నవతెలంగాణ-హైదరాబాద్ : శ్రీలంకలోని జాఫ్నా జైలులో నిర్బంధంలో ఉన్న నలుగురు కాకినాడ జాలర్లు విడుదలయ్యారు. వారు స్వదేశానికి తిరుగు పయనమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీ భవన్ నుంచి జాలర్ల విడుదలకు తక్షణ చర్యలు చేపట్టడంతో శ్రీలంక ప్రభుత్వం స్పందించి వారిని విడుదల చేసింది. శ్రీలంక కోస్ట్ గార్డ్ సిబ్బంది ఈ నెల 26న నలుగురు జాలర్లను భారత్ కు అప్పగించారు. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు సమీపంలోని మండపం వద్ద ఈ నలుగురిని భారత కోస్ట్ గార్డ్ సిబ్బందికి అప్పగించారు.
మండపం నుంచి నౌకలో బయలుదేరిన మత్స్యకారులు.. ఈ నెల 30న కాకినాడకు చేరుకోనున్నారు. 2025 ఆగస్టు 3న కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులు కె.శ్రీను వెంకటేశ్వర్, కర్రినోకరాజ్ బొర్రియా, చందా నాగేశ్వరరావు, బ్రహ్మనందంలు పడవ కొనుగోలు చేయడానికి నాగపట్నం బయలుదేరారు. తిరిగి వచ్చే సమయంలో నావిగేషన్ లోపం కారణంగా జాఫ్నా తీరం సమీపంలోకి చేరుకున్నారు. దీంతో వారిని శ్రీలంక కోస్ట్ గార్డ్ అదుపులోకి తీసుకొని, జాఫ్నా పోలీసులకు అప్పగించింది.
2025 ఆగస్టు 4 నుంచి ఈ నలుగురు మత్స్యకారులు జాఫ్నా జైలులో ఉన్నారు. 52 రోజులుగా జాఫ్నా జైలులో నిర్బంధంలో ఉన్న ఈ మత్స్యకారులను స్వదేశానికి తిరిగి రప్పించే అంశంపై ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు జాఫ్నాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా నిరంతర సంప్రదింపులు చేశారు. ఢిల్లీలోని కోస్ట్ గార్డ్ కార్యాలయం ద్వారా నలుగురు మత్స్యకారులను స్వదేశానికి రప్పించేలా ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ మంతనాలు జరిపారు. ఈ మేరకు ఈ నెల 26 తేదీన శ్రీలంక అధికారులు నలుగురు మత్స్యకారులను భారత్‌కు అప్పగించారు. ఏపీ ప్రభుత్వం తక్షణం స్పందించి సంప్రదింపులు చేయకపోతే ఈ నలుగురు మరో ఆరు నెలల పాటు జాఫ్నా జైల్లో గడపాల్సి వచ్చేదని అధికారులు చెప్తున్నారు.