Magazines

ఆర్టీసీ నూతన ఎండీగా అనిల్ కుమార్‌ బాధ్యతల స్వీకరణ

1 రోజు క్రితం

Anil Kumar takes charge as the new MD of RTC
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) నూతన వైస్ చైర్మెన్‌, మేనేజింగ్ డైరెక్టర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ అనిల్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం హైదరాబాద్ బస్ భవన్‌లో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సంస్థ ఉన్నతాధికారులు, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఎండీ డాక్టర్ అనిల్ కుమార్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (ఈడీలు) సీహెచ్. వెంకన్న, ఎం. రాజశేఖర్, సాలోమాన్ రాజ్, ఖుష్రో షా ఖాన్, ఏ. శ్రీధర్, ఆర్థిక సలహాదారు విజయపుష్పతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సంస్థ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆపరేషన్లు, ప్రయాణికులకు అందుతున్న రవాణా సదుపాయాలు, కొనసాగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామనీ, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి సంస్థను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మరింత సురక్షితమైన, సౌకర్యవంతమైన నాణ్యమైన ప్రయాణ సేవలను అందించేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రయాణికుల ఆదరణను మరింత పెంచుకోవాలనీ, టీమ్ వర్క్‌తో పనిచేసి టీజీఎస్ఆర్టీసీని దేశంలోనే అగ్రగామి రవాణా సంస్థగా తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్