Magazines

స్మార్ట్‌ ‌రోడ్ల నిర్మాణమే ‘ఐఆర్‌‌సీ’ లక్ష్యం

10 నిమిషాల క్రితం

The goal of the ‘IRC’ is the construction of smart roads.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026 | 2 నిమిషాల చదవడం

కనెక్టివిటీ బాగుంటేనే 
పెట్టుబడులొస్తాయి

రాష్ట్ర ప్రాజెక్టులకు వెంటనే 
అనుమతులివ్వాలని గడ్కరీని కోరతాం : రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ప్రమాద రహిత స్మార్ట్‌ ‌రోడ్ల నిర్మాణమే ఇండియన్‌ ‌రోడ్స్‌ ‌కాంగ్రెస్‌ 85‌వ వార్షిక సదస్సు లక్ష్యమని రాష్ర్ట రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నేటి నుంచి 22 వరకు నాలుగు రోజుల పాటు హైదరాబాద్, హైటెక్స్ వేదికగా జరగనున్న 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సమావేశాల లక్ష్యాలు, చర్చించే అంశాలను బుధవారం ఆయన మీడియాకు వివరించారు. ఉదయం 11 :30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమావేశాలను ప్రారంభిస్తారని తెలిపారు. 400 ఎగ్జిబిషన్ స్టాళ్లు, 19 టెక్నికల్ సెషన్ల ద్వారా కొత్త టెక్నాలజీ, యంత్రాలు, నిర్మాణ పద్ధతులను తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. సదస్సులో వివిధ రాష్ట్రాల నుంచి రోడ్లు, హైవేల రంగానికి చెందిన నిపుణులు, ఇంజినీర్లు, అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు 3,500 మంది పాల్గొంటారని తెలిపారు. స్వాతంత్రానికి పూర్వం నిజాం కాలంలో 1938 లో 4వ ఐఆర్‌‌సీ సదస్సుకు మొదటిసారిగా హైదరాబాద్ వేదికైందని అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 7వ సారి నిర్వహించడం తెలంగాణకు గర్వ కారణమన్నారు. పర్యావరణానికి అనుకూలమైన రోడ్ల నిర్మాణం, వాతావరణ మార్పులను తట్టుకునేలా మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆధునిక రవాణా వ్యవస్థలు వంటి ముఖ్యమైన అంశాలపై సదస్సు చర్చించనుందని వివరించారు. ప్రమాదాల నివారణ అంత్యంత ప్రాధాన్యమైన అంశమని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరికీ సురక్షితంగా నడిచే హక్కు ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో రోడ్ల వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రీజినల్ రింగ్ రోడ్, హైదరాబాద్–విజయవాడ హైవే విస్తరణ, హైదరాబాద్ ఎలివేటెడ్ కారిడార్ వంటి కీలక ప్రాజెక్టులపై దృష్టి పెట్టామన్నారు. తెలంగాణలోని రహదారుల అనుమతులు వెంటనే మంజూరు చేయాలని సదస్సు వేదికగా గడ్కరీని కోరతామని వెంకటరెడ్డి పేర్కొన్నారు.

రాష్ర్ట ప్రభుత్వం ప్రతిపాదించిన రహదారులు పూర్తయితే హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు పారిశ్రామిక రంగం వేగంగా విస్తరిస్తుందన్నారు. మెరుగైన కనెక్టివిటీ ఉంటేనే పెట్టుబడులు పెరిగి నూతన పరిశ్రమలు ఏర్పాటు అయ్యి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌‌రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్