Magazines

మతం లేని కళ.. కులం లేని కళాకారుడు

26 సెప్టెంబర్, 2026

కళాకారుడు

కళాకారుడు

avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 4 నిమిషాల చదవడం

అల్లీరాణి, అర్జునుడు, రాముడు, హనుమంతుడు, పుండరీకుడు, సత్యహరిశ్చంద్రుడు, చింతామణి, సతీ సక్కుబాయి, సారంగధరుడు, శివుడు, పార్వతి. పాత్ర ఏదైనా సరే... దాన్ని ధరించేవాడు కాదు. ఆ పాత్రలోకి ఒదిగిపోయేవాడు. అంతటి అభినయం. కానీ.. ఒక ప్రశ్న. ఆ వేషాల వెనుక ఉన్న మనిషిని మనం ఎప్పుడైనా చూసామా? ఆ కళాకారుడి మతం ఏమిటని అడిగామా? అతని కులం ఏమిటని అడిగామా? అతని ఇంట్లో పొయ్యి వెలిగిందా అని తెలుసుకున్నామా? రంగస్థలంపై వేలాది మందిని అలరించిన ఆ కళాకారుడు.. తన జీవిత రంగస్థలంలో మాత్రం ఈ రోజు ఒంటరిగా నిలబడి ఉన్నాడు. అతడే మహమ్మద్ అక్బర్ పాషా.

ఓరుగల్లు నేలలోని హన్మకొండ జిల్లా పరకాల మండలం పోచారం గ్రామం. చిన్న పల్లె. ముస్లిం కుటుంబాలు. మసీదు. ఐదుసార్లు నమాజ్ చేసే సంప్రదాయ జీవితం. అదే వాతావరణంలో పెరిగాడు అక్బర్ పాషా. తండ్రి అంకుస్. తల్లి అమీనాబి. చదువు పదో తరగతితోనే ఆగిపోయింది. అయితే తొమ్మిదో తరగతి నుంచే అతని మనసు పుస్తకాల కంటే రంగస్థలం వైపు మళ్లింది. 1974 నుంచి యక్షగానం, నాటకరంగం అతని జీవితంలో భాగమయ్యాయి.

రంగస్థలానికి మతం లేదు
అయితే ఈ ప్రయాణం పూలబాట కాదు. “మనం ముస్లింలం.. హిందూ నాటకాలు ఎందుకు వేస్తావు?”, “హిందూ దేవుళ్ల వేషాలు ఎందుకు వేస్తావు?” అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. అడుగడుగునా అభ్యంతరాలు వచ్చాయి. తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందారు. కానీ పాషా వెనక్కి తగ్గలేదు. “నాటకానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు. కళ విశ్వవ్యాప్తం’’ అంటారు ఆయన. కాలం గడిచింది. మొదట ఆశ్చర్యంగా చూసినవారే తర్వాత అతని నటనకు ముగ్ధులయ్యారు. రాముడిగా నిలబడితే రాముడిని చూశారు. కృష్ణుడిగా కనిపిస్తే కృష్ణుడినే చూశారు. కళ ముందు మతం కనిపించలేదు. అదే అక్బర్ పాషా ప్రయాణం చెప్పిన పెద్ద సత్యం.

రాముడిగా నిలిచిన పాషా
రాముడి వేషంలో ఒక ముస్లిం కళాకారుడు. ఒకప్పుడు అది కొందరికి ఆశ్చర్యం. తర్వాత అదే ప్రజలకు అద్భుతం. హిందూ దేవాలయాల్లో ఆయన్ని ఆహ్వానించారు. వివిధ వర్గాల ప్రజలు ఆయన నటనను గౌరవించారు. రాముడి పాత్రలో ఆయనకు లభించిన ఆదరణ, కళకు మతపు గోడలు ఉండవని చెప్పే అనుభవంగా నిలిచింది. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ వేడుకల్లో రాముడి వేషంలో ప్రత్యేక శకటంలో ఆయనకు స్థానం కల్పించి ఊరేగించారని పాషా చెబుతున్నాడు. ఆ దృశ్యాన్ని ఒక్కసారి ఊహించండి. రాముడి వేషంలో ఒక ముస్లిం కళాకారుడు, చుట్టూ ప్రజలు, మధ్యలో కళ. అక్కడ పేరు, మతం, కులం వెనక్కి వెళ్లి పాత్ర ముందుకు వచ్చింది.

కళ కోసం కరిగిపోయిన జీవితం
తండ్రి సంపాదించిన పది ఎకరాల భూమి ఉంది. కుటుంబం ఉంది. ఆస్తి ఉంది. భవిష్యత్తుపై ఆశ ఉంది. కానీ పాషా గుండెల్లో మాత్రం ఒకే ఒక్క తరగని సంపద కళ. “పెళ్లి చేస్తే మారతాడు” అనుకున్నారు తల్లిదండ్రులు. మైమునాతో వివాహం జరిగింది. మొదట్లో భార్య కూడా “నాటకాలు వద్దు” అంది. అప్పుడు పాషా ఆమెతో “నా జీవితం కళకు అంకితం. కళామతల్లి ఒడిలోనే కన్నుమూయాలి. పల్లెలు కళలతో కళకళలాడాలి. పల్లె ప్రజలకు వినోదంతో పాటు విలువలను అందించాలి. నాటక సమాజమే నా లక్ష్యం. ప్రజలే నా కుటుంబం. విలువలే నా సంపద. మేము ఆడే ఆటలు కేవలం వినోదం కోసం కాదు, పల్లె ప్రజాస్వామ్య చైతన్యానికి సంచార నాటక పాఠశాలలు కావాలి. ఇందులోనే నాకు ఆత్మవిశ్వాసం, ఆనందం ఉంది. నీకు ఏ లోటూ రానివ్వను’’ అన్నాడు. అది కేవలం మాటగే మిగలలేదు. పగలు ట్రాక్టర్ డ్రైవర్‌గా పొలాల్లో కష్టపడేవాడు. రాత్రి రంగస్థలంపై కళాకారుడిగా మారేవాడు. మేకప్ వేయడం, వేషాలు ధరించడం, డైలాగులు చెప్పడం, చప్పట్లు అందుకోవడం. లైట్ల వెలుగుల్లో రాత్రి మెరుపులు. తెల్లారితే మళ్లీ తండ్లాట. అలా సాగింది అతని జీవితం.

కళ అతనికి వినోదం కాదు, జీవితం
లత్కోర్ సాబ్‌గా నవ్వించాడు. రాముడిగా భక్తిని రేకెత్తించాడు. కృష్ణుడిగా మెప్పించాడు. సతీ సక్కుబాయిగా కన్నీళ్లు తెప్పించాడు. ఆర్థిక కష్టాలు వచ్చినా, ఆకలి సమస్యలు ఎదురైనా, సామాజిక ఒత్తిళ్లు వచ్చినా కళపై అతని సంకల్పం మాత్రం చెదరలేదు. కళ అతనికి వినోదం కాదు. జీవించే విధానం. అధికారాన్ని స్తుతించడమే కళ కాదని, అన్యాయాన్ని ప్రశ్నించడం కళాకారుడి బాధ్యతని నమ్మాడు. అందుకే పాషా కేవలం నటుడు కాదు. ప్రజల మధ్య తిరిగే కళాకారుడు. ఒక సంపూర్ణ ఉద్యమకారుడి తత్వం అతని కళలో కనిపిస్తుంది.


బస్తాల్లో మూటగట్టిన గౌరవం
అవార్డులు వచ్చాయి. సన్మానాలు వచ్చాయి. సర్టిఫికెట్లు వచ్చాయి. శాలువాలు వచ్చాయి. మెమెంటోలు వచ్చాయి. ఎన్నో వేదికలు ఆయనను వేనోళ్ల పొగిడాయి. వాటిని ఎక్కడ పెట్టాలో తెలియక కాదు.. ఇంట్లో వాటికి స్థలం లేక బస్తాల్లో మూటగట్టి అటకెక్కించినంతగా సత్కారాలు అందుకున్నాడు. 1962లో పుట్టిన అక్బర్ పాషాకు ఇప్పుడు 64 ఏళ్లు. కీర్తి ఉంది. జ్ఞాపకాలున్నాయి. దశాబ్దాల అనుభవం ఉంది. వేలాది ప్రేక్షకుల చప్పట్లు ఉన్నాయి. కానీ.. చేతిలో వ్యవసాయ భూమి లేదు. తలదాచుకునే సొంత ఇల్లు లేదు. వృద్ధాప్యానికి తగిన భరోసా లేదు. కుటుంబ అవసరాలు, చెల్లెళ్ల పెళ్లిళ్లు, పిల్లల పెళ్లిళ్లు... ఇలా తండ్రి ఇచ్చిన పది ఎకరాల భూమి కూడా కాలక్రమంలో అమ్ముకోవాల్సి వచ్చింది. కళ ఇచ్చింది కీర్తి. కానీ కుటుంబం వేసిన ఒక ప్రశ్న మాత్రం అతని గుండెల్లో గుచ్చుకుంది. “నాన్నా... కీర్తితో కడుపు నిండుతుందా?” ఆ ప్రశ్న తన మనసును మెలిపెట్టినట్టయిందని పాషా చెబుతాడు. కళ్లలో నీళ్లు. కాళ్ల కింద నేల కదిలినట్టయిన బాధ. అంతలోనే.. రంగస్థలం తెరుచుకుంటుంది. లైట్లు వెలుగుతాయి. పాత్రలోకి ప్రవేశిస్తాడు. ప్రేక్షకులు చప్పట్లు కొడతారు. ఆ క్షణంలో తన బాధనంతా మరిచిపోతాడు. అదే కళాకారుడి జీవితం.


జీవన భరోసా ఏదీ?
ప్రజలకు వినోదంతో పాటు మానవ విలువలను అందించే మహోన్నతమైన కళ యక్షగానం. అందుకే అది తరతరాలుగా పల్లె ప్రజలను అలరించింది. భిన్నత్వంలో ఏకత్వాన్ని, సర్వమత సామరస్యాన్ని పలికించే శక్తి దానికి ఉంది. నేడు పాషా మేకప్ ఆర్టిస్టుగా, నాటక కళాకారులకు కాస్ట్యూమ్స్ అందిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇది ఒక్క అక్బర్ పాషా కథ కాదు. తెలంగాణ జానపద కళాకారుల కన్నీటి గాథలో ఒక అధ్యాయం. తెలంగాణ ఉద్యమంలో ప్రజల గుండెలను కదిలించిన కళలు, డప్పు కొట్టిన చేతులు, పాడిన గొంతులకు భరోసా ఏది? ప్రజల కోసం పాడిన కళాకారుడి ఇంట్లో పొయ్యి వెలిగించేది ఎవరు?

సామాజిక భద్రత కావాలి
ప్రజలు తమకు చేతనైనంతగా కళాకారులను ఆదుకుంటున్నారు. ప్రదర్శనకు పిలుస్తున్నారు. పట్టెడు అన్నం పెడుతున్నారు. అవసరమైనప్పుడు చేయూతనిస్తున్నారు. అక్బర్ పాషా లాంటి కళాకారుడికి ప్రజల ఆదరణే ఇంతకాలం ప్రధాన బలం. కానీ ప్రజల ప్రేమకు తోడు వ్యవస్థాగతమైన భరోసా కూడా అవసరం. అడుక్కుంటే వచ్చేది బిక్ష.. పోరాడితే వచ్చేది హక్కు అని నమ్మిన ప్రజా కళాకారుడు అక్బర్ పాషా. అతని తన కోసమే మాట్లాడటం లేదు. తనలాంటి వేలాది కళాకారుల కోసం మాట్లాడుతున్నాడు. కళాకారుల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు మరింత సమర్థంగా అమలుకావాలి. వృద్ధ కళాకారులకు అందాల్సిన పెన్షన్ ప్రతి కళాకారుడి గడపకు చేరాలి. ఆరోగ్య భద్రత ఉండాలి. ప్రయాణ సౌకర్యాలు ఉండాలి. కళా ప్రదర్శనలకు నిరంతర అవకాశాలు ఉండాలి. కళాకారుల కుటుంబాలకు కూడా అవసరమైన సామాజిక భద్రత కల్పించాలి.


భూపతి వెంకటేశ్వర్లు, 9490098343

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్