Magazines

బీఆర్ఎస్ సభ్యుల్లో సగం మంది కాంగ్రెస్‌‌లో చేరిక

11 నిమిషాల క్రితం

Half of the BRS members join the Congress
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026 | 2 నిమిషాల చదవడం

లోపాయికారీ ఒప్పందం చేసుకున్న బీజేపీ

గ్రాడ్యుయేట్ల గొంతుక వినిపించేది టీఆర్ఎస్ ఒక్కటే

మా అభ్యర్థులను గెలిపించండి : కల్వకుంట్ల కవిత

భావసారూప్యత ఉన్న పార్టీల మద్దతు కోరుతాం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

ప్రతిపక్ష పార్టీ సభ్యులుగా ప్రజల గొంతుక వినిపిస్తారని శాసనమండలికి పంపిస్తే బీఆర్ఎస్ సభ్యుల్లో సగం మంది కాంగ్రెస్ లో చేరారని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. శాసనమండలిలో మిగిలిన బీజేపీ కాంగ్రెస్ పార్టీతో లోపాయికారీ ఒప్పందం చేసుకుందని ఆమె ఆరోపించారు. ఇక ప్రజలు, గ్రాడ్యుయేట్ల గొంతుకను వినిపించబోయే పార్టీ టీఆర్ఎస్ అని ఆమె స్పష్టం చేశారు. హామీలు విస్మరించి మోసగించిన అధికార పార్టీకి, మొద్దునిద్రలో ఉన్న ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. గ్రాడ్యుయేట్లు నోట్లకు ఓట్లు అమ్ముకుంటారనే అపవాదను తిప్పికొట్టాలని సూచించారు. ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశారదన్ మహారాజ్ తో పాటు భావసారూప్యత ఉన్న పార్టీల మద్దతు కోరనున్నట్టు ఆమె వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ అభ్యర్థులతో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఆకాశ్ కొల్లూరి, నల్గొండ- ఖమ్మం- వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ ను గెలిపించాలని కోరారు. వారికి వీర తిలకం దిద్ది ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భం గా కవిత మాట్లాడుతూ గ్రాడ్యుయేట్లంతా కచ్చితంగా ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందనీ, చెప్పిందే చేస్తున్నామని తెలిపారు. తమ అభ్యర్థులిద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారన్నారు. వారిలో ఆకాశ్ కొల్లూరి కుమ్మరి సామాజిక వర్గమనీ, తొలిసారిగా ఒక రాజకీయ పార్టీ ఆ వర్గానికి అవకాశ మిచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో తామే ప్రతిపక్ష పార్టీగా ఉన్నామనీ, ప్రతి సమస్యపై పోరాడుతూ పరిష్కారాలు చూపిస్తున్నామని తెలిపారు. మహిళలకు పార్టీ తరపున 33 నుంచి 50 శాతం సీట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. తమ పార్టీ గుర్తింపు ప్రక్రియలో ఈసీ నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జీలు డాక్టర్ రఘు, సయ్యద్ ఇస్మాయిల్, జిల్లాల ఎన్నికల కో ఆర్డినేటర్లు గొంగళ్ల రంజిత్, అర్చనా సేనాపతి, వాసిలి చంద్రశేఖర్, రామ్ కళ్యాణ్ చల్లా, మతిన్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్