Magazines

భిన్న కలాలు సాగించిన సంఘటిత పయనం

57 నిమిషాల క్రితం

journey
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 2 నిమిషాల చదవడం

కొన్ని కథలు మనల్ని ఊహల్లో విహరింప జేస్తాయి. కొన్ని కథలు వాస్తవాన్ని కళ్ళముందు పరచి హృదయాన్ని కదలిస్తాయి. కొన్ని కథలు మనసును బలంగా తాకి మన చుట్టూ జరుగుతున్న ఘటనల్లో మన పాత్ర ఏమిటి? అని ప్రశ్నిస్తాయి. కథ కేవలం కల్పితం కానక్కర్లేదు. ఊహకి, వాస్తవానికి మధ్య సంధి కుదిర్చి పాఠకుడిని తనతో పాటు ప్రయాణించేలా చేయగలిగితే కథకులు తమ రచనలో సఫలీకృతులయినట్టే. అటువంటి 25 కథలను ఎంపిక చేసి కూర్చిన సంకలనమే తెలుగు సాహితీవనం ముఖపుస్తక సమూహం వారు ప్రచురించి, ఆవిష్కరించిన ‘గమనం’ కథా సంకలనం. సంపాదకులు ‘శాంతి కృష్ణ’. ప్రముఖ రచయితలకు ప్రాధాన్యమిస్తూనే, కథకు ప్రాముఖ్యతనిచ్చి నూతన కథకులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఎంచుకున్న తెలుగు సాహితీవనం వారి కృషికి ఫలితమే గతంలో వెలువడిన ‘అంతర్వాహిని, కడలి, విభిన్న’ ఇప్పుడు ‘గమనం’ కథా సంకలనాలు. సీనియర్, జూనియర్ అనే వివక్షకు తావివ్వకుండా అకారాది క్రమంలో అమర్చిన 25 కథలను సూక్ష్మంగా పరిచయం చేసే ప్రయత్నమిది. “ఎంతెంత దూరం - ఏనుగు నరసింహారెడ్డి’’.. కవి లేదా రచయిత ఆలోచన కాలానికి సమతుల్యంగా గానీ కాలం కన్నా వేగంగా గానీ ప్రయాణిస్తుందన్న మాటకు అసలైన ఉదాహరణ ఈ కథ. తరాల తరబడి పాతుకుపోయిన నిరుద్యోగ సమస్యకు కారణమేమిటో గ్రహించి,

అపసవ్యంలో నడుస్తున్న వ్యవస్థకు వ్యతిరేకంగా తమ అసహనాన్ని ప్రదర్శించాలన్న యువతరం గళాన్ని తన కలంలో నింపి ఆలోచనా ప్రేరితమైన కథ అందించారు రచయిత. ఇంకా ఈ సంకలనంలో “అంతర్నిహిత - వారణాసి నాగలక్ష్మి”, “అందం - సొతుకు రత్నజానకి”, “కో లివ్ - వివేక్ లంకమల”, “నీడ వదిలిన దేహం - రూప్ కుమార్ డబ్బీకార్”, “నులి తీగలు - పర్కపెల్లి యాదగిరి”, ‘‘పడిపోయిన చోటే - తంగెళ్ల శ్రీదేవి రెడ్డి’’, ‘‘మనువు - తగుళ్ళ గోపాల్’’, ‘‘మళ్ళీ ఊరెళ్ళాలి - సత్యాజీ’’, ‘‘84 వనవాసం నెంబరోడు- మారుతి పౌరోహితం’’, ‘‘వింటావా రాధిక - శాంతికృష్ణ’’.. వంటి గొప్ప కథలు ఉన్నాయి. కథా సంకలనాన్ని సూక్ష్మంగా సమీక్షించాలంటే.. ఈ కథల ద్వారా కొన్ని కులాలు, ప్రాంతాలు, ఆచారాలు, కట్టుబాట్లు, సంప్రదాయాలతో పాటు, బాహ్య ప్రపంచానికి తెలియని కొన్ని తెగల కఠిన జీవన విధానాలను కూడా కళ్ళముందుంచారు రచయితలు. స్త్రీలు సమాజంలో ఎదుర్కొంటున్న వేధింపులు, సమస్యలతో పాటు, వివేకంతో చక్కదిద్దుకుంటున్న విధానాలను కూడా స్పష్టం చేసారు. కొన్ని కథలలో వినియోగించిన రాయలసీమ, తెలంగాణ మాండలికాల ద్వారా ప్రాంతాల యాసను, భాషను నిక్షిప్తం చేసే ప్రయత్నం చేసారు. సీనియర్ రచయితల కథలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో కథలను కూర్చిన వర్ధమాన కథకుల కృషి అభినందనీయం. కథలన్నీ కేవలం సామాజికాంశాలు కావడం వెనుక సంకలన రూపకర్త సామాజిక బాధ్యత బహిర్గతమవుతుంది. ఒక సందేశాత్మకమైన కథా సంకలనాన్ని వెలువరించిన తెలుగు సాహితీవనం వ్యవస్థాపక అధ్యక్షులు శాంతికృష్ణకి, విలువైన అంశాలతో కథలను రూపొందించిన కథకులకులందరికీ పేరు పేరునా అభినందనలు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్