నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది నుంచి ‘రాష్ట్ర పండుగ’గా, అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కార్తీక మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన తన అర్ధాంగితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కోటి దీపోత్సవాన్ని జాతీయ పండుగగా గుర్తించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పారు. కొన్ని రోజుల క్రితం ఇదే వేదికపై కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే జాతీయ గుర్తింపు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రకటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.
తన పుట్టిన రోజున, నాలుగు కోట్ల మంది ప్రజలకు వేదికగా నిలుస్తున్న ఇంతటి పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అల్జీపురం మఠం పీఠాధిపతి శ్రీవామనాశ్రమ స్వామి.. ముఖ్యమంత్రి దంపతులను ఆశీర్వదించారు. ఈ వేడుకలో ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి దంపతులు, పలువురు స్వామీజీలు, వేలాదిగా భక్తులు పాల్గొన్నారు.


