ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే...
60 శాతానికి పడిపోయిన వరి సాగు
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో తీవ్ర ప్రభావం, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ యాసంగి సీజన్ ప్రారంభంలోనే వ్యవసాయ రంగం తీవ్ర అభద్రతా భావంలోకి నెట్టబడింది. గతేడాది లక్షలాది ఎకరాల్లో కళకళలాడిన వరి పొలాలు నేడు నీటి ఆసరా లేక వెలవెలబోతుండగా, ఏకంగా 60 శాతానికి పైగా వరి సాగు విస్తీర్ణం పడిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సంప్రదాయ వరి సాగుకు అలవాటుపడిన రైతన్నలకు ప్రత్యామ్నాయ ఆరుతడి పంటల వైపు మళ్లే ధైర్యం చాలక పోవడం, మార్కెట్ మద్దతు ధరలపై అనుమానాలు ఉండ టంతో క్షేత్రస్థాయిలో తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఈ విపత్కర పరిస్థితుల్లో కేవలం అధికారిక ఆదేశాలకే పరి మితం కాకుండా ప్రభుత్వం రైతులకు పూర్తి భరోసా కల్పిస్తూ, ప్రోత్సాహక లబ్దిని నేరుగా అందిస్తేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా కాపాడుకోగలుగుతామని రైతులు, రైతు సంఘాల నాయకులు అభిప్రాయ పడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సీజన్ ప్రారంభంలో యాసంగి సాగు అంచనా 70 లక్షల ఎకరాలకు వ్యవసాయశాఖ అంచనా వేసింది. గతేడాది 68.67 లక్షల ఎకరాల్లో సాగైంది. ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 25 లక్షల ఎకరాలోపే సాగు ఉండవచ్చు అన్న అభిప్రాయాలు విని పిస్తున్నాయి. జలాశయాల్లోనూ నీరు లేదు. భూగర్భజలాలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలకే మొగ్గు చూపాలని వ్యవసాయ అధికారులు అంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ నాటికి సాధారణంగా నమోదవాల్సిన 822.8 మిమీ వర్షపాతానికి గాను కేవలం 587.2 మిమీ మాత్రమే నమోదు కావడంతో ఇప్పటి వరకు దాదాపు 25 శాతం మేర తీవ్ర వర్షపాత లోటు ఏర్పడింది. తాజాగా తుఫాన్ ప్రభావంతో వర్షాలు పడ్డా యాసంగికి అవరోధం తప్పడం లేదు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన ఈ వర్షాభావం జిల్లాలోని జలాశయాలలో నీటి నిల్వలను, భూగర్భ జలమట్టాలను దారుణంగా పడిపోయేలా చేసింది. గతేడాది యాసంగిలో సుమారు 2.44 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ఈసారి నీటి లభ్యత లేకపోవడంతో ఇప్పటివరకు ఏకంగా 90 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నాట్లు పడక వెలవెలబోతు న్నాయి. రాబోయే కాలంలో నీటి కొరతతో పాటు విద్యుత్ లోటు పెరిగే అవకాశం ఉండటంతో, రబీ సీజన్ మొత్తం సాగు విస్తీర్ణం భారీగా తగ్గుతుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలకు ప్రణాళికలు
నీటి సంక్షోభాన్ని అధిగమించడానికి వ్యవసాయ శాఖ గతేడాదితో పోలిస్తే ఈసారి ఖమ్మం జిల్లాలో వరి సాగును సుమారు 50 శాతం, మొక్కజొన్నను 25 శాతం తగ్గించాలని ధ్యేయంగా పెట్టుకుంది. మొత్తం సాగు విస్తీర్ణంలో ఊహించని వ్యత్యాసం కనిపిస్తుండటంతో, తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పెసలు, మినుములు, శనగలు, నువ్వులు, జొన్న వంటి ఆరుతడి పంటలు వేయాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే, దీర్ఘకాలిక లాభాలనిచ్చే ఆయిల్ పామ్ వంటి ఉద్యాన పంటలను పెంచేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేశారు. తిరుమలాయపాలెం, కొణిజర్ల, కూసుమంచి, వేంసూరు వంటి మండలాల్లో పెసలు, జొన్న, నువ్వుల సాగును ప్రోత్సహిస్తుండగా, ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 4,530 ఎకరాల నుండి 12,470 ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు.
ప్రాంతాల వారీగా పెరిగిన సాగు వ్యత్యాసాలు
జిల్లాలో మండలాల వారీగా పరిశీలిస్తే.. పెనుబల్లి, సత్తుపల్లి, వైరా, ముదిగొండ, నేలకొండపల్లి వంటి ప్రాంతాలు ఇప్పటికీ వరి సాగులోనే అగ్రస్థానంలో కొనసాగుతుండగా, వేంసూరు, సత్తుపల్లి, పెనుబల్లి మండలాలు మొత్తం యాసంగి సాగు విస్తీర్ణంలో ముందు వరుసలో ఉన్నాయి. ఈ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ శాఖ జిల్లా వ్యాప్తంగా 56,310 మెట్రిక్ టన్నుల యూరియా, 18,770 టన్నుల డీఏపీ, 8,342 టన్నుల పొటాష్‌తో పాటు 65,060 టన్నుల సంకీర్ణ ఎరువులను సిద్ధం చేసింది.
రైతులకు సమగ్ర భరోసా
ప్రస్తుత సాగు సంక్షోభం నుంచి రైతాంగాన్ని గట్టెక్కించాలంటే కేవలం కరపత్రాలు, అవగాహనా సదస్సులకే పరిమితం కాకుండా ప్రభుత్వం బాధ్యతాయుతమైన కార్యాచరణను అమలు చేయాలలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వరిని వదిలి ఆరుతడి పంటలు సాగు చేసే రైతులకు ఉచిత విత్తనాలు, ఎరువులతో పాటు ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహకాలను తక్షణమే ప్రకటించాలి.
క్షేత్రస్థాయిలో అవగాహనా సదస్సులు
వ్యవసాయ అధికారులు గ్రామస్థాయిలో ఏఈఓలు, ఎంఏఓల ద్వారా విస్తృత అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఆరుతడి పంటల ప్రాముఖ్యతను వివరిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో రైతుల స్పందన మందకొడిగా ఉంది. సంప్రదాయ వరి సాగుకే ఏండ్లుగా అలవాటుపడిన రైతులకు కొత్త పంటలు వేస్తే దిగుబడి వస్తుందా లేదా అనే భయం వెంటాడుతోంది.






కామెంట్లు (0)