ఆధునికత ఇచ్చిన మరో మాధ్యమం ఫొటోగ్రఫీ ఆవిష్కరించడం అలస్యం, ఈ మాధ్యమం, సమాజం ఈ క్షణం కోసమే ఎదురు చూస్తోందా అన్నట్టు ఎంతో ఉపయోగకారిగా అన్ని రంగాల్లో అల్లుకుపోయింది. కెమెరా ద్వారా వెలుతురు దానికి అధారం చేసి ఛాయాచిత్రాలు, అదే ఫొటోలు తీశారు. ఈ కెమెరా యొక్క అవిష్కరణ మూలాలు 17 వ శతాబ్దం నుంచే కనిపించినా ఈనాటి కెమెరా 1839 లో లూయిస్ డాగెరో, నీప్సె ఆనే అంగ్లేయులు వెలుతురు ఉపయోగించి వెండి, రాగి పలకలపై ఛాయాచిత్రం తీశారు. ఈ పద్ధతి కంటే మరింత ఉపయోగకర పద్ధతి ఫాక్స్ టాల్బోట్, మరిన్ని ప్రింట్లు తీయగల కెమెరా పద్ధతిని 1840లో కనుగొన్నాడు. ఆయన ఫొటోగ్రాఫర్ కూడా. ఈయన వలన కళాత్మక ఫొటోలు తీయగల మాధ్యమంగా ఈ ఫొటోగ్రఫీ గుర్తించబడింది. ‘ది పెన్సిల్ అఫ్ నేచర్’ అనే పుస్తకాన్ని తను తీసిన ఫొటోలతో సహా 1846లో ప్రచురించాడు. యూరోప్‌లో ఆవిష్కరించబడిన ఈ మాధ్యమం బ్రిటిష్‌వారు భారతదేశం వెంటనే తీసుకువచ్చారు.
కెమెరాతో ఫొటోలు తీసేముందు అన్ని రంగాల్లోనూ చిత్రకారులు వేసిన చిత్రాలు సమాచారానికి అధారమయ్యాయి. ఫొటోలు ఎంతో సమయాన్ని మిగులుస్తాయి, చిత్రాలు గీయటం చాలా సమయం తీసకుంటాయి. ముఖ్యంగా బ్రిటిష్ వారు మన దేశ జీవన విధాలు, పనితనాలు, ఇమారుతాలు అన్ని చిత్రాలుగా పొందు పరచటంలో వారికి ఈ కెమెరా ప్రధాన పాత్ర వహించింది. ఈ సందర్భాన ఎంతోమంది ఉత్సాహపూరితులు, అది తమ వృత్తిలా కాక నేర్చుకోవడం కూడా మొద లెట్టారు. ఇలా నేర్చుకున్నవారు భారతీయులు, బ్రిటిష్ వారు అందరూ వున్నారు. కొందరు ఆనాడు భారతీయ ఫొటోగ్రాఫర్లు కళాత్మక, ముఖ్యమైన ఫొటోలు తీశారు. అందులో వినిపించే ఒకానొక మొదటి పేరు....
రాజా దీనదయాల్ : లాలా దీనదయాల్ 1844లో మీరట్ వద్ద సార్దనా అనే ప్రదేశంలో, మధ్యతరగతి జైనకుటుంబంలో పుట్టాడు. ఈయన భారతీయ ఫొటోగ్రాఫర్లుగా పేరు పొందిన జాబితాలో ఒకానొక ముఖ్య ఫొటోగ్రాఫర్. ఈయన హైదరాబాద్ నిజాం ఇచ్చిన బిరుదు వలన రాజా దీనదయాల్గా పిలువబడ్డాడు. ఈయన రూర్కీ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ చదువుకున్నాడు. ఆనాటికి ఫొటోగ్రఫీ ఎంత ప్రఖ్యాతి గాంచిందంటే ఆ కాలేజీలో 1954లో ఫొటోగ్రఫీ విషయం పాఠ్యాంశ్యంగా చేర్చారు. అక్కడ చదువుకోసం వెళ్లిన దీనదయాల్‌కు ఈ విషయం ఆకర్షణీయంగా అనిపించి ఫొటోగ్రఫీ నేర్చుకున్నాడు. చదువు పూర్తయ్యాక ఇండోర్ ఆస్థానంలో పబ్లిక్ పనుల విభాగంలో, కొలతల విభాగంలో డ్రాఫ్ట్స్‌మన్‌గా పనిచేస్తూ ఫొటోగ్రఫీని ఆనందించాడు. బ్రిటిష్ ఆఫీసర్లని మెప్పించాడు. బ్రిటిష్ ఆఫీసర్ల, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ వారి ఫొటోలు తీసే బాధ్యత ఈయనకు అప్పజెప్పబడింది. 1874లో ఇండోర్‌లో తన ఫొటో స్టూడియో తెరిచాడు. లేపెల్ గ్రిఫిత్ అనే బెంగాలు సివిల్ సర్వీస్‌లో వున్న ఆంగ్లేయుడితో పాటు 1882 - 84లలో మధ్య భారతం అంతా తిరిగి నిర్మాణాలు, ఇమారుతాలు పై ఎన్నో ఫొటోలు తీశాడు. గ్రిఫిత్ తన పుస్తకం ‘సెంట్రల్ ఇండియన్ మాన్యుమెంట్స్’గా అచ్చువేసి ఈయన తీసిన 86 ఫొటోలను అందులో ప్రచురించాడు. ఈ ఫొటోలు యూరప్ చేరిన ముఖ్యమైన మన సంస్కృతి ఫొటోలు అని చెప్పవచ్చు. నిజానికి 1875 - 76లో బ్రిటిష్ ఏజెంట్‌గా ఇండోర్, గ్వాలియర్, సాంచి, ఝాన్సీ, ఓర్చా, రేవా, ఓంకారేశ్వర్ వంటి ప్రదేశాలు, ఆ తరువాత ఉత్సాహంతో బుందేల్ ఖండ్, ఢిల్లీ, ఆగ్రాల ఫొటోలు తీశాడు. బ్రిటిష్ వారికి భారతీయ ఆస్థానాల మధ్య ఎంతో పరిచయస్థుడిగా, ఆహ్వానితుడిగా తిరిగాడు.
1885 నుండి 1905 లో ఆయన కన్ను మూసేవరకూ 6వ నిజాం వద్ద హైదరాబాద్‌లో ఆస్థాన పొటోగ్రాఫర్‌గా పనిచేశాడు. 1886లో సికింద్రాబాద్‌లోనూ తన ఫొటో స్టూడియో తెరిచాడు. స్త్రీలు ఫొటోస్టూడియోకి వచ్చి ఫొటోలు తీయించుకోవడం అనేది ఆనాడు సంప్రదాయ విరుద్ధం. నిజాం స్త్రీలు పరదా పద్ధతి పాటిస్తారు. అందుకని 1892లో హైదరాబాద్‌లో జెనానా స్టూడియో తెరిచాడు. మిసెస్ కెన్నీ లెవిక్ అనే ఆంగ్ల స్ర్తీ, అక్కడి స్ర్తీలకు భద్రంగా ఫొటోలు తీసింది. ఈ విధానం స్ర్తీల కట్టూ, వ్యవహార పద్ధతులూ ఫొటోల ద్వారా తెలిసింది.
నిజాం వద్ద ఆయన జీవన విషయాలు, వేట, విహారాలు వంటి ఎన్నో ఫొటోలు తీస్తూ చక్కటి ఆల్బంలకు కారకుడయ్యాడు. 1894లో నిజాం రాజు ఈయనకు ‘రాజా’ అనే బిరుదు ఇవ్వటంతో రాజా దీనదయాల్గా పిలవబడ్డాడు. ఆ సంవత్సరం ఇండోర్ స్టూడియో మూసి ముంబయిలో తెరిచి తన కొడుకు గ్యాన్చంద్కి ఇచ్చాడు.
తను తీసే ఫొటోల నాణ్యత మధ్యలోనే మారింది. 1903లో నిజాం రాజుతో పాటు ఢిల్లీ వెళ్లి ఢిల్లీ దర్బార్ ఫొటోలు ఎన్నో తీశాడు. ఈయన ఫొటోలు విషయ సూచన దగ్గరే ఆగకుండా కళాత్మకంగా మారాయి. ఇంగ్లీషు వారు ఇచ్చిన ఉద్యోగం ప్రకారం, వారు చెప్పిన ఫొటోలు తీసి ఆగలేదు. సమాజంలో ప్రజలు ఎదుర్కొన్న కరువు కాటకాలు, సామాజిక స్థితులూ, ఫొటో చిత్రాలుగ తీశాడు. ఏ కోణంలో తీస్తే తను అనుకున్న విషయ వివరణ ప్రాధాన్యంగా బయటకు వస్తుందో, ఆకాశం, ప్రకృతి ఏ కోణంలో ఫొటోలో వుంచితే ఫొటో కళాత్మక విలువ పెరుగుతుందో ఎంతో అవగాహనతో తీశాడు. అందుకనే ఈయన ఫొటోలు కళాత్మక చిత్రాలుగా కూడా ఎంచబడ్డాయి. అలాగే అందు వున్న విషయ సూచన వలన భారతీయ ఆర్కియాలజీ వారికీ ముఖ్యమైనాయి.
దరోఘా అబ్బాస్ అలీ : ఈయనా ఇంజినీర్, ఫొటోగ్రాఫర్. 1874లో ఒక ఫొటో ఆల్బమ్ ‘ది బ్యూటీస్ ఆఫ్ లక్నో’ అని ప్రచురించాడు. లక్నో గాయనీ నర్తకీమణుల, లావణ్యము, ప్రాముఖ్యత తెలిపే ఆ స్త్రీల ఫొటోలు ఇవి. బ్రిటిష్ చేయబోయే విధానాలు, ఈ స్ర్తీలకు జరగబోయే అన్యాయం అర్థం చేసుకుని వారి గౌరవార్థం తీసిన ఫొటోఆల్బమ్ అని ఒక వ్యాఖ్య వుంది. అవధ్ రాజు వాజిద్ అలీషా వద్ద ఆస్థాన ఫొటోగ్రాఫర్ ఈయన. ఇతను తీసిన ఆ రాజ వంశీయుల ఫొటోల నాణ్యత మొదట్లోనే గుర్తించబడింది. లక్నో మున్సిపల్ ఇంజినీర్‌గా రిటైర్ అయ్యాక ఆ పట్టణ పరిసరాల ఫొటోలు తీసి ‘ది లక్నో ఆల్బమ్’గా ప్రచురించాడు 1874లో. ‘యాన్ ఇల్లస్ట్రేటెడ్ హిస్టారికల్ ఆల్బమ్’ 1880లో ప్రచురించాడు. అందులో అక్కడి రాజులు, తాలుక్దార్లు, ప్రజల ఫొటోలు ఇందులో వున్నాయి. బ్రిటిష్ ఆఫీసర్ జార్జ్ కూపర్ ప్రాపకంలో పనిచేసినందు వల్ల తన ఆల్బమ్‌లను ఆ ఆఫీసర్‌కి అంకితమిచ్చాడు. బ్యూటీస్ ఆఫ్ లక్నో పుస్తకంలో ఇంగ్లీష్, ఉర్దూ రెండు భాషలూ కనిపిస్తాయి.
గోబిందరామ్, ఊడేరామ్ : వీరిద్దరూ ఫొటోగ్రాఫర్లు, తండ్రీకొడుకులు బ్రిటిష్‌రాజ్ కాలంలో జైపూర్‌లో ఫొటోగ్రఫీ చేశారు. ఆనాటి బ్రిటిష్ కాలంలో సామాన్య ప్రజల జీవన వివరాలు, ఆస్థాన రాజ కుటుంబం విషయాలు, అలాగే ప్రకృతి దృశ్యాలు ఎన్నో చిత్రాలుగా ఫొటోలు తీశారు. 1880 లో జైపూర్‌లో ఫొటో స్టూడియో తెరిచారు. ఆ స్టూడియో ఎంతో ప్రాముఖ్యం సంతరించుకుంది. అక్కడిరాజులు, మహారాజా సవాయి మాథోసింగ్, జోథ్‌పూర్ రాజు మహారాజా సర్దార్ సింగ్ ఫొటోలు తీశారు. రాజస్థాన్ అంతా ప్రయాణించి, సామాన్య మానవుల జీవన విషయాలు, వృత్తి వ్యాపారాలు, నిర్మాణాలు, ఇలా ఎన్నో ఫొటోలు తీశారు. వాటిని పోస్ట్కార్డులుగా వేయటంతో, వీరి ఫొటోలు బహు ప్రచారంలోకి వెళ్లినాయి. ప్రపంచమంతా చేరాయి. ఇటు భారతీయులు, అటు ఆంగ్లేయులు అందరూ వీరి పొటోలు మెచ్చారు.
అన్నపూర్ణా దత్తా : ఈమె 1894లో జన్మించి 1976లో కన్నుమూసింది. ఈమె ఒకానొక మొదటి భారతీయ స్ర్తీ పొటోగ్రాఫర్‌గా గుర్తించాలి. ఆనాడు స్త్రీలు బయటకు ఉద్యోగాల కోసం రాని రోజులు. అలాగే ఫొటోగ్రాఫర్లుగా పురుషులే పనిచేశారు. ఆస్థాన ఉద్యోగాలు వారికే వచ్చాయి. ఆ రోజుల్లో ఆమె ఇళ్లకు వెళ్లి ఫొటోలు తీసేది. ఆమెకు స్టూడియో కూడా లేదు. ఆమెని ఫొటోగ్రాఫర్ మషీమా అనేవారు. ఆ రోజుల్లో స్త్రీలు బయటకు రాక పరదాలో ఉన్న స్ర్తీల ఫొటోలు తీసి ఆమెనే వాటిని కడిగి ప్రింటులు తీసేది. తనే అన్ని పనులూ చేసుకుంటూ వుండేదనేమో ఆమెను మషీమా, ఒక ద్వీపంతో పోల్చారు. విభజన జరగని బెంగాలులో పుట్టి 12వ ఏట ఉపేంద్రనాథ్ దత్తాని వివాహమాడింది. చిత్రమూ, ఫొటోగ్రఫీ సరదా కోసం నేర్చుకున్నా, ఫొటోగ్రపీ ఆమెకు జీవనోపాధి ఇచ్చి కుటుంబమూ పోషించింది.
ఇలా ఈ ఆధునిక మాధ్యమాన్ని ఆహ్వానించి, భారతీయులు కొంతమంది కళాత్మక ఫొటోలు, జీవనోపాధి ఫొటోలు తీసి మొదటి ఫొటోగ్రాఫర్ల జాబితాలో నిలిచారు.
డా.యం. బాలామణి, 8106713356







కామెంట్లు (0)