స్వాతంత్ర్య పోరాటంలోనే కాదు, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా కళాకారులు మన దేశ సామాజిక సంస్కృతిక గుర్తింపు ఇదీ అని చెప్పటం కోసం చిత్రాలు వేశారు. బెంగాలు కళాకారులు పశ్చిమ కళా పద్ధతులు వదిలి మనదేశ జీవన సంస్కృతి చూపటానికి ప్రయత్నిస్తే, బొంబాయి కళాకారులు మన దేశ జీవనశైలి, ఆధ్యాత్మికత గురించి చిత్రాలు వేస్తూ పాశ్చాత్య కళా పద్దతులూ ఆహ్వానించారు. మద్రాసు కళాకారులు తమ ద్రవిడ సంప్రదాయ, ఆధ్యాత్మిక, తంత్ర సంప్రదాయాన్ని చూపి తమ ప్రత్యేకత నిలుపుకున్నారు. పంజాబు కళాకారులు మరో దారి ఎన్నుకున్నారు. వారూ వారి ప్రాంతీయ ఆధ్యాత్మిక ప్రవచన కర్తలు, జానపద కథలూ నిత్య జీవన కథలూ చిత్ర విషయాలుగా ఎన్నుకుని, ఇవి మా ప్రాంతీయ ఆధునిక కళలని చాటారు.
పంజాబ్ కళాకారుల పేరు వినగానే ముందుగా అందరికీ గుర్తువచ్చేది ఎస్.జి. ఠాకుర్ సింగ్. ఈయన 1894లో అమృత్‌సర్ వద్ద వెర్కా అనే గ్రామంలో పుట్టాడు. లాహోర్ (ఈనాటి పాకిస్తాన్)లో మొహమ్మద్ ఆలమ్ వద్ద చిత్రం నేర్చుకున్నాడు. ముందు 2 సంవత్సరాలు ఇంజినీరింగ్ చదివినా ఇష్టపడక, బొంబాయిలో ఉన్న ఆలమ్ పిలువగా అక్కడికి వెళ్లాడు. ఆలమ్ అక్కడ నాటక వేదికల కోసం చిత్రాలు వేస్తుండేవాడు. అతని వద్ద ఆ పని చేయటం మొదలుపెట్టాడు. అక్కడ అలాగే ప్రకృతి దృశ్యాల చిత్రాలు వేస్తుండేవాడు. చౌపాటి బీచ్ అనే అతని చిత్రానికి సిమ్లా ఫైన్ ఆర్ట్ సొసైటీ బహుమతి లభించింది. బొంబాయి నుండి కలకత్తా వెళ్లి అక్కడా నాటక కంపెనీల కోసం చిత్రాలు వేశాడు. ఇతను పోట్రేటులు, మందిరాల చిత్రాలు, కోటలు ఇలా ఎన్నో వివిధ విషయాలపై చిత్రాలు వేశాడు. ఇతను ప్రత్యేకంగా ఏ ఆర్ట్ స్కూల్‌లోనూ చదవకపోయినా ఆ పద్ధతిన నిజరూప చిత్రాలు వేశాడు. వెలుతురు ప్రభావం చిత్రంపై చక్కగా చిత్రించేవాడు. ఈయన ‘స్నానం తరువాత’ అనే స్త్రీ చిత్రం ఆమె తడి బట్టలతో వెనక్కి తిరిగి వుండగా గీసిన ఈ చిత్రం ఎంతో ప్రఖ్యాతి చెందింది. కలకత్తా కళాకారుడు హేమేంద్రనాథ్ మజూమ్‌దార్ ఇలాంటి చిత్రాలకు ప్రసిద్ది. బహుశా హేమేంద్ర చిత్రాల ప్రభావం ఇతనికి అబ్బి వుండవచ్చు. నిజానికి హేమేంద్ర రాజా రవివర్మ చిత్రాల ప్రభావితుడు. ఠాకుర్ సింగ్ నిజానికి తన పంజాబ్ ధ్యాస వదలలేదు.
1926లో కలకత్తాలోనే పంజాబ్ ఫైన్ ఆర్ట్ సొసైటీ అని తెరిచి తన ప్రదర్శనలు చేసేవాడు. 1931లో అమృత్‌సర్‌కి తిరిగి వెళ్లిపోయాడు. అక్కడ ఠాకుర్‌సింగ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని తెరిచాడు. అది ఇప్పుడు పంజాబ్ ప్రభుత్వ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ విభాగంగా పనిచేస్తుంది. ఈయన కనీసం వేయి చిత్రాలైనా వేశాడు. తన సమాజ నిజ జీవన విషయాలు చిత్రాలుగా వేశాడు. పరిసర ప్రాంతాలు, దేశ నాయకుల పోట్రేటులు వేశాడు. ఎన్నో బహుమతులూ పొందాడు. పంజాబ్ లెజిస్లేసివ్ కౌన్సిల్‌కి 1952లో ఎన్నుకోబడ్డాడు. దేశ లలిత కళా అకాడమీకి కార్య నిర్వాహక సభ్యుడయ్యాడు. 1956లో అమృత్‌సర్‌లో జరిగిన జాతీయ కాంగ్రెస్‌కి అధ్యక్షుడయ్యాడు. 1973లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. 1976లో కన్నుమూశాడు.
ఎస్.శోభాసింగ్ : ఈయన 1901లో హరగోబిందపూర్, పంజాబ్‌లో పుట్టాడు. ఇతను పాశ్చాత్య పద్ధతిన తైల వర్ణ చిత్రాలు వేశాడు. పంజాబ్ ఆధ్యాత్మిక సిక్కు గురువుల చిత్రాలు, అక్కడి జానపద కథలు చిత్రాలుగా వేశాడు. ఒక విధంగా చెప్పాలంటే సిక్కు గురువుల, నాయకుల చిత్రాలు ఎంత నిజరూప చిత్రాలుగా వేశాడంటే, ఈనాడు ప్రతి పంజాబీ సిక్కు గృహంలో గోడకున్న గురువుల చిత్రాలు ఈయన వేసిన చిత్రాల ముద్రణలే. రవివర్మ హిందూ దేవుళ్ల చిత్రాలు సమాజానికి ఎలా పరిచయం చేశాడో, ఆయన వేసిన దేవీ దేవతల చిత్రాలు ఇళ్ల గోడలపై, పూజా మందిరాలలో ఎలా గౌరవంగా తగిలించబడి వుంటాయో, ఈయన వేసిన సిక్కు గురువుల చిత్రాల పద్ధతి అదేను. తను గురునానక్ పై ఆధ్యాత్మిక ధ్యాసలో వున్నప్పుడు తలచిన రూపం చిత్రంగా వేశాడు. ఏకో సిమ్రో నానక్ అనే కీర్తనపై వేసిన చిత్రం, అర్థం, ప్రతీచోటా వున్న ఆ సృష్టికర్తను ప్రార్థించు అనే ఆధ్యాత్మిక భావనను సూచిస్తుంది.
ఇతనికి 1983లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సన్మానించింది. 1919 నుండి 1923 వరకు బ్రిటిష్ సేన కోసం ప్రణాళికల చిత్రాలు గీసే పనిచేశాడు. ఆ విధంగా లాహోర్, ఢిల్లీ, బొంబాయి తిరిగి చివరికి 1947లో హిమాచల్ ఆండ్రెట్టాలో స్థిరపడ్డాడు. 1926లో అమృత్‌సర్‌లో స్టూడియో, 1931 ఢిల్లీలో స్టూడియో పెట్టి పనిచేసినా 1946లో లాహోర్‌కి వెనక్కి వెళ్లినా, దేశ విభజనలో తిరిగి వచ్చాడు. 1949లో ఆండ్రెట్టాలో సింగ్ ఆర్ట్ గ్యాలరీ పెట్టాడు. ఒక వంద చిత్రాలైనా వేశాడు. సిక్కు గురువుల జీవిత చరిత్ర, సోనీమహీవాల్, హీర్ రాంఝా వంటి జానపద కథల చిత్రాలు వేశాడు. లాహోర్‌లో ఉన్నప్పుడు ఒక చిత్రానికి కళాదర్శకుడిగా కూడా పనిచేశాడు. 1986లో అండ్రెట్టాలో మరణించాడు. ఈయన మ్యూరల్ పార్లమెంట్ భవనంలో వుంది. ఈయనపై ఒక డాక్యుమెంటరీ తీయబడింది. ఒక పుస్తకమూ హృదయపాల్ సింగ్ రాశాడు. పంజాబ్ సిక్కుల ఆధ్యాత్మిక గురుత్వం ఏమిటో చెప్పినట్టు వుంటాయి ఈయన చిత్రాలు.
కిరపాల్ సింగ్ : 1923 పంజాబ్‌లోని గ్రామం వారాచైన్ సింగ్‌వాలాలో జన్మించాడు. పంజాబ్‌లోని చాలామంది కళాకారులు, ఈయనకు మల్లే వడ్రంగి కుటుంబాలలో పుట్టినవారు. చిన్నతనంలో ఇతను ఇళ్లలో చేసే పులకారీ అనే పంజాబ్ కుట్టుపనులు చూసి చాలా ప్రభావితమయ్యాడు. తనకూ తన వేళ్లు ఉపయోగించి ఏదైనా డ్రాయింగ్ వేయాలని వుండేదట. చారిత్రక స్థలాల డ్రాయింగ్‌లు వేసేవాడు. ఢిల్లీ, కర్నాల్‌కి వెళ్లి అక్కడ పుస్తకాలకు చిత్రాలు, కవర్లు చేశాడు. 1950 నుండి చాలా చరిత్ర చదివాడు. వారి కట్టూ బొట్టూ విషయాలు గ్రహించాడు. ఈయన ఒక కొత్త రకమైన చిత్ర విషయాలు వేశాడు. బలిదానం ఇచ్చిన నాయకుల చిత్రాలు వేశాడు. ఇందులో ఆధ్యాత్మిక నాయకులు, చరిత్రలోని నాయకుల కథలు వున్నాయి. నాటక పక్కీలు తెలియజేయటానికి నాటక పక్కీలో విషయ వివరణ చేస్తాడు. 1940లో లాహోర్ వెళ్లి అక్కడి చారిత్రాత్మక గురుద్వారాలన్నీ చూసి వచ్చాడు. అమృత్‌సర్‌లోని సిక్కు మ్యూజియం, గురుతేజ్ బహదూర్ మ్యూజియం, ఆనందపూర్ సాహిబ్, ఆంగ్లో సిక్ మ్యూజియం ఫెరోజేషాలోనూ నిర్మించడంలో సహాయం చేశాడు. గురుహర గోవింద్ అనే ఆరవ సిక్కు గురువును 1612లో జహంగీర్ మొగలురాజు గ్వాలియర్ కోటలో బంధించాడు. ఈ గురువు తాను స్వతంత్రం పొందటం కాక తనతో పాటు 52 రాజపుత్ రాజుల విడుదల కూడా కోరి కారాగారం నుండి విడిపించాడు. ఈ దినాన్ని ‘బందీ చోడ్ దివస్’ గా సిక్కులు లంగరు జరిపి ఈ నాటికీ సంబరాలు చేస్తారు. ఈ విషయంపై ఈ కళాకారుడు వేసిన చిత్రం గుర్తించదగ్గది. ఇలాంటి చారిత్రాత్మక చిత్రాలు, సామాన్య కష్టజీవుల చిత్రాలు ఎన్నో వేశాడు. 1990లో కన్నుమూశాడు.
ఎస్.త్రిలోక్ సింగ్ : 1914లో జర్తౌలీ, లుథియానాలో జన్మించాడు. తండ్రి రైల్ ఇంజనీర్‌గా పనిచేయడం వలన ఎన్నో ప్రదేశాలు తిరిగాడు. అందువల్ల ఇతనికి చాలా భాషలు కూడా వచ్చు. బెంగాలీ నుండి పంజాబీలోకి పుస్తక అనువాదం కూడా చేశాడు. సిక్కుల గురుబాణీని చక్కగా పఠనం చేశాడు. గురుముఖం రాయటం నేర్చాడు. సిక్కుమతం, ఆధ్యాత్మిక చిత్రాలే కాక, జానపద కథలు, చరిత్రకు సంబంధించిన చిత్రాలు వేశాడు. తల్లి చిన్నతనాన పోవడంతో తాత దగ్గర పెరిగి మతపర విషయాలు చాలా నేర్చాడు. ప్రభుత్వ కార్యాలయాన కళాకారుడిగా పనిచేశాడు. ఠాకుర్ సింగ్‌కి శిష్యుడు. మహాత్మాగాంధీ, సుభాష్‌చంద్రబోస్‌ల చిత్రాలు వేసి 1938లో హరిపూర్ కాంగ్రెస్ సభకు పంపాడు. ఈయన వేసిన మాతా గుజరీ చిత్రం చెప్పుకోదగ్గది. సిక్కు 9వ గురువు, గురుతేజ్ బహదూర్‌కి పత్ని, పదవ గురువు గురు గోబింద్ సింగ్‌కి తల్లి. 1633లో వివాహమై అమృత్‌సర్‌కి వచ్చింది.
1704లో మొగలులు, ఈనాటి ఆనందపూర్, ఆనాడు ఈమె తన భర్త మరణం తరువాత వుంటున్న ఊరిని ఆక్రమించారు. గ్రామం నుండే అందరూ ఖాళీ చేసి వెళ్తున్నప్పుడు ఈమె తన పిల్లలు మిగిలిన వారి నుండి వేరు పడటం వలన మోసంతో ఈమెను ఖైదీ చేసి ‘ఠండాబుర్జ్’పై వదిలేశారు. ఆమె అక్కడే మరణించింది. ఈ కథని చిత్రంగా వేసిన ఘనత త్రిలోక్‌సింగ్‌దే.
పంజాబ్ సిక్కు కళాకారులు ఆధునిక కళలకు, తమ ప్రాంతీయ ఆధ్యాత్మికత, చరిత్ర, జానపద చిత్రాలు తమ వంతు గుర్తింపుగా ముందుంచారు.
[ఈ వ్యాసంలోని చిత్రాలన్నీ చండీగఢ్ మ్యూసియం లో ఉన్నాయి .]
డా.యం. బాలామణి, 8106713356
ప్రాంతీయతను ముందుంచిన పంజాబు ఆధునిక కళాకారులు
26 సెప్టెంబర్, 2026

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 5 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)