నవతెలంగాణ – హైదరాబాద్: హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిందన్న ఆరోపణలపై అరెస్టయిన విషయం విదితమే. ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో పలు కీలకమైన, ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణ సమయంలో జ్యోతి ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం గానీ, తాను చేసిన తప్పునకు బాధపడుతున్న ఛాయలు గానీ కనిపించలేదని సంబంధిత వర్గాలు తెలిపినట్లు ‘ఇండియాటుడే’ ప్రచురించిన కథనం పేర్కొంది.
అంతేకాకుండా, తాను కేవలం తన వాక్ స్వాతంత్ర్యాన్ని మాత్రమే వినియోగించుకుంటున్నానని ఆమె దర్యాప్తు అధికారులతో చెప్పినట్లు సమాచారం. పాకిస్థాన్‌కు అనుకూలంగా ప్రచారం విస్తృతంగా వ్యాప్తి చేయాలని జ్యోతి మల్హోత్రాకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని, ఇది ఒక సరికొత్త తరహా యుద్ధమని కూడా దర్యాప్తు వర్గాలు తెలిపాయి.
ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత, జ్యోతి తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఆ దాడి ఘటనకు ఏ ఒక్క పాకిస్థాన్ పౌరుడు కూడా బాధ్యుడు కాదని ఆమె అందులో పేర్కొన్నట్లు సమాచారం. జ్యోతితో సన్నిహితంగా ఉన్న కొందరు పాకిస్థానీయులు ఆమెకు మరికొన్ని అదనపు పనులు కూడా అప్పగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలో కూడా అధికారులు విచారణ ముమ్మరం చేశారు.
గతవారం హర్యానా పోలీసులు జ్యోతి మల్హోత్రాను గూఢచర్యం ఆరోపణల కింద అరెస్టు చేశారు. అప్పటినుంచి ఆమె గురించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గామ్ దాడి జరగడానికి ముందు ఆమె పలుమార్లు పాకిస్థాన్‌లో పర్యటించినట్లు, ఒకసారి చైనాకు కూడా వెళ్లి వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ముఖ్యంగా, ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో, జ్యోతి ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న డానిష్ అనే అధికారితో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. డానిష్ ఆమెను ఉద్దేశపూర్వకంగా ట్రాప్ చేసి, తమ కార్యకలాపాలకు వాడుకున్నట్లు గుర్తించారు.
పహల్గామ్ ఘటన జరగడానికి కొద్ది రోజుల ముందు జ్యోతి ఆ ప్రాంతానికి వెళ్లిందని, అక్కడ పలు వీడియోలు చిత్రీకరించిందని కూడా పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారాన్ని ఆమె పాకిస్థాన్ ఏజెంట్లకు చేరవేసి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ అంశంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ట్రావెల్ బ్లాగర్‌గా, యూట్యూబర్‌గా పేరున్న జ్యోతి మల్హోత్రా ‘ట్రావెల్ విత్ జో’ అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తోంది. ఇప్పటికే ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా భారత్‌లో అధికారులు నిలిపివేశారు.