Magazines

సురభి బాలసరస్వతి తెరపై గడుసు వేషాలు - కడపటి జీవితంలో ఆకలికేకలు

1 గంట క్రితం

Surabhi Balasaraswathy's on-screen roles - Hunger pangs in her last days
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 5 నిమిషాల చదవడం

తెలుగు చలనచిత్ర చరిత్రలో సురభి బాలసరస్వతి పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. ఒక తరం ప్రేక్షకులను తన నటన, కైపెక్కించే కళ్లతో ఆకట్టుకున్న ఈ వెండితెర తార ప్రస్థానం రంగస్థలం నుంచి ప్రారంభమైంది. అల్లు రామలింగయ్య, రేలంగి, రమణారెడ్డి వంటి హాస్యనటులతో ఆమె కాంబినేషన్ ప్రేక్షకులకు ఎంతో మెప్పించింది. ఒకప్పుడు సినిమాల్లో రేలంగి - గిరిజ జంటకు ఎంత క్రేజ్ ఉండేదో, మొదట్లో రేలంగి - సురభి బాలసరస్వతి జంటకు కూడా అంతే క్రేజ్ ఉండేది.

బాల సరస్వతి సురభి నాటక సమాజం నుండి సినిమా రంగంలోకి వచ్చింది. 1885లో కడప జిల్లా సురభి గ్రామంలో వనారస గోవిందరావు చేత స్థాపించబడిన ఈ సమాజం, నాటకరంగానికి ఎనలేని సేవలందించింది. సురభి నాటక సంస్థ ప్రత్యేకత ఏంటంటే రంగస్థలంపై స్త్రీ పాత్రలను స్త్రీలే పోషించడం. ఆ రోజుల్లో ఇది ఒక విప్లవాత్మక మార్పు. ఈ సమాజంలో నటించే వాళ్ళంతా ఒకే కుటుంబ సభ్యులు కావడం వల్ల మహిళలు నిర్భయంగా నాటకాల్లో పాల్గొనేవారు. సమిష్టి కృషి, వారసత్వం, భక్తిభావం, పట్టుదలకు ఈ సంస్థ పెట్టింది పేరు. సురభి నాటక సమాజం నుండి తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలితరం నటి సురభి కమలాబాయి. బాలసరస్వతి కమలాబాయి అక్క కూతురు. ఇదే కుటుంబం నుండి వచ్చిన సురభి కమలాబాయి, బాలసరస్వతికి అవ్వ వరుస అవుతారు.

సురభి కమలాబాయి 1931-32లో వచ్చిన తొలి టాకీ సినిమా ‘భక్త ప్రహ్లాద’లో హీరోయిన్‌గా నటించి, తెలుగు వెండితెరపై నటించిన మొట్టమొదటి హీరోయిన్‌గా చరిత్ర సృష్టించింది. ఈ సురభి కమలాబాయి ప్రేరణతోనే సురభి బాల సరస్వతి కూడా సినిమాల్లో నటించాలనుకునే అభిలాషను పెంచుకున్నది.

పురుష వేషాలు కూడా...

సురభి బాలసరస్వతి1931, జూలై 3న శ్రీకాకుళం జిల్లా పొందూరులో జన్మించింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సురభి నాటక సమాజం వారసురాలు కావడంతో ‘గోవిందరాయ నాట్యమండలి’లో బాలనటిగా ప్రవేశించింది. ఆమె నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేవి. వంశ పారంపర్యంగా వస్తున్న కళాకారుల వృత్తి కావడంతో చిన్నతనం నుండే నటనకు అలవాటు పడ్డది. సురభి నాటక సమాజం ప్రదర్శనల్లో సీన్ల మధ్యలో ఆమె నాట్యం చేసేది. రాణి ప్రమీల, బాలనాగమ్మ, భక్త ప్రహ్లాద వంటి నాటకాల్లో చిన్న పాత్రలతో మొదలై క్రమంగా పెద్ద రోల్స్ వేసింది. ఆమె ప్రత్యేకత ఏంటంటే స్త్రీ పాత్రలతో పాటు పురుష వేషాలు కూడా వేసి మెప్పించేది. రాణి ప్రమీల, బాలనాగమ్మ, భక్త ప్రహ్లాద వంటి నాటకాలలో ప్రాణం పోసిన బాలసరస్వతి, స్త్రీ పాత్రలతో పాటు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి పురుష పాత్రలను కూడా అద్భుతంగా పోషించింది. ‘లంకా దహనం’లో శ్రీరాముడిగా, ‘కృష్ణలీలలు’లో కృష్ణుడిగా, ‘కనకసేన’లో కనకసేనుడిగా నటించేది. పౌరాణిక నాటకాలతో పాటు ఈనాడు, పరివర్తన, ఎదురీత వంటి సాంఘిక నాటకాలలోనూ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. విజయవాడలో జరిగిన నాటక పరిషత్ పోటీల్లో “ఈనాడు” నాటకానికి ప్రథమ బహుమతి లభించగా, అందులో నసీం పాత్ర పోషించిన బాలసరస్వతి వెండి కప్పును అందుకున్నది. ఇంకా ‘రాణీ ప్రమీలా’ నాటకంలో ప్రమీల పాత్ర ధరించి పెద్ద పేరు సంపాదించింది. వెంకటగిరి అమెచ్యూర్స్‌ అనే నాటక సంస్థలో చేరి సాంఘిక నాటకాలలో పురుష పాత్రలకు పెట్టింది పేరుగా ఒక వెలుగు వెలిగారు.

ద్రోహితో సినీ ప్రవేశం

సురభి కమలాబాయి సినిమాలో నటిస్తుండగా, బాలసరస్వతి ఓసారి షూటింగ్ చూడటానికి మద్రాసులోని శోభనాచల స్టూడియోస్‌కి వెళ్లింది. ప్రముఖ నటులు ప్రతిభా శాస్త్రి, కస్తూరి శివరావు దృష్టిలో పడింది. ద్రోహి (1948) కె.ఎస్. ప్రకాశ్ రావు సరసన నర్సు పాత్ర ద్వారా సినీ ప్రవేశం చేసింది. ఆ సినిమా పూర్తయ్యాక నాటక సాంప్రదాయం దెబ్బతింటుందని తల్లి ఆమెను తిరిగి ఇంటికి తీసుకెళ్ళిపోయింది. అయితే సినిమాలలో నటించాలనే కోరికతో తిరిగి తండ్రి ప్రోద్బలంతో 1949లోఎన్టీఆర్ తొలి చిత్రం ‘మన దేశం’ కోసం మద్రాస్ వచ్చి నటించింది. ఈ సినిమాలో రేలంగితో కలిసి చేసిన ‘పంచదార వంటి పోలీస్ వెంకటస్వామి’ పాట ఆ రోజుల్లో సూపర్ హిట్. ఆ తర్వాత కాలంలో సురభి బాల సరస్వతిది రేలంగి వెంకట్రామయ్యతో హిట్ కాంబినేషన్. సంసారం, శాంతి నివాసం వంటి చిత్రాలలో రేలంగికి జోడీగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నది. 1950లు, 1960లలో తమిళ, తెలుగు చలనచిత్ర పరిశ్రమలలో ప్రముఖ నటిగా రాణించింది. ప్రధాన పాత్రలతో పాటు హాస్య నటిగా, ప్రతినాయికగా కూడా నటించింది. పోషించడంలోనూ పేరు పొందింది.

తమిళంలోనూ గుర్తింపు

రూపవతి (1951 - హీరోయిన్ గా), అర్ధాంగి (వేశ్యగా), అనార్కలి (గోల్నారుగా), తెనాలి రామకృష్ణ (రాజనర్తకిగా), వెంకటేశ్వర మహత్యం, సిరి సంపదలు, పెళ్లి సందడి, గౌరీ మహత్యం, శ్రీకృష్ణార్జున యుద్ధం తదితర చిత్రాలలో గుర్తుండిపోయే పాత్రలు పోషించింది. 1953లో పి. పుల్లయ్య దర్శకత్వంలో, కె.వి. శ్రీనివాసన్ నిర్మాణంలో వచ్చిన ‘మనం పోల్ మాంగళ్యం’లో నటించింది. ఇందులో మరో కథానాయిక సావిత్రి. తమిళం, తెలుగులో ఏకకాలంలో నిర్మించబడిన సంసారం (1950), స్వప్న సుందరి, మాయక్కారి (1951), కాదల్ (1952), ఇంకా మరుమగల్ (1953), అనార్కలి (1955), అమర గీతం(1956), తెనాలి రామన్ (1956), భక్త మార్కండేయ (1957) వంటివి ఉన్నాయి. అలాగే పక్షిరాజా ఫిలిమ్స్ వారి మాలై కన్నన్ (1954), దేవర్ ఫిలిమ్స్ వారి తాయ్‌కు పిన్ తారం (1956, ఎం.ఎ. తిరుముగం దర్శకత్వం) విజయ ఫిలిమ్స్ వారి యార్ పైయన్ (1957, టి.ఆర్. రఘునాథ్ దర్శకత్వం) వంటి నేరుగా తమిళంలో నిర్మితమైన చిత్రాలలో కూడా ఆమె నటించింది. మలైకన్నన్ చిత్రంలో శ్రీరామ్ సరసన ఆమె ‘జానకి’ పాత్రను పోషించింది. అలాగే ద్రోహి(1948), మనదేశం (1949), ప్రేమ (1952), పరివర్తన (1954), నిరుపేదల (1954), తెనాలి రామకృష్ణ (1956), తెనాలి రామకృష్ణ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించింది. ‘తెనాలి రామకృష్ణ’లో రాజనర్తకిగా వైవిధ్యమైన పాత్రల్లో నటించి తన ప్రతిభను చాటుకుంది.

చివరి రోజులలో కష్టాలు

తన 25 ఏండ్ల సినీ జీవితంలో 150కి పైగా చిత్రాల్లో నటించినప్పటికీ, తెలుగు చిత్ర పరిశ్రమ ఆమెను దాదాపు ఒకే తరహా పాత్రలకు పరిమితం చేసింది. బాలసరస్వతిది ముక్కుసూటి మనస్తత్వం. శకునాలు, జాతకాలను నమ్మేది కాదు. జీవితంలో ఒంటరి పోరాటం చేశింది. పరిశ్రమలో తోడు అవసరమని భావించి, దర్శకుడు తాపీ చాణక్యతో కొంతకాలం సహజీవనం చేసింది. ఆయనకు అప్పటికే వివాహమైంది. పిల్లలు లేరు. అయితే తాపీ చాణక్య హఠాన్మరణంతో ఆమె జీవితం తిరోగమనం వైపు మలుపు తిరిగింది. పరిశ్రమ నుండి నిష్క్రమించి సొంత నాటక సమాజం నెలకొల్పి ‘తారా శశాంకం’ నాటకంలో ఆమె తారగా, జెవి రమణమూర్తి చంద్రుడిగా అనేక ప్రదర్శనలు ఇచ్చారు. నలుగురితో స్నేహంగా మెలిగే ఆమె మహానటి సావిత్రికి మంచి స్నేహితురాలు. సావిత్రికి మద్యం అలవాటు చేసింది బాలసరస్వతినే అనే ప్రచారం ఉంది. నిజా నిజాలు ఎవరికీ తెలియవు. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో తీవ్ర అనారోగ్యంతో దాదాపు ఏడాది పాటు మంచం పట్టింది. చివరకు కోలుకొని తిరిగి సినిమాల్లో నటించాలనుకున్నప్పటికీ, అప్పటికే అవకాశాలు తగ్గిపోయినవి. గిరిజ, మీనా కుమారి వంటి కొత్త వారు రావడం, కుటుంబం నుండి తగిన సపోర్ట్ లేకపోవడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. చివరికి ఇంటి అద్దె కట్టడానికి కూడా డబ్బు లేని పరిస్థితి. సినీ అవకాశాలు తగ్గడం, మద్యానికి బానిస కావడం ఆమె చివరి రోజులను దుర్భరంగా మార్చాయి. మద్రాసు వదిలి గూడూరు చేరుకున్న బాలసరస్వతి పూట గడవడానికి కూడా చాలా కష్టాలు పడింది. పొరుగు వారు పెడితే ఇంత తిని కాలం వెళ్లబుచ్చేది. ఇలాంటి దీనమైన పరిస్థితుల్లో 1983 సెప్టెంబర్ 10న గూడూరులో అనాథగా కన్నుమూసింది. రంగస్థలంపై పుట్టి, వెండితెరపై రెండున్నర దశాబ్దాల పాటు వెలుగొందిన ఈ అరుదైన నటి జీవితం విషాదాంతంగా ముగిసింది. 1976లో విడుదలైన ‘దొరలు దొంగలు’ ఆమె నటించిన ఆఖరి సినిమా. ఒక నటిగా, నాట్యకారిణిగా తెలుగు నాటక, సినిమా రంగానికి ఎంతో సేవ చేసిన సురభి బాలసరస్వతి హాస్యభరిత, గయ్యాళి పాత్రలు ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి

బాల సరస్వతి నటించిన చిత్రాలు

ద్రోహి (1948), బాలరాజు (1948), లైలా మజ్ను (1949), మన దేశం (1949), స్వప్నసుందరి (1950), సంసారం (1950), రూపవతి (1951), మంత్రదండం (1951), మాయలమారి (1951), ప్రేమ (1952),నిరుపేదలు (1954), పరివర్తన (1954), అగ్గిరాముడు (1954), అనార్కలి (1955), భక్త మార్కండేయ (1956), తెనాలి రామకృష్ణ (1956), చిరంజీవులు (1956), సారంగధర (1957), శాంతి నివాసం (1960), శ్రీ వెంకటేశ్వర మహత్యం (1960), సిరిసంపదలు (1962), గాలిమేడలు (1962), గులేబకావళి కథ (1962), శ్రీ కృష్ణార్జున యుద్ధం (1963), తిరుపతమ్మ కథ (1963), కానిస్టేబుల్ కూతురు (1963), నాదీ ఆడజన్మే (1964), బొబ్బిలి యుద్ధం (1965), ఆదర్శ కుటుంబం (1969), మాతృ దేవత (1969), ఆనందనిలయం (1971), జీవితచక్రం (1971), అడుగుజాడలు, చిట్టి చెల్లెలు (1970).

హెచ్‌.రమేష్‌‌బాబు,

93916 34727

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్