– పర్యావరణ హితం కోసం ఖర్చుచేస్తాం
– సహజవనరుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం
– నీటి దుర్వినియోగాన్ని అరికట్టాలి
– పర్యావరణ పరిరక్షణ, వర్షపు నీటి సంరక్షణపై గ్రామసభలో ఎజెండాగా చేర్చాలి : వాల్టా రాష్ట్ర స్థాయి అథారిటీ సమావేశంలో మంత్రి డాక్టర్ సీతక్క
– పదేండ్ల తర్వాత తొలిసారి జరిగిన సమావేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వాల్టా యాక్టు కోసం ప్రత్యేక నిధి కేటాయిస్తామనీ, దాన్ని పర్యావరణ హితం కోసమే ఖర్చు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ(సీతక్క) ప్రకటించారు. సహజవనరుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. నీటి దుర్వినియోగాన్ని అరికట్టడంపై అన్ని శాఖలూ దృష్టి సారించాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ, వర్షపునీటి సంరక్షణ అంశాలను గ్రామసభలో ఎజెండాగా చేర్చాలని సూచించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో వాల్టా రాష్ట్రస్థాయి అథారిటీ సమావేశం మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఎక్స్‌అఫిషియో సభ్యులు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి లోకేశ్‌కుమార్, డైరెక్టర్ సృజన, స్పెషల్ కమిషనర్ షఫీ ఉల్లా, జలసాధన సమితి అధ్యక్షులు, పర్యావరణ వేత్త దుశ్చర్ల సత్యనారాయణ, ఉస్మానియా వర్సిటీ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పి.రాజశేఖర్, జియాలజీ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి, సాయిల్ సైన్సెస్ శాస్త్రవేత్త ఎం.ఉమాదేవి, పర్యావరణ కార్యకర్తలు ధైద వెంకన్న, గుండేటి యోగేశ్వర్, ఆయా శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. వారు ఇచ్చిన విలువైన సూచనలను అథారిటీ పరిగణనలోకి తీసుకున్నది. పలు తీర్మానాలను చేసింది. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. పర్యావరణ హితంలో, ప్రజల అభివృద్ధి కోణంలో వాల్టా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వాల్టా అథారిటీలను నియమించాలని ఆదేశించారు. సహజ వనరులను దుర్వినియోగం చేయకుండా, అవసరం మేరకే వినియోగించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. నీటిసంరక్షణపై నిపుణులు, శాస్త్రవేత్తలు పర్యావరణ వేత్తలతో కలిసి విధానాలు రూపొందించాలని ఆదేశించారు. భూగర్భజలాలు అడుగంటితే మానవాళికే ప్రమాదమని హెచ్చరించారు. నీటి సంరక్షణ కోసం ప్రభుత్వ పాఠశాలలను, మార్కెట్ యార్డులను, రైతు వేదికలను ప్రచార కేంద్రాలుగా వాడుకోవాలని సూచించారు. పదేండ్లలో వాల్టా అథారిటీ సమావేశాలు నిర్వహించకపోవడాన్ని తప్పుబట్టారు. వాల్టా చట్టం అమలుపై వారం పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక అధికారులతో కమిటీలు వేసి ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు పెట్టాలని సూచించారు. భూగర్భ జలాల స్థాయిని గ్రీన్, ఆరెంజ్ , రెడ్ జోన్‌గా విభజించి గ్రామాలు ఏ జోన్లో ఉన్నాయో గ్రామ పంచాయతీ గోడల మీద రాయాలని ఆదేశించారు. పర్యావరణ చట్టాలను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిపుణుల సలహాతో కరపత్రాలను, బుక్ లెట్లను తయారుచేసి గ్రామ గ్రామాన ప్రజలకు పంచాలని సూచించారు. ఈ సందర్భంగా మంచిర్యాలకు చెందిన పర్యావరణ కార్యకర్త గుండేటి యోగేశ్వర్ రాసిన మంచిర్యాల చరిత్ర పుస్తకంలో మంత్రి సీతక్క ఆవిష్కరించారు. 17 ఏండ్లుగా మొక్కలు నాటుతూ పర్యావరణ పెంపుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న మహబూబాబాద్ కు చెందిన ధైదా వెంకన్నను మంత్రి సీతక్క అభినందించారు.
వాల్టా రాష్ట్రస్థాయి అథారిటీ మొదటి సమావేశంలో
చేసిన తీర్మానాలు
– జిల్లాస్థాయి, డివిజనల్ స్థాయి, మండల స్థాయి వాల్టా అథారిటీల ఏర్పాటు
– భూగర్భ జలాలు ప్రమాదకరస్థాయిలో తగ్గుతున్న గ్రామాల్లో, పట్టణాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు
– పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంచాలి
– వర్షపు నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణం ను తప్పనిసరి చేయాలి
– వాల్టానిధి ఏర్పాటు చేయాలని క్యాబినెట్ కు సిఫార్సు
– గ్రామాల వారీగా నీటి వనరులు, బోర్లు, బావుల సమాచార సేకరణ
– వాల్టా యాక్ట్ అమలు ను హైడ్రాకూ వర్తింపు
– మహిళా స్వాగత బందాలకి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కల్పించాలి.
– పర్యావరణ పరిరక్షణ, వర్షపు నీటి సంరక్షణ ను గ్రామ సభలో ఎజెండాగా చేర్చాలి
వాల్టా కోసం ప్రత్యేక నిధి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES