలోకి ఎగిరి, వంపుగా నా వైపు దూసుకొచ్చింది. నేను బరువు ఎక్కువగా ఉన్నప్పటికీ, చటుక్కున పక్కకు తప్పుకున్నాను. ఆ గొడ్డలి నా భుజాన్ని రాసుకుంటూ వెనుక ఉన్న చెట్టు బెరడులోకి దిగబడింది. కుసుమ్ వెక్కి వెక్కి ఏడుస్తూ నా కాళ్ళ దగ్గర కూలబడింది.”
ఇన్స్పెక్టర్ కీమత్ లాల్ తన గ్లాసు నింపుకోవడానికి ఆగారు. ఆయన బీరును గట్టిగా ఒక గుక్క తాగగా, దాని నురుగు ఆయన మీసాలపై మెరిసింది.
“మరి తర్వాత ఏం జరిగింది?’ అని నేను అతడిని అడిగాను.
“బహుశా ఇది భారతదేశంలో, నాలాంటి వ్యక్తికి మాత్రమే జరిగి ఉండవచ్చు” అన్నాడు అతను.
“నాశనం చేయాల్సిన వ్యక్తి పట్ల ఆకస్మిక కరుణ. తీవ్ర ఆగ్రహంతో ఆ అమ్మాయిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు లాక్కెళ్లడానికి బదులుగా, నేను ఆమె తల నిమిరి, అర్థంలేని ఓదార్పు మాటలు చెప్పాను’’.
“మరి ఆమె రాణిని చంపానని నీకు చెప్పిందా?”
రాణి తనను ఇంటికి పిలిచి టీ, మిఠాయిలు ఇచ్చిందని చెప్పింది. అక్కడ మిస్టర్ కపూర్ కూడా ఉన్నాడట. కొంతసేపటి తర్వాత అతను కుసుమ్ చేతులను నిమురుతూ, మోకాళ్లను పిసకడం మొదలుపెట్టాడట. ఆమె వెనక్కి జరిగింది, కానీ కపూర్ ఆమెను తడుముతూనే ఉన్నాడు. రాణి కుసుమ్‌తో భయపడవద్దని, ఆమెకు ఏ హానీ జరగదని చెప్పిందట. కుసుమ్ ఆ వ్యక్తి నుండి తప్పించుకుని తలుపు వైపు పరుగెత్తింది. రాణి ఆమె భుజాలు పట్టుకుని గదిలోకి వెనక్కి నెట్టింది. గది మూలలో ఉన్న గొడ్డలి కుసుమ్కు కనపడింది. ఆమె దాన్ని పట్టుకుని కపూర్‌ను బెదిరించింది.
తాను హద్దులు దాటానని గ్రహించిన ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడుకోవడానికి వెనక్కి తగ్గాడు. కానీ రాణి కోపంతో ఆ అమ్మాయిపైకి దూకింది. దాంతో కుసుమ్ నిస్సహాయతతో, భయంతో, గొడ్డలిని రాణి తలపై వేసింది. రాణి నేలకూలింది. కపూర్ ఏం చేస్తాడో చూడకుండానే, కుసుమ్ పారిపోయింది. తను తలుపుకు తగిలి తడబడినప్పుడు ఆమె గాజు పగిలిపోయి ఉండాలి. ఆమె అడవిలోకి పరుగెత్తి, కొన్ని పొడవైన ఫెర్న్ మొక్కల మధ్య గొడ్డలిని దాచిపెట్టి, చీకటి పడేంత వరకు గడ్డి మీద పడుకుని ఏడ్చింది. అది ఆమె స్వభావం. యవ్వనపు స్థైర్యం వల్ల, ఆమె మామూలుగా కనిపించేంతగా కోలుకుని ఇంటికి తిరిగి వచ్చింది. ఆ విషయం గురించి ఎవరికీ చెప్పకుండా మౌనంగా ఉంది.
“దాని గురించి మీరేం చేశారు?” అని నేను అడిగాను.
కీమత్ లాల్, బీరు మత్తులో ఉన్న నా కళ్లలోకి సూటిగా చూశాడు. “ఏమీ లేదు’ అన్నాడు అతను. “నేను అస్సలు ఏమీ చేయలేదు. ఆ అమ్మాయిని రిమాండ్ హోమ్‌లో పెట్టించలేకపోయాను. అది ఆమె ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేది.”
“మరి కపూర్ సంగతేంటి?”
“ఓహ్, మీరు ఊహించినట్లుగానే, అతను మౌనంగా ఉండటానికి తన కారణాలు తనకు ఉన్నాయి. నువ్వు ఊహించుకోవచ్చు. ఆ కేసు మూసివేశాను. బహుశా ఆ ఫైల్ నా పెండింగ్ ట్రేలో పెట్టానని చెప్పాలి. నా ప్రమోషన్ కూడా పెండింగ్ ట్రేలోకి వెళ్లిపోయింది.”
“అది నీకు అంత బాగా కలిసి రాలేదు” అని నేను అన్నాను.
“లేదులే. నేను ఇక్కడ షాహ్పూర్లో ఉన్నాను, ఇంకా ఇన్‌స్పెక్టర్‌గానే ఉన్నాను. కానీ చెప్పండి, ఒకవేళ మీరు నా స్థానంలో ఉండి ఉంటే ఏం చేసి ఉండేవారు?”
నేను అతని ప్రశ్నను ఒకటి రెండు క్షణాల పాటు జాగ్రత్తగా ఆలోచించి, ఆ తర్వాత ఇలా అన్నాను, “అది ఆ అమ్మాయి నాలో ఎంత సానుభూతిని కలిగించిందనే దానిపై ఆధారపడి ఉండేదని అనుకుంటున్నాను. ఆమె అమాయకంగానే చంపేసింది..”
“అలాగైతే, చట్టాన్ని నిలబెట్టాలనే మీ విధి కంటే మీ వ్యక్తిగత భావాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ఉండేవారా?”
“అవును. కానీ నేను అంత మంచి పోలీసును అయ్యేవాడిని కాదు.”
“సరిగ్గా”
“అయినప్పటికీ, కపూర్ అంత తేలికగా తప్పించుకోవడం విచారకరం.”
“ఆ అమ్మాయిని వదిలేయాలంటే నాకు వేరే మార్గం లేదు. కానీ అతను పూర్తిగా తప్పించుకోలేదు. ఆ తర్వాత ఒక సంస్థను మోసం చేసి ఇబ్బందుల్లో పడి, రెండేండ్లు జైలుకు వెళ్ళాడు.”
“మరి ఆ అమ్మాయిని మళ్ళీ చూశారా?”
“అయితే, నన్ను పనౌలి నుండి బదిలీ చేయకముందు, నేను ఆమెను అప్పుడప్పుడు రోడ్డు మీద చూసేవాడిని. ఆమె సాధారణంగా బడికి వెళ్లే దారిలో ఉండేది. ఆమె చేతులు జోడించి నాకు నమస్కరించి, నన్ను మామయ్య అని పిలిచేది.”
బీరు సీసాలన్నీ ఖాళీ అయ్యాయి, ఇన్స్పెక్టర్ కీమత్ లాల్ వెళ్ళడానికి లేచారు. ఆయన నాతో చివరిగా అన్న మాటలు.. “నేను అసలు పోలీసునై ఉండాల్సింది కాదు.”
మూలం: రష్కిన్ బాండ్
అనువాదం: జ్వలిత, 9989198943







కామెంట్లు (0)