ఇసై వెలలార్ సామాజిక వర్గంగా పేరు మార్చబడిన తంజావూరు దేవదాసీలు దక్షిణ భారతదేశమంతటా విస్తరించి ఉన్నారు. వీరిలో వీణ ధనమ్మాళ్ కుటుంబంలోని వారు నృత్యా సంగీతాలలో చాలా ప్రఖ్యాతి. వీరి చరిత్రను 17వ శతాబ్దానికి చెందిన పాపమ్మాళ్ వరకు గుర్తించవచ్చు. పాపమ్మాళ్ కుమార్తె రుక్మిణి తంజావూరు ఆస్థాన సంగీతకారిణిగా ఉండేది. పాపమ్మాళ్ మనుమరాలే ప్రసిద్ధ నృత్యకారిణి, సంగీతకారిణి తంజావూరు కామాక్షి (సుమారు 1810–90). తంజావూరు కామాక్షి కుమార్తె సుందరమ్మాళ్ (సుమారు 1830–88). సుందరమ్మాళ్ కుమార్తె వీణ ధనమ్మాళ్ బ్రిటిష్ పాలనా కాలంలో మద్రాసులో దేవదాసి వ్యవస్థపై నిషేధం విధించిన తర్వాత జీవిక కోసం వారు దక్షిణ భారతదేశంలోని కర్ణాటక హైదరాబాద్ స్టేట్లోకి కూడా వలస వచ్చారు. అలా హైదరాబాద్ వచ్చిన వారిలో వీణా ధనమ్మాళ్ సోదరి కూడా ఉంది. ఆమె పేరు తంజావూరు రూపవతి. తంజావూరు రూపవతి కుమార్తెనే టి. లలితా దేవి.
మాటలు నేర్చిన టాకీ సినిమాల్లో నటించిన మన హైదరాబాద్ తొలి హీరోయిన్ టి. లలితాదేవి. హిందీలో ఆమె సరితాదేవిగా పిలువబడి. తెలుగులో మాత్రం టి. లలితాదేవిగా టైటిల్ క్రెడిట్స్‌లో ఆమె పేరు కనిపిస్తుంది. ఆమె 1930లలో పేరున్న కథానాయిక. అసలు పేరు టాంజూరు లలితాదేవి. తంజావూరు కాలక్రమేణా టాంజూరుగా మారింది. తంజావూరుకు చెందిన దేవదాసి సామాజిక వర్గానికి చెందిన ఈ కుటుంబం అంతకు ముందే హైదరాబాదుకు వలస వచ్చింది. నిజాం కాలంలో హైదరాబాదులో వాళ్లు దేవదాసీ నృత్యంచేసి పొట్టపోసుకునేవారు. 1918లో సికిందరాబాదులో రూపాదేవి కుమార్తెగా జన్మించింది లలితాదేవి. వృత్తిపరంగా నేర్చుకోవలసిన సంగీత, నృత్యాలను బాల్యంలోనే అభ్యసించిందామె. అయితే రూపాదేవి బొంబాయికి చెందిన ఒక ధనవంతుడితో సహజీవనం చేసింది. తన తండ్రికి బొంబాయి సినిమా పరిశ్రమతో ఉన్న పరిచయాల వల్ల లలితాదేవికి హిందీ చిత్రరంగ ప్రవేశం 1932లో సులభంగానే లభించింది.
తొలి నాళ్లలో లలితాదేవి సాగర్ ఫిలింస్ కంపెనీ చిత్రాల్లో నటించినట్లు తెలుస్తున్నది. తొలిసారిగా పలానా సినిమాల్లో నటించిందనే వివరాలు మాత్రం ఏవీ లేవు. ఇంపీరియల్ ఫిలింస్ సంస్థ తీసిన సినిమాల్లోనూ ప్రధాన భూమిక పోషించారామె. అప్పట్లో ఎక్కువగా స్టంట్ చిత్రాలు తీసే ‘వాడియా’ వారి సినిమాల్లో ఆమెకు అవకాశాలు వెదుక్కుంటూ వచ్చినవి.
ముఖ్యంగా ‘పంజాబ్ మెయిల్’ (1939) చిత్రంలో సరితాదేవి మరో కథానాయిక. తర్వాత వచ్చిన ‘విజయకుమార్’(1940)లోనూ ఆమెనే హీరోయిన్‌గా నటించింది. హిందీలో హీరోయిన్‌గా మంచి డిమాండ్ ఉన్నప్పుడే రఘుపతిప్రకాష్ తెలుగులో ‘కన్నాంబ’ నాయికగా ప్రతిష్టాత్మకంగా తీసిన ‘చండిక’ (1940)లో నటించడానికి ఎంపిక చేయడంతో ఆమె టి.లలితాదేవిగా తెలుగు సినిమా రంగ ప్రవేశం చేశింది. ఈ సినిమాలో ఆమె మంత్రి భార్యగా నటించింది. అయితే దీనికన్నా ముందుగానే ఈమె నటించిన ‘జయప్రద’ (1939)విడుదలైంది. ఈ రెండు చిత్రాలు ఆమెకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టినవి. తర్వాత వై.వి.రావు తొలిసారిగా సినిమా పరిశ్రమ తీరు తెన్నులపై నిర్మించిన ‘విశ్వమోహిని’ (1940)లో హీరోయిన్‌గా నటింపజేశాడు. హీరోగా ఆయనే నటించాడు. విశ్వమోహిని విజయం తర్వాత లలితాదేవి ‘చంద్రహస’ (1941), ‘సుమతి’ వంటి చిత్రాల్లో నటించింది.
తెలుగులో నటిస్తుండగానే ఆమెకు మరికొన్ని హిందీ చిత్రాల్లో అవకాశం రావడంతో మళ్లీ బొంబాయికి వెళ్లింది. తిరిగి మద్రాసు రాగానే నటించిన సినిమా ‘భీష్మ’. తర్వాత చిత్తూరు నాగయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మించి, దర్శకత్వం వహించిన ‘త్యాగయ్య’లో ‘చపల’ వేషం వేసింది.
వీటితో అటు రెండు తమిళ చిత్రాల్లోనూ నటించినట్లుగా 1948లో వెలువరించిన ‘చిత్రకళ’ అనే గ్రంథంలో యు.డి.ప్రసాద్ అనే తొలి తరం సినీ చరిత్రకారుడు రాశాడు. త్యాగయ్య తర్వాత లలితాదేవి మరే తెలుగు చిత్రంలోనూ నటించినట్లు సమాచారం లేదు. అయితే 1948 నాటికి కూడా ఆమెను బొంబాయి చిత్ర పరిశ్రమలో డిమాండ్ ఉన్న తారగా చెబుతారు. హిందీలో ఆమె నాయికగా పన్నెండు సినిమాలలో నటించింది.
తెలుగులో టి. లలితాదేవిగా, హిందీ చిత్రరంగంలో సరితాదేవిగా పేరున్న ఆమె బొంబాయిలో ఉన్నప్పుడు వాడియా కంపెనీలోనే పని చేస్తున్న కెమెరామెన్ ఎం.ఎ.రెహమాను ప్రేమించి 1935లోనే పెళ్లి చేసుకున్నది. ఈ రెహమాన్ నాటి అవిభక్త హైదరాబాదు స్టేట్‌లోని ఔరంగాబాదులో జన్మించాడు. అలా ఈయనా మన తెలంగాణ వాడే. బొంబాయిలో ఉన్న పోటీని దృష్టిలో ఉంచుకుని లలితాదేవి ఆయనను పట్టుబట్టి మద్రాసు తీసుకువచ్చి తెలుగు సినిమారంగంలో మీర్జాపురం రాజా కంపెనీలో సినిమాటోగ్రాఫర్‌గా స్థిరపడేలా చేసింది. ఆ తర్వాత ఎన్.టి.ఆర్. వంటి మహానటునికి దర్శకత్వంలోని మెళకువలు, కెమెరా పనితనాన్ని నూరిపోసాడు రెహమాన్. ఎన్టీ రామారావు కాలంలోనే ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా కూడా పనిచేశాడు. ఆయనకు రఘుపతి వెంకయ్య అవార్డు కూడా ప్రధానం చేయబడింది. మద్రాసులోనే స్థిరపడిన లలితాదేవి ఆ తర్వాత సినిమా నటనకు దూరమై ఇంటికే పరిమితమయ్యారు. చివరికి మద్రాసులోనే 1961లో ఆమె తుదిశ్వాస విడిచింది. తెలంగాణ నుండి హిందీ సినిమాల్లోకి వెళ్లిన తొలిటాకీల నటిగా, వెండితెర విశ్వమోహినిగా మన సినీ చరిత్రలో ఆమె స్థానాన్ని పొందింది.
హెచ్.రమేష్‌బాబు, 93916 34727






కామెంట్‌లు (0)