పంట కొనుగోళ్లకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి
మూడో డిస్కమ్‌ను ఉపసంహరించుకోవాలి..లేదంటే మరో బషీర్‌బాగ్ ఉద్యమం
రైతు ఉద్యమ స్ఫూర్తితోనే నల్లగొండలో ఏఐకేఎస్ జాతీయ మహాసభలు : నవతెలంగాణ ఇంటర్వ్యూలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు
‘తెలంగాణలో కౌలు రైతులకు రక్షణ కోసం ఒక సమగ్ర చట్టం తేవాలి. వ్యవసాయ కూలీలకు రాష్ట్ర సర్కారు అండగా ఉండాలి. కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను రేవంత్‌రెడ్డి సర్కారు నెరవేర్చాలి. పంటల కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి. రైతులకు మరణశాసనంగా మారే మూడో డిస్కమ్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేదంటే రాష్ట్రంలో బషీబాగ్ విద్యుత్ ఉద్యమం మాదిరిగా మరో పోరాటం కచ్చితంగా వస్తుంది. తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తితో రానున్న కాలంలో మరిన్ని రైతాంగ పోరాటాల రూపకల్పన కోసమే నల్లగొండలో ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నాం’ అని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు తెలిపారు. నల్లగొండలో ఈ నెల 15 నుంచి 18 వరకు జరగనున్న అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను పురస్కరించుకుని నవతెలంగాణ ప్రతినిధి అచ్చిన ప్రశాంత్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏఐకేఎస్ జాతీయ మహాసభలను హైదరాబాద్‌కు బదులుగా నల్లగొండలో నిర్వహించాలని ఎందుకు నిర్ణయించారు?
ఏఐకేఎస్ 26వ జాతీయ మహాసభలు 1989లో ఖమ్మంలో జరిగాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నల్లగొండ కీలక కేంద్రం. ఆ పోరాటానికి 80 ఏండ్లు, ఏఐకేఎస్ ఆవిర్భవించి 90 ఏండ్లు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నల్లగొండలో జాతీయ మహాసభలను నిర్వహించాలని నిర్ణయించాం. తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తిని దేశవ్యాప్తంగా చాటాలన్నదే దీని ప్రధాన ఉద్దేశం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ఐక్య ఉద్యమాలను బలోపేతం చేస్తాం.
దేశ రైతాంగ ఉద్యమానికి ఏఐకేఎస్ చేసిన ప్రధాన కృషి ఏమిటి?
ఏఐకేఎస్ ఆవిర్భవించినప్పటి నుంచి సామ్రాజ్యవాదం, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతూ వస్తున్నది. తెలంగాణ సాయుధ పోరాటం పది లక్షల ఎకరాల భూమిని పంచింది. మూడు వేల గ్రామాలను విముక్తి చేసింది. వెట్టిచాకిరీని నిర్మూలించింది. వీర తెలంగాణ రైతాంగ, పున్నప్రా-వాయలార్, తెభాగా, వర్లీ ఆదివాసీ, అస్సాం సుర్మావ్యాలీ రైతాంగ పోరాటాలకు ఏఐకేఎస్ అండగా నిలిచింది. మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ర్టాల్లో రైతుల మహాపాదయ్రాతలు చేపట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి కొన్ని హక్కులను నెరవేర్చుకోవడంలో ఏఐకేఎస్ది కీలకపాత్ర. ఇటీవల 440 రైతు సంఘాలను ఏకం చేసి సంయుక్త కిసాన్ మోర్చా ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది. మూడు వ్యవసాయ నల్లచట్టాల రద్దు కోసం సాగిన పోరాటంలో విజయం సాధించింది.
తెలంగాణలో పంటల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ వైఖరిపై మీ అభిప్రాయం ఏమిటి?
పంటల కొనుగోళ్లకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి. వరి, పత్తి, మొక్కజొన్న రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన బోనస్ హామీలను పూర్తిగా అమలు చేయడం లేదు. ఒక్క సన్నవడ్లకే వర్తింపజేస్తున్నది. అదీ ఒక్క పంటకే అని మెలిక పెట్టింది. రైతుల చేతుల్లోకి పంట వచ్చాకే హడావిడి చేసే ధోరణిని ప్రభుత్వం విడనాడాలి. మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలు, గోదాములు, రవాణా వాహనాలు, గోనెసంచులు, హమాలీలను ముందుగానే సమకూర్చాలి. ఏటా వాహనాలు, గోనె సంచుల కొరత వల్ల ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. దీనికి శాశ్వత పరిష్కారం చూపెట్టాలి. బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించాలి. మిగులు ఉత్పత్తుల విక్రయాలకు, ఎగుమతులకు కూడా ప్రణాళిక రూపొందించాలి.
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను ఎలా చూస్తున్నారు?
వ్యాపారులు సరుకులను నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా ధరలు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ నిల్వలపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి, చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహార ధాన్యాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించకుండా నియంత్రించాలి. లేకపోతే సామాన్య ప్రజలపై ధరల భారం పెరిగి ఆకలి, పేదరికం తీవ్రమవుతాయి. రైతు సంఘాలు కూడా ఈ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి.
కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏం చేయాలి?
రాష్ట్రంలో సుమారు16 లక్షల మంది కౌలు రైతులు 26 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వారి రక్షణ కోసం సమగ్ర చట్టం తీసుకురావాలి. రుణార్హత కార్డులివ్వాలి. రైతు భరోసాను వర్తింపజేయాలి. భూభారతి చట్టంలో మార్పులు చేసి కౌలు రైతుల పేర్లను రికార్డుల్లో నమోదు చేయాలి. వ్యవసాయ కార్మికులకు పని కల్పించి, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలి. పేద రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకు నెలకు రూ.10 వేల పింఛన్ ఇవ్వాలి. ఎన్నికల మ్యానిఫెస్టోలో వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చి రాష్ట్ర సర్కారు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.
మూడో విద్యుత్ డిస్కం ఏర్పాటు వల్ల రైతులకు ఏమైనా ఉపయోగం ఉంటుందా?
మూడో డిస్కం ఏర్పాటును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. రైతులకు ఉచిత విద్యుత్‌ను నిరంతరం కొనసాగించాలి. స్మార్ట్ మీటర్లు పెట్టకూడదు. విద్యుత్ బిల్లులు వసూలు చేయకూడదు. నాణ్యమైన విద్యుత్‌ను అందించాలి. విద్యుత్ రంగంలో ప్రయివేటు పెట్టుబడిదారుల లాభాల కోసం రైతుల ప్రయోజనాలను దెబ్బతీయడం సబబు కాదు. ఓపక్క కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై కొట్లాడుతూనే...మరోపక్క రాష్ట్రంలో కేంద్రం నిర్ణయాల అమలుకు రాష్ట్ర సర్కారు పూనుకోవడం దారుణం. కేంద్రం ఆదేశాల్లో భాగంగానే రేవంత్‌రెడ్డి సర్కారు మూడో డిస్కమ్‌ను తీసుకొచ్చింది. దాన్ని ఉపసంహరించుకోకపోతే మరో బషీర్‌బాగ్ విద్యుత్ ఉద్యమం వస్తుందని హెచ్చరిస్తున్నాం.
రైతుల ఆదాయం పెరగడానికి, ఆత్మహత్యలు నివారించడానికి ఏం చేయాలి?
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని కేంద్రం ఇచ్చిన హామీ నెరవేరలేదు. వారి ఆదాయం ప్రజల తలసరి ఆదాయంతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయడానికి చట్టం తీసుకురావాలి. ముఖ్యంగా సమగ్ర పెట్టుబడి వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. పంటల బీమా పథకంలో మార్పులు చేసి నష్టపోయిన రైతులకు సకాలంలో పరిహారం అందించాలి. అప్పుడే రైతుల ఆదాయానికి భరోసా కల్పించి ఆత్మహత్యలను నివారించగలం.






కామెంట్లు (0)