Tuesday, May 20, 2025
Homeతెలంగాణ రౌండప్29న రాష్ట్రానికి నైరుతి రాక.. ద్రోణి ప్రభావంతో 4 రోజులు పలు జిల్లాల్లో వానలు

29న రాష్ట్రానికి నైరుతి రాక.. ద్రోణి ప్రభావంతో 4 రోజులు పలు జిల్లాల్లో వానలు

- Advertisement -
  • – నాలుగు రోజుల్లో కేరళను తాకనున్నరుతుపవనాలు
    నవతెలంగాణ – జుక్కల్

    నైరుతి రుతుపవనాలు అనుకున్న దానికంటే అధిక వేగంతో కదులుతున్నాయని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే వేగం కొనసాగితే ఈనెల 24న కేరళను తాకే అవకాశాలున్నాయని పేర్కొన్నది. సాధారణం (జూన్‌1) కంటే ముందుగా 27నాటికి రుతుపవనాలు కేరళను పలకరిస్తాయని వాతావరణశాఖ అంచనా వేసిన విషయం తెలిసిందే. పరిస్థితులు అనుకూలంగా మారడంతో వాటి గమనం వేగంగా ఉన్నదని, 26న రాయలసీమ, 29న తెలంగాణ, కోస్తాంధ్రలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు అండమాన్‌, నికోబార్‌ దీవులను పూర్తిగా విస్తరించాయని తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వచ్చే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొన్నది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కర్ణాటక తీరంలో బుధవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్నదని, ఇది గురువారం నాటికి అల్పపీడనంగా మారి మరింత బలపడుతుందని అంచనా వేసినట్టు తెలిపింది. దీని ప్రభావంతో రుతుపవనాలు మరింత వేగంగా ముందుకు కదిలే అవకాశాలున్నాయని వివరించింది. సోమవారం వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అకడకడ భారీ వర్షాలు కురిసినట్టు వెల్లడించింది. అత్యధికంగా నారాయణపేట జిల్లా మక్తల్‌లో 7.81 సెం.మీ, నర్వలో 6.30 సెం.మీ, మగ్నూర్‌లో 4.80 సెం.మీ, మరికల్‌లో 3.41 సెం.మీ, ధన్వాడలో 3.20 సెం.మీ, జోగులాంబ-గద్వాల జిల్లా రాజోలిలో 4.89 సెం.మీ, మనోపాడ్‌లో 4.48 సెం.మీ, వడ్డేపల్లిలో 3.31 సెం.మీ, కల్లూర్‌లో 3.24 సెం.మీ, రంగారెడ్డి జిల్లా నందిగాంలో 3.20 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే మంగళ, గురు, శుక్రవారాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపింది. కాగా, సోమవారం 13జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, నిర్మల్‌ జిల్లా సారంగపూర్‌లో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ పేర్కొన్నది.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -