Magazines

ఉద్యోగులకు ఓయూ వీసీ భరోసా

13 నిమిషాల క్రితం

OU VC assures employees
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026 | 2 నిమిషాల చదవడం

ఉద్యోగులతో చర్చలు సఫలం

రిలే నిరాహార దీక్షలు విరమణ

నవతెలంగాణ – ఉస్మానియా యూనివర్సిటీ

​“ఉద్యోగులకు ముందుగా కడుపునిండా అన్నం పెడతాను.. ఆ తర్వాతే పని చేయిస్తాను” అంటూ ఓయూ నాన్ టీచింగ్ ఉద్యోగులకు వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం భరోసా ఇచ్చారు. ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇవ్వడంతో 26 రోజులుగా కొనసాగుతున్న ఉద్యోగుల ఉద్యమంలో సానుకూల పరిణామం చోటుచేసుకుంది. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష బుధవారం రెండో రోజుకు చేరుకున్న నేపథ్యంలో వీసీ వారిని చర్చలకు ఆహ్వానించారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు, దీర్ఘకాలిక సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం చర్చలు సఫలమైనట్టు జేఏసీ నాయకులు తెలిపారు. దాంతో రిలే నిరాహార దీక్ష విరమించారు.

ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనవంతు పూర్తి సహకారం అందిస్తానని వీసీ హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఉద్యోగులందరికీ చర్చల సారాంశాన్ని వీసీ స్వయంగా వివరించారని, దీంతో సమస్యల పరిష్కారంపై ఆశలు, నమ్మకం పెరిగాయని తెలిపారు. ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలోనూ పలువురు ప్రజాప్రతినిధులు, నాయకుల నుంచి మద్దతు లభించిందని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దామోదర రాజనర్సింహ, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు ఉద్యోగుల సమస్యలపై స్పందించి సహకారం అందించడంపై కృతజ్ఞతలు తెలిపారు. ఐఏఎస్ అధికారి యోగితా రాణా సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. 26 రోజులుగా జేఏసీ ఇచ్చిన పిలుపులకు స్పందిస్తూ నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు, రిలే నిరాహార దీక్షల్లో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న నాన్ టీచింగ్ ఉద్యోగుల ఐక్యతతో సమస్యల పరిష్కారానికి సానుకూల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని నాయకులు తెలిపారు. న్యాయమైన హక్కులు సాధించే వరకు ఐక్యంగా, బాధ్యతా యుతంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఉద్యమానికి మద్దతుగా నిలిచిన విద్యార్థి, కార్మిక, పరిశోధక విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులకు జేఏసీ ధన్యవాదాలు తెలిపింది. తమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన మీడియా ప్రతినిధులకు, సహకరించిన పోలీసు అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్