నవతెలంగాణ-హైదరాబాద్: పెరూ రాజధాని లిమాలో ఆ దేశ నూతన అధ్యక్షుడు జోస్ జెరి మంగళవారం అత్యయిక పరిస్థితిని ప్రకటించారు. నిరసనలను రేకెత్తించిన, తనకి ముందున్న ప్రభుత్వ పతనానికి దారితీసిన హింసాత్మక పరిస్థితులను అడ్డుకునేందుకు తాజా చర్యగా పేర్కొన్నారు. లిమాలో అత్యవసర పరిస్థితి 30 రోజులపాటు కొనసాగుతుందని టెలివిజన్ సందేశంలో జెరి పేర్కొన్నారు. పోలీసులకు సాయంగా సైనికులను మోహరించడం, ప్రజల సమావేశాలపై ఆంక్షలు విధించనున్నట్లు ప్రకటించారు. వారి స్వేచ్ఛ, కదలిక వంటి కొన్ని హక్కులను పరిమితం చేయడం వంటి చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని అన్నారు. అనంతరం అత్యయిక స్థితిని ప్రకటిస్తూ డిక్రీని జారీ చేశారు. ”యుద్ధాలను మాటలతో కాదు చర్యలతో గెలుస్తారు” అని జెరీ పేర్కొన్నారు. నేర చర్యలను ఎదుర్కొనేందుకు కొత్త విధానాన్ని రూపొందించనున్నట్లు ప్రకటించారు. పెరూలో హింస, అవినీతికి వ్యతిరేకంగా జన్‌జెడ్ కార్యకర్తల నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగిన సంగతి తెలిసిందే.
నూతన అధ్యక్షుడి జోస్ జెరీ రాజీనామాను డిమాండ్ చేస్తూ గత గురువారం నిరసనకారులు లిమాలో ఆందోళన చేపట్టారు. ఈ ప్రదర్శన హింసాత్మకంగా మారడంతో ఒక పౌరుడు మరణించగా, పోలీస్ అధికారులు, జర్నలిస్టులు సహా 100మంది గాయపడ్డారు. తాను రాజీనామా చేయబోనని జెరీ స్పష్టం చేశారు.
ఇటీవలి కాలంలో పెరూలో హత్యలు, దోపిడీలు, బహిరంగ ప్రదేశాలపై హింసాత్మక దాడులు పెరిగాయి. జనవరి మరియు సెప్టెంబర్ మధ్య 1690 హత్యలు జరిగినట్లు పోలీసులు తమ నివేదికలో తెలిపారు. 2024లో ఇదే సమయంలో 1,502 హత్యలు జరిగాయని అన్నారు. నేరాలను, పరిస్థితిని అదుపు చేయలేకపోతున్నామని ప్రకటించిన మాజీ అధ్యక్షురాలు దినా బోలువార్టేను పెరూ కాంగ్రెస్ అభిశంసనతో పదవి నుండి తొలగించింది. ఆ తర్వాత ఆమె స్థానంలో శాసనసభ్యుడు జోస్ జెరిని నియమించింది.