Magazines

అమెరికాలో మరో సాంకేతిక వైఫల్యం

13 నిమిషాల క్రితం

Another technical failure in America
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం

ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిన 'ఎన్‌ఎస్‌ఏ నెట్‌'

జాతీయ భద్రతా సంస్థ సేవలకు అంతరాయం

వాషింగ్టన్‌ : అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఎస్‌ఏ) తన అంతర్గత సమాచార మార్పిడి కోసం ఉపయోగించే అత్యంత రహస్య నెట్‌వర్క్‌ 'ఎన్‌ఎస్‌ఏ నెట్‌' మంగళవారం సాంకేతిక వైఫల్యానికి గురై ఆఫ్‌లైన్‌లోకి వెళ్లింది. సాధారణ మెయిం టెనెన్స్‌, సెక్యూరిటీ ప్యాచ్‌ అప్‌డేట్‌ల సమయంలో అంతరాయం ఏర్పడిందని వార్తా సంస్థలు నివేదించాయి. ఏఐ ద్వారా గుర్తించిన పీహెచ్‌పీ భద్రతా లోపాన్ని సరిదిద్దడానికి వేసిన ప్యాచ్‌ల కారణంగా సిస్టమ్స్‌ ఆశించిన విధంగా రీస్టార్ట్‌ కాలేదని నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ క్లేటన్‌ తెలిపారు. నెట్‌వర్క్‌ వైఫల్యం వెనుక ఎలాంటి సైబర్‌ దాడి కానీ లేదా విదేశీ శక్తుల హస్తం కానీ లేదని అధికారులు స్పష్టం చేశారు. నెట్‌వర్క్‌ పునరుద్ధరణ పనుల దృష్ట్యా మేరీల్యాండ్‌ లోని ఫోర్ట్‌ మీడ్‌ ప్రధాన కార్యాలయంలో పని చేసే సిబ్బందికి 'కోడ్‌ ఎల్లో' అలర్ట్‌ జారీ చేశారు. అత్యవసర విధుల్లో ఉన్న వారు మినహా మిగిలిన సిబ్బంది ఒకేసారి కంప్యూటర్లలో లాగిన్‌ అవకుండా ఉండేందుకు వారిని విడతల వారీగా విధులకు రావాలని సూచించారు. అంతర్గత వ్యవస్థలకు అంతరాయం కలిగినప్పటికీ దేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలక కార్యకలాపాలు యథావిధిగా కొనసాగు తున్నాయి. గత కొద్ది రోజులుగా అమెరికాలోని పలు కీలక రంగాలు సాంకేతిక వైఫల్యాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గత వారం మైక్రోసాఫ్ట్‌ సేవల్లో అంతరాయం ఏర్పడింది. టెలీకమ్యూనికేషన్‌ వ్యవస్థలో లోపం కారణంగా దేశంలో విమాన సర్వీసులను నిలిపివేశారు. సాంకేతిక సమస్యల కారణంగా ఈ నెల 16న కొన్ని ప్రధాన బ్యాంకుల సేవలకూ అంతరాయం ఏర్పడింది. పాత కంప్యూటర్‌ వ్యవస్థల్లో నూతన సాంకేతికతలను అప్‌డేట్‌ చేసే సమయంలో వరుస వైఫల్యాలు చోటుచేసుకుంటున్నాయని హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ కార్యదర్శి మార్క్‌వేన్‌ ముల్లిన్‌ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్