24 గంటల్లోగా జీవో జారీ చేస్తాం
గోదావరి జలాల కోసం శ్రమించిన దామన్న : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
తుంగతుర్తిలో రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సంతాప సభ
పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
నవతెలంగాణ-తుంగతుర్తి
శ్రీరామ్‌సాగర్ రెండో దశ కాలువకు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పేరు పెట్టనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అందుకు సంబంధించి 24 గంటల్లోగా జీవో జారీ చేస్తామని చెప్పారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం జరిగిన రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సంస్మరణ సభలో సీఎం పాల్గొన్నారు. దామోదర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ నివారణ కోసం గోదావరి నీళ్లు తీసుకొచ్చిన ఘనత దామోదర్‌రెడ్డిదేనన్నారు. నమ్మిన ప్రజల కోసం ఆస్తులమ్మి జెండా మోశారని గుర్తు చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పని చేసినప్పుడు సొంతంగా ఆస్తులు కూడబెట్టుకోకపోగా.. తనకు వారసత్వంగా వచ్చిన భూములను ప్రజాసేవ కోసం అమ్మారని చెప్పారు. తెలుగు రాష్ట్రాలలో టైగర్ దామన్న తెలియని వారు లేరని, టైగర్ అనే బిరుదు వారికే సొంతమని అన్నారు. గాంధీ కుటుంబం దామోదర్‌రెడ్డి కుటుంబానికి అండగా ఉంటుందని, ఏఐసీసీ ఆదేశాల మేరకు భవిష్యత్‌లో ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. అంతకుముందు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. ”కాంగ్రెస్ అంటేనే నేను… నేను అంటేనే కాంగ్రెస్” అని నిలబడి కొట్లాడిన ధీరోదత్తుడు దామోదర్‌రెడ్డి అని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పోరాడారని అన్నారు. రాష్ట్రంలో దశాబ్దంపాటు మరో రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఎలాంటి ప్రలోభాలకూ లొంగకుండా కాంగ్రెస్‌లోనే కొనసాగిన మహానేత దామోదర్‌రెడ్డి అని తెలిపారు.
ఎన్నికలకు ముందు తాను చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో తన అడుగులో అడుగు వేసిన గొప్ప నాయకుడు దామోదర్‌రెడ్డి మన మధ్య లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఆయన తన జీవితం మొత్తం ప్రజల సంక్షేమం కోసం అంకితం చేశారన్నారు. దామోదర్‌రెడ్డి సోదరులు ఇద్దరూ జోడెద్దుల్లా కాంగ్రెస్ పార్టీ జెండాను మోశారని తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలంపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషిచేసిన గొప్ప నాయకులు దామోదర్‌రెడ్డి అని కొనియాడా రు. దామన్న ఆశయం కోసం అందరం కృషి చేస్తామని, ఆయన కుమారుడు సర్వోత్తమ్‌రెడ్డికి అండగా నిలబడతామని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. శ్రీరాంసాగర్ జలాల కోసం రక్తతర్పణం చేసిన గొప్ప నాయకుడు ఆర్డీఆర్ అన్నారు. ఎడారిగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాను గోదావరి జలాల ద్వారా సస్యశ్యామలం చేశారని చెప్పారు. మాజీ ఎంపీ హనుమంతరావు మాట్లాడుతూ.. దామన్న మరణం యావత్ రాష్ట్ర ప్రజలకు తీరనిలోటన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజాభిమానం పొందిన నాయకులు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచందర్‌నాయక్, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ మట్టా నాగమయి, మందుల సామేలు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఉత్తమ్ పద్మావతి, వేముల వీరేశం, బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, అద్దంకి దయాకర్, శంకర్‌నా యక్, ఎంపీ రఘువీర్‌రెడ్డి, నాయకులు పాల్వాయి రజిని, పటేల్ రమేష్ రెడ్డి, సుధీర్‌రెడ్డి, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్నయాదవ్, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మెన్ వేణారెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్, దామోదర్‌రెడ్డి సోదరులు గోపాల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఎస్సారెస్పీ-2కు మాజీమంత్రి దామోదర్‌రెడ్డి పేరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES