నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీనారాయణ గురు సిద్ధాంతాన్ని వక్రీకరించి హైజాక్ చేసేందుకు యత్నిస్తున్న స్వార్థపూరిత శక్తులపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణ గురుని ఒక నిర్దిష్ట మతం లేదా సమాజానికి పరిమితం చేసే ఇటువంటి ప్రయత్నాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బుధవారం వర్కాలలో నారాయణ గురు స్థాపించిన శివగిరి మఠంలో 93వ శివగిరి యాత్రను ప్రారంభించిన అనంతరం విజయన్ మాట్లాడారు.
కుల, మతాలకు అతీతంగా మానవత్వం, ఐక్యత, సౌభ్రాతృత్వం, స్నేహ మార్గాన్ని మానవాళికి చాటి చెప్పిన నిజమైన ప్రపంచ గురువు శ్రీనారాయణ గురు అని అన్నారు. వివిధ కుల, మత సమూహాలను చిన్నాభిన్నం చేయడం ప్రజాస్వామ్య, లౌకిక భావాలను బలహీనపరుస్తుందని హెచ్చరించారు. సమానత్వం మరియు సామాజిక న్యాయాన్ని బలోపేతం చేసేందుకు, దేశ రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ప్రగతిశీల శక్తుల దృక్పథంతో నారాయణ గురు సందేశాన్ని అనుసంధానం చేయాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు. గుర్తింపు ప్రాతిపదికన ప్రజలను విభజించే యత్నాలను ప్రతిఘటించడానికి, నారాయణ గురు బోధనల్లో కీలకమైన ప్రజాస్వామ్య మరియు లౌకిక విలువలను బలోపేతం చేయడానికి సమిష్టి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.



