నవతెలంగాణ-హైదరాబాద్: ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ ప్రాజెక్టు శాటిలైట్లలో ఒకటి అదుపుతప్పి భూమి దిశగా దూసుకొస్తోంది. ఆ శాటిలైట్ లోని ప్రొపల్షన్ ట్యాంకులో ఉన్న గ్యాస్ తీవ్ర వేగంతో బయటికొచ్చేసిందని, దాంతో ఆ శాటిలైట్ ఒక్కసారిగా 4 కిలోమీటర్ల కిందికి వచ్చేసిందని స్పేస్ ఎక్స్ సంస్థ వెల్లడించింది.
డిసెంబరు 17 నాటికి భూమి నుంచి 418 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఉపగ్రహం… మరో వారం రోజుల్లో భూవాతావరణంలోకి ప్రవేశించి కూలిపోతుందని వివరించింది. అయితే, దీనివల్ల భూమికి ఎలాంటి ప్రమాదం లేదని, అదే సమయంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కూడా ఎలాంటి ముప్పు లేదని స్పేస్ ఎక్స్ స్పష్టం చేసింది. భూవాతావరణంలోకి ప్రవేశించగానే, ఆ శాటిలైట్ కాలిపోతుందని తెలిపింది.
కాగా, కూలిపోతున్న స్టార్ లింక్ శాటిలైట్ శకలాలను వరల్డ్ వ్యూ-3 అనే ఉపగ్రహం 241 కిలోమీటర్ల దూరం నుంచి ఫొటోలు తీసింది.



