కత్తితో బెదిరించినట్టు ఆరోపణలు
వార్డెన్‌పై పోలీసులకు ఫిర్యాదు
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ వసతి గృహంలో విద్యార్థులపై వార్డెన్ దాడి చేయడంతో పాటు పదునైన కత్తితో బెదిరించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 29న హాస్టల్ తనిఖీకి కమిషనర్ వస్తున్నారనే కారణంతో విద్యార్థులను పాఠశాలకు పంపకుండా వసతి గృహంలోనే ఉంచారు. అయితే పాఠశాలలో ఎఫ్‌ఆర్‌ఏ అటెండెన్స్ ఉన్న నేపథ్యంలో ఐదో తరగతి విద్యార్థులు కొందరు పాఠశాలకు వెళ్లి తిరిగి హాస్టల్‌కు చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వార్డెన్ విద్యార్థులపై బకెట్‌తో దాడి చేయడంతో పాటు పదునైన కత్తిని చూపిస్తూ చంపుతానని, గొంతు కోస్తానని బెదిరించినట్టు బాధిత విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రులు సమాచార హక్కు రక్షణ చట్టం-2005 యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు దబ్బటి శేఖర్ దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే ఆయన విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి హాస్టల్‌కు చేరుకొని వార్డెన్‌ను ప్రశ్నించగా, 'నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో పో' అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. అనంతరం బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి దబ్బటి శేఖర్ చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో వార్డెన్‌పై ఫిర్యాదు చేశారు. బాలల సంరక్షణ అధికారులకు కూడా సమాచారం అందించారు. సమాచారం అందుకున్న చైల్డ్ వెల్ఫేర్ అధికారులు వసతి గృహానికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. హాస్టల్‌ను తనిఖీ చేసి, పూర్తి వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు.
అధికారులు తక్షణమే స్పందించాలి
విద్యార్థులపై దాడి, కత్తితో బెదిరింపుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని, విద్యార్థుల వాంగ్మూలాలను వార్డెన్ సమక్షంలో కాకుండా స్వతంత్రంగా నమోదు చేయాలని పలువురు సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేశారు. హాస్టల్‌లోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకొని పరిశీలించాలని, విచారణ జరిపి, ఆరోపణలు నిర్ధారణ అయితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో విద్యార్థుల తల్లిదండ్రులు బుట్టి సత్యం, షేక్ గౌస్, పాలమాకుల రమేష్, కోడం వెంకటేష్ తదితరులు ఉన్నారు.






కామెంట్‌లు (0)