Monday, May 26, 2025
Homeజాతీయంనైరుతి… వచ్చేస్తుంది

నైరుతి… వచ్చేస్తుంది

- Advertisement -

– పురోగమిస్తున్న రుతుపవనాలు
– అనుకూలిస్తున్న పరిస్థితులు
– రెండో రోజు మరికొన్ని ప్రాంతాలకు పలకరింపు
రుతుపవనాలు కేరళను తాకాయని భారత వాతావరణ విభాగం శనివారం నాడే ప్రకటించింది. జూన్‌ 1న కేరళలో ప్రవేశించాల్సిన రుతుపవనాలు ఎనిమిది రోజుల ముందుగానే వచ్చేశాయి. దీంతో నాలుగు నెలల రుతుపవన సీజన్‌ ప్రారంభమైంది. దేశంలో జూన్‌- సెప్టెంబర్‌ నెలల మధ్య నైరుతి రుతుపవనాలు కొనసాగుతాయి.
మరింత ముందుకు…

నైరుతి రుతుపవనాలు ఇప్పటికే నైరుతి, తూర్పు-మధ్య బంగాళాఖాతం, మాల్దీవులు, కామొరిన్‌ ప్రాంతాలు, దక్షిణ మధ్య అరేబియా సముద్రం, కేరళ, లక్షద్వీప్‌, మహేలో ప్రవేశించాయి. అదే విధంగా ఈశాన్య భారతం (మిజోరం), దక్షిణ-కోస్తా కర్నాటక, తమిళనాడు (ఉత్తర ప్రాంతాలు మినహా)లో కూడా క్రియాశీల కంగా ఉన్నాయి. సాధారణ పరిస్థితులలో రుతుపవనాలు జూన్‌ ఐదవ తేదీ ప్రాంతంలో మధ్య కేరళను దాటి కర్నాటకకు చేరుకుంటాయి. కానీ ఈ సంవత్సరం ముందుగానే అవి పలకరించాయి. కర్నాటకలో అనుకున్న సమయానికి పది రోజుల ముందే రుతుపవనాలు ప్రవేశించాయి. రెండో రోజైన ఆదివారం నాడు ఈశాన్య రుతుపవనాలు పశ్చిమ-మధ్య, తూర్పు -మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతా లకు విస్తరించాయి. అలాగే కర్నాటకను పాక్షికం గాను, గోవాను పూర్తిగాను, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను, పశ్చిమ-మధ్య, ఉత్తర బంగాళా ఖాతంలోని ప్రాంతాలను, మిజోరం, మణిపూర్‌, నాగాలాండ్‌ను కూడా తాకాయి. రుతుపవనాల పురోగతిని సూచించే ఊహాత్మక రేఖ ప్రస్తుతం దేవ్‌గడ్‌, బెలగారీ, హవేరీ, మాండ్యా, ధర్మపురి, చెన్నై, ఐజ్వాల్‌, కోహిమా మీదుగా వెళుతోంది.
న్యూఢిల్లీ:
వార్షిక వర్షపాతంలో 70 శాతానికి పైగా నైరుతి రుతు పవనాల కాలంలోనే నమోదవుతుంది. అంటే దేశ ఆర్థిక క్యాలెండర్‌లో ఇది కీలక సమయం అన్న మాట. 2009లో నైరుతి రుతుపవనాలు మే 23వ తేదీన దేశంలో ప్రవేశించాయి. సాధారణంగా మే 10వ తేదీ వాతావరణ విభాగం రుతుపవనాల షెడ్యూలును ప్రకటిస్తుంది. ఇందుకోసం కొన్ని ప్రమాణాలను పరిశీలిస్తుంది.
రుతుపవనాల షెడ్యూల్‌ను ఎలా ప్రకటిస్తారు?
దేశంలో 14 దక్షిణ వాతావరణ కేంద్రాలు ఉన్నాయి. అవి మినికారు, అమిని, తిరువనంతపురం, పునలూర్‌, కొల్లాం, అలప్పుజా, కొట్టాయం, కొచ్చి, త్రిస్సూర్‌, కోజికోడ్‌, తలసెర్రి, కన్నూర్‌, కుడులు, మంగళూరు. వీటిలో 60 శాతానికి పైగా కేంద్రాలలో వరుసగా రెండు రోజుల పాటు 2.5 మిల్లీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుంది. ఉత్తర, దక్షిణార్థ గోళాలలో 30 నుండి 60 డిగ్రీల అక్షాంశాలలో పశ్చిమ గాలులు పశ్చిమ దిశ నుండి తూర్పు వైపు వీస్తాయి. రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయని చెప్పడానికి గుర్తుగా ఈ గాలుల శక్తి 600 హెక్టోపాస్కల్స్‌ (హెచ్‌పీఏ) వరకూ ఉండాలి. అదే విధంగా గాలి వేగం 925 హెచ్‌పీఏ వద్ద గంటకు 27-37 కిలోమీటర్లు ఉండాలి. అలాగే ఉప గ్రహం నుండి పొందిన ఔట్‌గోయింగ్‌ లాంగ్‌వేవ్‌ రేడియేషన్‌ (ఓఎల్‌ఆర్‌) విలువలు చదరపు మీటరు కు 200 వాట్స్‌ కంటే తక్కువ ఉండాలి. ఈ ప్రమా ణాలన్నీ నెరవేరితే రుతుపవనాల ప్రవేశంపై వాతావరణ విభాగం ప్రకటన చేస్తుంది.
అనుకూలించిన పరిస్థితులు ఇవే
భారత రుతుపవనాలను ప్రభావితం చేసే అత్యంత ముఖ్యమైన, సంక్లిష్టమైన సముద్ర-వాతావరణ అంశాలలో మాడెన్‌-జులియన్‌ అసిలియేషన్‌ (ఎంజేఓ) ఒకటి. దీని మూలం హిందూ మహాసముద్రంలో ఉంది. మేఘాలు, గాలి, పీడనం తూర్పు దిశగా సెకనుకు 4-8 మీటర్ల వేగంతో కదులుతాయి. 30 నుండి 60 రోజుల వ్యవధిలో అవి ప్రపంచమంతా ప్రయాణించి కదలికల సమయంలో గణనీయమైన వాతావరణ మార్పులకు కారణమవుతాయి. అనుకూల దశకు చేరుకు న్నప్పుడు రుతుపవన కాలం లో దేశంలో వర్షపాతాన్ని పెంచుతాయి. ఇక రుతు పవనాలకు అనుకూలించే రెండో పరిస్థితి… రుతుపవన కాలంలో హిందూ మహా సముద్రంలోని మస్కరీన్‌ దీవుల చుట్టూ అధిక పీడన ప్రాంతం ఏర్పడుతుంది. పీడన తీవ్రతలోని వైవిధ్యం కారణంగా దేశంలోని పశ్చిమతీరం వెంబడి భారీ వర్షాలు పడతాయి. మూడో అనుకూల పరిస్థితి విషయానికి వస్తే… వాతావరణంలో వేడి, తేమ నిలువుగా ప్రయాణించడం వల్ల కూడా వర్షాలు పడతాయి. ఉదాహరణకు హర్యానాపై గత వారం ఉష్ణ ప్రసరణ వ్యవస్థ ఆగేయ దిశగా కదలడంతో ఢిల్లీలో వర్షాలు పడ్డాయి.
వేసవి కాలాన్ని సూచిస్తూ సూర్యుడు ఉత్తరార్థ గోళానికి వెళ్లిన తర్వాత అరేబియా సముద్రంలో అల్పపీడన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. పాకిస్తాన్‌, దాని పరిసర ప్రాంతాల మీద ఏర్పడే అల్ప పీడన జోన్‌ అభివృద్ధి చెందిన ప్పుడు దాని బలమైన ఉనికి రుతుపవన వర్షపాతాన్ని ప్రభా వితం చేస్తుంది. ఇక రుతుపవన ద్రోణి కూడా వర్షపాతాన్ని ప్రభావితం చేస్తుంటుంది. ఇది జూన్‌-సెప్టెంబర్‌ మధ్య కాలంలో కీలకమైన రుతుపవన మండలంలో వర్షాలకు కారణమవుతుంది. అరేబియా సముద్రంలో ఏర్పడే తుపానులు కూడా మంచి వర్షపాతాన్ని అందిస్తాయి. ఈ సంవత్సరం లక్షద్వీప్‌, మహే (పుదుచ్చేరి), అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని అనేక ప్రాంతాలలో రుతుపవనాలు ఒకేసారి ప్రవేశించాయి. అలాగే దక్షిణ కర్నాటక, ఈశాన్య భారతంలోని మిజోరంలో రుతుపవన గాలులు వీచాయి. రుతుపవనాల ఆగమనానికి పరిస్థితులు అనుకూలించాయి. సాధారణంగా మే 21న దక్షిణ అండమాన్‌ సముద్రం, దాని పరిసర ప్రాంతాలలో ప్రవేశించాల్సిన నైరుతి రుతుపవనాలు 13నే వచ్చేశాయి. ఈ నేపథ్యంలో రుతుపవనాల రాకకు అనుకూలించిన పరిస్థితులేమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -