ముంబయి పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణలో ఉత్పత్తిరంగంలో పెట్టుబడులు పెట్టి, వ్యాపార విస్తరణను చేపట్టుకోవాలని రాష్ర్ట ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముంబయి పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. దీనికోసం ప్రతి సంస్థకు ప్రత్యేక అధికారితో పెట్టుబడుల ప్రక్రియకు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ‘‘మీ ప్రధాన కార్యాలయం ముంబయిలోనే ఉంచుకోండి.. తయారీ, వ్యాపార విస్తరణ, అభివృద్ధి కార్యకలాపాలను తెలంగాణలో చేపట్టండి’’ అని స్పష్టం చేశారు. ముంబయిలోని వర్లీలో ఫోర్ సీజన్స్ హోటల్‌లో బుధవారం భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సహకారంతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ రోడ్‌షోలో మంత్రి ప్రసంగించారు.
ముంబయి నుంచి పెట్టుబడులను తరలించుకురావాలన్నది తమ ఉద్దేశం కాదని, అక్కడి సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలను కొనసాగిస్తూనే తెలంగాణలో ఉత్పత్తి, వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకునేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణకు చెందిన కార్మికులు, చేతివృత్తులవారు, వ్యాపారవేత్తలు ముంబయి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. రెండు ప్రాంతాల మధ్య దశాబ్దాలుగా వాణిజ్య, వ్యాపార సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు.
సాంకేతిక రంగం, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (జీసీసీలు), డేటా సెంటర్లు, ఔషధ పరిశ్రమలు, వస్త్రాలు, దుస్తుల తయారీ, మీడియా, వినోద రంగాల్లో తెలంగాణలో విస్తృత అవకాశాలున్నాయని వివరించారు. డిసెంబరు 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’లో పాల్గొనాలని ఆహ్వానించారు. పెట్టుబడులకు వేగంగా అనుమతులు మంజూరు చేసే టీజీ-ఐపాస్ విధానాన్ని వివరించారు. ముంబయి నుంచి తెలంగాణకు వచ్చే ప్రతి సంస్థకు ప్రత్యేక అధికారిని కేటాయిస్తామని ప్రకటించారు. పెట్టుబడులపై తొలి చర్చల నుంచి సంస్థ కార్యకలాపాలు ప్రారంభించి ఆదాయం ఆర్జించే దశ వరకు ఆ అధికారి పూర్తి సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు. పెట్టుబడిదారులకు అన్ని దశల్లో అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సీఐఐ మహారాష్ట్ర రాష్ట్ర మండలి ఉపాధ్యక్షురాలు ఆర్తి కూచిభట్ల తెలంగాణా ప్రతినిధి బృందానికి స్వాగతం పలికారు. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) వైస్ ఛైర్మన్, ఎండీ శశాంక్, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవో బి. అజిత్‌రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)