మా కాలనీల మా ఆఫీస్ కొలీగ్ కొడుక్కు ఆక్సిడెంట్ అయిందంటే చూడనీకి పోయినం. కాలు ఫ్యాక్చరయింది. కాలిరిగిన అబ్బాయిని హాస్పిటల్లేసి, గిగ్ వర్కర్ ఫుడ్ డెలివరీ అబ్బాయి పొద్దుపొద్దున్నే రాంగ్ రూట్‌లో జెట్‌స్పీడ్ గొచ్చి కొట్టిండట. వాకింగ్ చేసే వాళ్ళు పట్టుకున్నరు. నాలుగైదు దెబ్బలు కూడేసిండ్రంట. కాలిరిగిన అబ్బాయిని హాస్పిటల్లేసినారు.
”రోడ్డు పక్కన నడిచే మనిషిని వెనక నుంచి కొట్టడం నీదే తప్పు హాస్పిటల్ ఫీజు రెండు లక్షలట. కట్టు” అన్నారు.
ఆ డెలివరీ బోరు ”సార్ తప్పు నాదే సార్ ఎంత తొందరగ, ఆగమేగాల మీదన్నట్లు ఫుడ్డు డెలివరి జేస్తేనే గీ జాబ్ లో ఉంచుతరు సార్. లేకుంటే తీసేస్తరు సార్. గా బయానికి స్పీడ్ స్పీడుగొస్తాం సార్. గట్లొచ్చి నా కండ్ల ముందట సచ్చిపోయినోళ్ళున్నరు సార్. బీటెక్ సెకండియర్ సర్. నా కాలేజీ హాస్టల్ అవసరాల కోసం పార్ట్ టైమ్‌గా ఈ వర్క్ చేస్తున్నాను సార్. మాది చిన్న ఊరు. మాకేమి బూమి జాగల్లేవు, దయుంచుండ్రి సార్. నన్ను కోసినా ఒక్క పైసలేనోన్ని” అని కాళ్ళ వేళ్ళ బడితే…
మన ఎంప్లాయిస్ కన్నా ఇన్సూరెన్స్ ఉంటది, అదో ఇదో మేనేజ్ చేసుకోవచ్చు. ఇతను పేద పిలగాడు పంజేసుకుంట చదువుకుంటుండు ఏం జేసేదున్నది?
పోలీస్ కేసు బెట్టినా, మనం గూడా తిరుగాలే పోనీరు అని చాలా రచ్చ నడిసినంక బెదుర్లు బెట్టి, ఆ ఫుడ్ డెలివరీ బోరును వదిలేసినారు మా ఎంప్లాయిస్ కాలనీవాల్లు.
గీ బోరు కోసం మాట కలిపిన వాళ్ళల్ల నేను గూడ వుంటిని. గీ పంచాయతీ నడుస్తుంటే… ఫోన్‌ల వాట్సాప్ కాల్ వూకూకె రింగైతంది, ఏదో కొత్త నంబర్ నుంచి. గీ పంచాయతీ అయిపోయి యింటి కొచ్చేటాలకు రాత్రి పది అయింది. వాట్సాప్ కాల్ ఒకటే మోత మోగుతుంది ఆగకుండా. ఎవరబ్బా గీ పది గంటల రాత్రి అని ‘హలో ఎవరు?’
”మేడం నమస్తే… నేను డాక్టర్ వైదేహి నండి, గైనకాలాజిస్టు” ని.
”ఆ… నమస్తే అండీ చెప్పండి మేడమ్”
”సారీ ఈ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు ఏమనుకోవద్దు మేడమ్, ‘లేడీస్ క్లబ్’ అని మాకు ఒక అసోసియేషన్ ఉందండి. మా క్లబ్బులో డాక్టర్స్, లాయర్స్, ఆఫీసర్స్ భార్యలు, బిజినెస్ విమెన్, సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నామండి. మామూలుగానైతే హెల్త్ క్యాంప్స్ పెట్టడం, ఏవో చిన్న చిన్న గ్యాదరింగ్స్ నడిచేవి”.
నేను మద్యలో ఏమ్మాట్లాడకుండా వింటుంటే…
”మేడమ్ వింటున్నారా?”
”ఆ… ఆ.. వింటున్న”
”సరే, మేం ఈ మధ్య ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి. అదేంటంటే ప్రతినెల ఒక ప్రముఖ మహిళను ఆహ్వానించి, ఆమెతో నాలుగు మంచి మాటలు చెప్పించు కొని, సత్కారం చేయాలని. తర్వాత అందరూ కలిసి ఆట పాటలు, భోజనాలు చేయాలని డిసైడ్ చేసామండి. అయితే.. ఒక తెల్సిన ఫేమస్ డాక్టర్, సోషల్ వర్కర్, మా అందరికీ ఆదర్శులు మీ గురించి చెప్పారండి. మీరు మంచి రచయితనీ, మీ పేరు ప్రపోజ్ చేశారండి. సో.. ఈసారి మేం జరపబోయే మీటింగ్‌కి వచ్చి, మా అతిధి సత్కారాన్ని స్వీకరించి మమ్మల్ని ఆనందింపచేసి, చైతన్యపరచాలని కోరుకుంటున్నామండి. మీకు ఏ రోజు వీలైతుందో… ఆ రోజే మా ప్రోగ్రాం అరేంజ్ చేసుకుంటాం” అని రిక్వెస్ట్ చేసి మాట్లాడింది.
ఏందో ఇట్లాంటి మీటింగులకు ఏనాడు పోయింది లేదు. మున్సిపల్ వర్కర్స్, రైతు కూలీల్లాంటి కార్మిక, కర్షక మహిళలు, ఇండ్లల్ల, సామాజిక హింసల్లో వున్న మహిళా బాధితుల మీటింగ్‌లకే ఎక్కువగా పోయేది. ఇట్లాంటి మీటింగులకు కూడా పోయోద్దాం, వాళ్ళ సంగతులేమో చూసొద్దాం అనుకున్న. నా టైంను బట్టే… మీటింగ్ పెట్టుకుంటామనీ అంతలావు రిక్వెస్ట్ చేస్తుంటే… ”సరేనండి వస్తాను. వచ్చే సండే పొద్దున పది గంటలకి నాకు కుదురుతుంది, ఆరోజు మీరు మీటింగ్ అరేంజ్ చేసుకోవచ్చు” అని చెప్పగానే, ఆ లేడీస్ క్లబ్ డాక్టర్ ”థాంక్స్, థాంక్స్, సంతోషం” అని ఒక పది సార్లు చెప్పుంటదేమో!
మధ్యలో రెండు మూడు సార్లు ఫోన్ చేసి, ”అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాం. మీ గురించిన పరిచయం కూడా పంపండి. ఆ రోజు మీరు రావడానికి వెహికల్ పంపిస్తాను” అని మళ్ళా మళ్ళా గుర్తు చేసింది. వాల్లు ఎక్కడెక్కడ ఏయే సేవా కార్యక్రమాలు చేస్తున్నదీ, ఏకరువు పెట్టేది. నేను నా పరిచయం, లొకేషన్, అడ్రస్ వాట్సాప్ చేసిన.
మీటింగ్ రోజు ఎనిమిదింటికే ఫోన్ చేసి ”మేడమ్ గారూ, వెహికల్ పదకొండు గంటలకు మీ ఇంటి ముందుకి వస్తుందండి” అని చెప్పింది.
మీటింగ్ రోజు పొద్దుగాల ఇంకెవరో ఫోన్ చేసి ”మేడమ్ నేను నీరజను, లేడీస్ క్లబ్ మెంబర్ని, డాక్టర్ వైదేహి గారు మిమ్మల్ని పికప్ చేసుకొని రమ్మన్నారు. మీరు రెడీనాండీ, ప్లీజ్ మీ లొకేషన్, అడ్రస్ పెట్టండి. మేం జూబ్లీహిల్స్‌లో ఉంటాం”.
నేను రెడీనే అని చెప్పి, మా ఇంటి లొకేషన్, అడ్రస్ పంపిన. పంపిన గంటకి ఆమె మా ఇంటి ముందటికి వచ్చి ”మీ ఇంటి ముందున్నాను మేడమ్” అని ఫోన్ చేసింది.
అది ఆడి కారు. కారు కిటికీ ఓపెన్ చేసి వుంది. నన్ను చూడగానే కొంచెం ఆశ్చర్యపోతూ ”నమస్తే మేడం రండి రండి” అనగానే డ్రైవరు కారు డోర్ తీస్తే, ఎక్కి కూచున్న. ఆమె కారు నిండా బందబస్తుగా వున్నది. చెవులు, మెడ, చేతులు కెంపుల సెట్టుతో దగ దగ మెరుస్తుంది, ఆమె కట్టిన పట్టు చీరెను మించి. వికారాబాద్ రోడ్డెక్కి పోతూన్నం. వికారాబాద్‌కి ఇవతల వైదేహికి పెద్ద ఫామ్ హౌస్ ఉందట. దాంట్లనే ఇయ్యాల్టి మీటింగ్ జరిగేదని, ఇంకా ఏందో నాకు అనుభవ దూరమైన సంగతులు, మాటలు, రాజకీయాలు, వాళ్ళ పిల్లలు, ఆయన గురించీ మాట్లాడుతనే ఉండింది. గీ హింస రచనతో ధ్వంసమైతు ఓ రెండు గంటల తర్వాత ఫామ్ హౌస్ చేరుకున్న ఆమెతో.
ఫామ్ హౌస్ ఒక ఇరవై ఎకరాలు ఉంటదేమో. కొబ్బరి చెట్లు ప్లాన్ ప్రకారంగా, షోగా పెంచినట్లు ఉన్నాయి. మధ్యలో ఇల్లు. మంచి పూల తోటలు, పండ్ల తోటలు ఇంకా ఏమో తెలువని తోటలు మస్తుగున్నయి. ఆవులు, పక్షులు కూడా ఉన్నాయి. వర్కర్లు కూడా ఒక ఇరువై మంది దాకా కనబడిండ్రు. పార్కింగ్‌లో వందల కార్లు ఉన్నయి. దిగంగానే హడావుడి చేసిండ్రు.. మన చీఫ్ గెస్ట్ వచ్చారు, ప్రోగ్రాం మొదలుపెడదామని ఒకామె నా దగ్గరికొచ్చి ”నమస్తే మేడమ్ గారూ! నేను డాక్టర్ వైదేహిని, మీతో ఇన్నాళ్ళు ఫోన్‌లో మాట్లాడింది నేనేనండి” అని ఆమె నాకు ఎదురుగా వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చింది.
వైదేహితో పాటు అక్కడ ఉన్న ఆడోళ్ళంతా మామూలుగా లేరు. జిల్ జిల్ జిగా అన్నట్లే ఉన్నారు. ఎర్రగా వూరిన పండు మిరపకాయలోలే ఉన్నరు. నలభై నుంచి అరవై మద్దెన ఉంటారేమో! పట్టుచీరలు, జరీ చీరలతో లిప్పుస్టిక్‌తో డైమండ్, ప్లాటినం సొమ్ములే గాని, బంగారి నగలు కనవల్లే. డైమండ్ నెక్లెస్, డైమండ్ గాజులు, డైమండ్ చెవి బుట్టలు, హ్యాంగింగ్స్‌తో డైమండ్ మహిళల్లాగా నవరత్నాల జువెలరీతో తళతళ మెరుస్తూ… ఒకరికొకరు నీ గాజుల డిజైన్ మాడ్రన్ గా ఉందంటే, నీ నెక్లెస్ డిజైన్ లుక్కు అదిరిందని, సో నైస్ అని, వెరీ ట్రెడిషనల్ విత్ మాడ్రన్ టచ్’ అని, మీ లైట్ వెయిట్ పట్టు బాగుందనీ, మీ ఉల్లిపొర కలర్ కంజీవరమ్ చీర బ్యూటీఫుల్’ ఇట్లా వాళ్ళ వాళ్ళ పలకరింపులు నాకు వింతనిపిచ్చినయి.
మా ఆఫీసులో కూడా ఇట్లాంటి మహిళలు కొద్దిమంది ఉన్నా, గీసొంటి ముచ్చట్లు వినలే. వీళ్ళ ముచ్చట్లన్నీ డైమండ్ జ్యువలరీ, పట్టులతో నిండి ”ఏంటి ప్లాటినం పూర్తిగా మానేసినావ్?” అని ఒకామె అడిగితే, ”ప్లాటినం చాలా కాస్ట్ కదా! బంగారం కన్నా డబుల్ త్రిబుల్. అంత రేటయినా అవి వెండిలా ఉంటాయని, అంత షో కూడా వుండయని మా అత్త వాళ్ళు అంటే, ప్లాటినం మానేసిన. డైమండ్స్‌కే మంచి లుక్ ఉంటుంది, దట్టు క్రేజీ కదా!’ ఇట్లా పలకరింపులు జరుగుతున్నయి.
నాకు ఎవ్వరూ తెలువది. ఒక్క తెలంగాణ పలుకు పదం కనబడలే. వీళ్ల మాటలు వాళ్ళ వాలకాలతో ‘అమ్మో గీడికెందుకు వచ్చినట్లు, గీ పడని మనుషుల మద్యలకు అంగట్ల కోతోలే వచ్చి పడితిని అని మౌనంగా కూర్చున్న. మేడమ్ పెద్ద ఆఫీసర్! ఎంత సింపుల్! బ్యూటీ పార్లర్‌కి కూడా పోనట్టు తెలుస్తుంది! నగ నట్ర ఏమి లేవు! చీరకూడ పట్టు కాదు, మామూలు చీర! ఆఫీసరట. ఒంట్లో ఎక్కడా పిడికెడు కండ లేదు. కనీసం ఆ డార్క్ స్కిన్ కి పాలిష్ అన్నా పెట్టించి ఉండాల్సింది. అమ్మ బాబోరు ఇంత సింప్లీసిటీ నా వల్ల కానే కాదు!’ అనే గుస గుసలు సన్నగా, నా చెవుల పడుతున్నయి.
నిజమే, నా చిన్నప్పటి నుంచి డాబుగా, దర్పంగా ఉండుడు, సొమ్ముల మీద కాయిషు లేదు. ఎంత సింపుల్ గుంటే, అంత సుకం. మా కుటుంబాలల్ల అందరూ పేదోల్లే, వాళ్ల మద్యలకు బంగారాలు దిగేసుకొని పోవుడు వాళ్లను ఔమానించుడు కదా! అనుకునేది.
తర్వాత, ఒకామె నన్ను స్టేజి మీదకి తోలుక పోయింది. నా గురించి ఒకామె పరిచయం చదివి అందరికీ వినబెట్టింది. నేను సెక్రటేరియట్‌లో ప్రభుత్వ అదనపు కార్యదర్శి అనే ఉన్నత పదవీ ఆఫీసరునని, మా పల్లె, జిల్లా గురించి, గొప్ప రచయిత్రినని చెప్పింది. యింకా మహిళా ఉద్యోగుల సంఘం స్థాపకురాలనీ, వివిధ సాహిత్య సంస్థలు స్థాపించిన్నని, కొన్ని పుస్తకాలకు సంపాదకత్వం వహించిందని, అనువాదకర్త అనీ, వ్యాసకర్త, కాలమిష్టు అని, చాలా అవార్డులొచ్చినాయని నేను పంపిన పరిచయం ఓపికతోని అంతా చదివింది. అవన్నీ వినుకుంటా, వావ్ మెరుపు కళ్ళతో మధ్య మధ్యలో చప్పట్లు. చూడడానికి ఇంత సింపుల్‌గా ఉన్న మీరు ఇంత గొప్ప పనులు చేశారా? గ్రేట్! అమేజింగ్! అని ఆహాహ, ఓహోహోలు. నా పరిచయం తర్వాత ఇంకో కామే ‘మన చీఫ్ గెస్ట్ మాట్లాడుతారని’ చెప్పి మైక్ నాకిచ్చింది.
”ముందుగా లేడీస్ క్లబ్ వాళ్లకి అభినందనలు తెలియజేసిన. మహిళలు సమాజంలో బాధితులుగా ఉన్నారు. వాళ్ళు ఏయే రంగాల పనుల్లో, ఎక్కడెక్కడ ఉన్నా, సంఘం పెట్టుకొని సంఘటితంగా వుండాలనీ, వుంటే ఎట్లా సాధించగలమో, మా సెక్రటేరియట్ మహిళా సంఘం ఒక గొప్ప ఉదాహరణ. సెక్రటేరియట్ మహిళా ఉద్యోగులు కలిసి పెట్టిన సంఘం నుంచి సాధించిన సమస్యల గురించి వివరించిన. పరిష్కారానికి ప్రభుత్వంతో కొట్లాడి తీసుకొచ్చిన జీవోల గురించి చెప్పిన. ఇదివరకు లేడీస్ స్పెషల్ బస్‌లు లేకుండే, వేయించుకున్నాం. మూడు నెలల ప్రసూతి సెలవులను నాలుగు నెలలు చేయించడం, డ్యూటీలో లేటుగా ఉండాల్సివస్తే, మహిళలకి వెహికిల్ ఇవ్వాలని సాధించాం. మహిళా ఎంప్లాయిస్‌కి తొమ్మిది గంటల లోపల ఆరున్నర తర్వాత గ్యాస్ పంపిణీ జరగాలి. వర్క్ స్థలాల్లో వేధింపుల మీద పోరాడినం. ఇట్లా అనేక మహిళా సమస్యల మీద మా మహిళా ఉద్యోగుల సంఘం పోరాడింది. విజయాలు సాధించింది. మహిళలు సంఘటితంగా ఉండి, సంఘాలు పెట్టుకుంటే, మనకు బలం – బలగం పెరుగుతుందని, మీరు ఇరువై యేండ్లనుంచి మహిళా క్లబ్ నడుపడం మంచి సంగతి”
అంటే చప్పట్లు.
”మహిళా క్లబ్ అణగారిన పేద మహిళల ఉన్నతి కోసం కూడా పనిచేసే దిశవైపు అడుగులు వేయాలని ఆశిద్దాం” అని ముగించిన.
మళ్ళా చప్పట్లు. తర్వాత ఇద్దరు పట్టు డైమండ్ జువలరీస్ అంతా జమయి నాకు గ్రాండ్ షాల్, బొకే ఇచ్చి నా ఎత్తు పూలదండ వేసి సత్కరించారు.
తర్వాత మల్లా ఎక్కడెక్కడ మ్యూచివల్స్, ప్లాట్స్, రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించిన ముచ్చట్లు కూడా మాట్లాడుకుంటున్నరు. ఆ ఉక్కపోత కష్టమై ”’ప్రోగ్రామ్ అయింది కదా నేను వెళ్లి పోతాను వైదేహి గారు” అన్నాను.
”అయ్యో మేడమ్, లంచ్ చేసి వెళ్ళండి ప్లీజ్! అని తెగ మోమాట పెట్టింది. వాళ్లతో తినబుద్ధి కాలే. తిన్నట్టు చేసి చేయికడిగిన. వైదేహి కారిచ్చి, ఇచ్చిన సత్కారాలు కార్ల బెట్టించి ఇంటికి పంపితే, మెడకోడం నుంచి బైట బడ్డట్టనిపిచ్చింది. ఇట్లాంటి వాటికి పోవడం టైం వేస్ట్, బుద్ధి తక్కువ అని నన్ను నేను జాడిచ్చుకున్న.
తెల్లారి వైదేహి నుంచి వాట్సాప్ మెసేజులు వచ్చినరు. థాంక్స్ మెసేజ్ లేమో అనుకుంటా, అని ఓపెన్ చేసిన. ‘మనం చీఫ్‌గెస్ట్‌గా పిలిచిన ఆవిడ ఆఫీసర్ కాదు, ఏదో చిన్న అసిస్టెంట్ పోస్టు అయి ఉంటది. ఆఫీసర్స్ అంత సింపుల్ వుండరు, గ్రాండ్‌గా ఉంటరు. ఆమె మహిళా అసోసియేషన్ లో అడిషనల్ సెక్రటరీ అయి ఉంటది. గవర్నమెంట్‌లో అడిషనల్ సెక్రెటరీ కాదు, పాడు కాదు. అయినా, అడిషనల్ సెక్రెటరీ పోస్టు ఐఏఎస్ పోస్ట్. ఆ పోస్టు ఎంత రాజసం! మొఖంలో ఎంత తేజస్సు డాంబికం వుంటది! ఆవిడ మనల్ని తప్పుదోవ పట్టించింది’ – ఇది మా క్లబ్ మెంబర్ పెట్టింది.
”ప్లీజ్ క్లారిఫై” అని పెట్టింది.
నాకు కోపం నషాలానికి ఎక్కింది. ఎంత అవమానం. వెంటనే ఫోన్ చేసి… ”ఏమి సంస్కారం మీది? నేను క్లారిటీ ఇచ్చేదేంటి? గూగులు క్లారిటీ ఇస్తది ఎతుకోండ్రి! సెక్రటేరియట్ కి పోండ్రి, నేనెవరో ఏంటో, పూర్తి క్లారిఫికేషన్ దొరుకుతది. డిఫమేషన్ కేసేస్తా ఏమనుకుంటున్నారో?” అని చెవులు చెదలు బడేటట్లు క్లాసు పీకి పోన్ పెట్టేసిన.
– జూపాక సుభద్ర
9441091305
సూపు రేకలు
- Advertisement -
- Advertisement -