ఇందిరమ్మ జయంతి సందర్భంగా బ్రేక్ఫాస్ట్ పథకం విస్తరణ
నేటి నుంచి అదనంగా 43,657 మంది చిన్నారులకు అల్పాహారం
ఇప్పటికే 7 జిల్లాల్లో 91,796 మంది చిన్నారులకు ప్రతిరోజూ బ్రేక్ఫాస్ట్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే మిగిలిన 19 జిల్లాల్లోనూ అమలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చిన్నారుల్లో ఆకలిని దూరం చేసి, వారికి పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు ప్రీ-స్కూల్ విద్యలో అభ్యాస సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘తొలిముద్ద’ అల్పాహార పథకాన్ని మరో ఏడు జిల్లాలకు విస్తరించనుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న ఈ పథకాన్ని అదనంగా ఏడు జిల్లాల్లో ప్రారంభించనున్నారు. భూపాలపల్లి, జనగాం, వనపర్తి, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల 43,657 మంది చిన్నారులకు ఈ పథకం ద్వారా ప్రతిరోజూ అల్పాహారం అందించనున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, నాగర్కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ఈ పథకం అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడు జిల్లాల్లోని 8,694 అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతిరోజూ 91,796 మంది చిన్నారులకు ఉదయం అల్పాహారం అందిస్తున్నారు. తాజాగా మరో ఏడు జిల్లాలకు విస్తరించడంతో ఈ పథకం ద్వారా లబ్ధి పొందే చిన్నారుల సంఖ్య మరింత పెరగనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే మిగిలిన 19 జిల్లాల్లోనూ ‘తొలిముద్ద’ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.
చిన్నారుల ఆరోగ్యం.. అభ్యాస సామర్థ్యమే ప్రాధాన్యం
తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ఆరోగ్యవంతమైన, పోషకాహారంతో కూడిన సమాజ నిర్మాణమే లక్ష్యంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.5 లక్షల మంది 3 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల చిన్నారులు అంగన్వాడీ కేంద్రాలకు హాజరవుతున్నారు. వీరిలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన అనేక మంది చిన్నారులు ఉదయం అల్పాహారం తీసుకోకుండానే కేంద్రాలకు వస్తున్నట్టు గుర్తించారు. దీనివల్ల వారి శక్తి సామర్థ్యాలు, ఏకాగ్రత, ప్రీ-స్కూల్ విద్యలో పాల్గొనే ఆసక్తిపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్), యునిసెఫ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్) తదితర సంస్థల నిపుణులతో ప్రభుత్వం సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫారసుల మేరకు తెలంగాణ ఫుడ్స్ ద్వారా ఉప్మా మిక్స్, ఖిచిడీ మిక్స్ అనే రెండు రకాల ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ మిశ్రమాలను రూపొందించారు. ఈ ఏడాది మార్చిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ‘తొలిముద్ద’ పథకాన్ని ప్రారంభించారు.
ప్రతి చిన్నారికి పోషకాలతో కూడిన అల్పాహారం
ప్రస్తుతం ఏడు జిల్లాల్లో ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 9.30 గంటల మధ్య చిన్నారులకు అల్పాహారం అందిస్తున్నారు. ఒక్కో చిన్నారికి రోజుకు 116.25 కిలో కేలరీల శక్తితో పాటు 3.9 గ్రాముల ప్రోటీన్ అందుతోంది. వీటితో పాటు సోడియం, కాల్షియం, ఐరన్, విటమిన్ ఎ, బి1, బి2, బి12, సి, ఫోలిక్ యాసిడ్, నియాసిన్, జింక్ వంటి అవసరమైన సూక్ష్మ పోషకాలు కూడా లభిస్తున్నాయి.
ఇందిరమ్మ స్ఫూర్తితో చిన్నారుల సంక్షేమానికి మరో ముందడుగు : మంత్రి సీతక్క
ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మరో ఏడు జిల్లాల్లో ‘తొలిముద్ద’ పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. అంగన్వాడీ సేవలను ప్రారంభించిన ఇందిరాగాంధీ జయంతి రోజునే ఈ కార్యక్రమాన్ని మరిన్ని జిల్లాలకు విస్తరించడం ప్రత్యేకతను సంతరించుకుందని పేర్కొన్నారు. “చిన్నారుల్లో ఆకలి ఉండకూడదన్నదే ఈ పథకం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఆకలితో ఉంటే పిల్లల్లో ఏకాగ్రత తగ్గుతుంది. చదువుపై ఆసక్తి, విషయాలను గ్రహించే శక్తి కూడా ప్రభావితమవుతాయి. చిన్నారుల్లో అభ్యాస సామర్థ్యం పెరగాలంటే వారికి సరైన వయస్సులో సరైన పోషకాహారం అందాలి. అందుకే అంగన్వాడీ కేంద్రాల్లో అల్పాహారం అందించే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దేశంలో మరెక్కడా లేని విధంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఉదయం అల్పాహారం అందించే కార్యక్రమాన్ని తెలంగాణలో అమలు చేస్తున్నాం. ఇప్పటికే ఏడు జిల్లాల్లో విజయవంతంగా కొనసాగుతున్న ఈ పథకాన్ని ఇందిరమ్మ జయంతి సందర్భంగా మరో ఏడు జిల్లాలకు విస్తరిస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలోనే మిగిలిన 19 జిల్లాల్లోనూ అమలు చేస్తాం. ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందించి ఆరోగ్యవంతమైన తరాన్ని తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం” అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.






కామెంట్లు (0)