స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో రైతాంగానికి తీవ్ర నష్టం
రైతులకు మద్దతు ధర, రుణ విమోచన చట్టాలు చేయాలి
రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటాలు ఉధృతం
నారాయణగూడ చౌరస్తా నిరసనలో ఎస్కేఎం నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను తక్షణమే విడనాడి, రైతులు పండించి న పంటలకు కనీస మద్దతు ధర, రుణ విమోచన చట్టాలను చేయాలనీ, రాజ్యాంగాన్ని పరిరక్షించా లని సంయుక్త కిసాన్‌మోర్చా(ఎస్కేఎం) రాష్ట్ర కన్వీనర్లు తీగల సాగర్, పశ్య పద్మ, జేవి చలపతిరావు, వి ప్రభాకర్, జక్కుల వెంకటయ్య, ప్రసాదన్న, కొండల్, విజయ్, రామకృష్ణ, గౌని ఐలయ్య డిమాండ్ చేశారు. ఎల్‌నినో కరువులో నష్టపోయిన రైతాంగానికి ఆహార ధాన్యాలకు ఎకరానికి రూ.30 వేలు, వాణిజ్య పంటలకు ఎకరానికి 50 వేల రూపాయలు పరిహారమివ్వాలని కోరారు. ఎస్కేఎం దేశవ్యాప్త పిలుపులో భాగంగా హైదరాబాద్‌లోని నారాయణ గూడ చౌరస్తాలో వివిధ రైతు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు తప్పుబడుతూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్కేఎం రాష్ట్ర కన్వీనర్లు మాట్లాడుతూ...
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పేరుతో విదేశీ ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను తగ్గించడం, ఎత్తేయడం వల్ల దేశ రైతాంగం సంక్షోభంలోకి వెళ్తుందని హెచ్చరించారు. విదేశీ వ్యవసాయ ఉత్పత్తులు దేశీయ మార్కెట్లలోకి పెద్ద ఎత్తున వస్తే మన రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ రైతాంగ పోరాటం సందర్భంగా రైతులకు లిఖిత పూర్వక హామీలను నెరవేర్చడంలో మోడీ సర్కారు విఫలమైందని విమర్శించారు. మరోవైపు రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించే విద్యుత్, విత్తన చట్టాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న తీరును ఎండగట్టారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం ఉత్పత్తి వ్యయానికి 50 శాతం కలిపి కనీస మద్దతు ధర నిర్ణయించి చట్టబద్ధత కల్పించాలని కోరారు. కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల రాయితీలు, రుణ మాఫీలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశానికి వెన్నెముకగా ఉన్న రైతాంగం రుణాలను ఎందుకు మాఫీ చేయడం లేదని ప్రశ్నించారు.
రైతులందరికీ సంపూర్ణ రుణ విముక్తి కల్పించే చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తూ, రాజ్యాంగ మౌలిక విలువలకు విరుద్ధంగా మోడీ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఎల్‌నినో కరువు నేపథ్యంలో తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రూ.50 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీలో పనిచేస్తున్న వారికి ఏటా200 రోజులు పని కల్పించి రోజుకూలి 700 రూపాయలు ఇవ్వాలని కోరారు. రైతు, ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు ఎస్.పుణ్యవతి, ఎమ్డీ అబ్బాస్, మూడ్ శోభన్, వంగూరు రాములు, స్కైలాబ్ బాబు, ఈశ్వర్ రావు, కూరపాటి రమేష్ , పి. శ్రీకాంత్, అనగంటి వెంకటేష్, దామెర కిరణ్, కుమారస్వామి, నరేష్, దామోదర్ రెడ్డి, వి కోటేశ్వరరావు, మామిడాల బిక్షపతి, మహేందర్, కే అడివయ్య, జి. అనురాధ, శివ బాబు, అరుణ, పి మహేష్, కే నాగరాజు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)