Magazines

ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట

13 నిమిషాల క్రితం

seats
avatar
balaji

ప్రచురించబడింది నవం 19, 2026 | 2 నిమిషాల చదవడం

ఎస్సీ వర్గీకరణను అమలు చేసి చూపించాం

రాజకీయంగా అత్యధిక అవకాశాలు కల్పించాం : పార్లమెంటరీ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి


నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

ఎస్సీ, ఎస్టీలకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై పార్లమెంటరీ కమిటీ చైర్మెన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే, కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్నామని కమిటీకి సీఎం వివరించారు. శాసన సభ స్పీకర్ గా, మంత్రులుగా దళితులకు రాజకీయంగా సముచిత అవకాశం కల్పించామన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు వివిధ కార్పొరేషన్లలో అనేక అవకాశాలు కల్పించామని తెలిపారు. వందేండ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా దళితుడికి అవకాశం కల్పించామన్నారు. ఉస్మానియాతో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ ఓపెన్ యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ ఐఐఐటీల్లో ఎస్సీ, ఎస్టీలకు వీసీలుగా అవకాశాలు ఇచ్చామని వివరించారు.

అర్హత, అవకాశం ఉన్న ప్రతీచోట ఎస్సీ, ఎస్టీలకు స్థానం కల్పించామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విషయంలోనూ వారినే ప్రాధాన్యతగా తీసుకున్నామని వివరించారు. సీఎంఆర్ఎఫ్, ఆరోగ్యశ్రీ నిధులకు సంబంధించి 50 శాతం పైగా ఎస్సీ, ఎస్టీల కోసం ఖర్చు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. వర్గీకరణ అమలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుపై ముఖ్యమంత్రిని కమిటీ సభ్యులు అభినందించారు. ఈ సమావేశంలో ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీగణేశ్, కమిటీ సభ్యులు తాపీర్ గావ్, హరీశ్చంద్ర మీనా, అనిల్ ఫిరోజియా, అరుణ్ కుమార్, ప్రసాద రావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

దేశ సమైక్యత కోసం కృషి చేసిన నేత ఇందిరాగాంధీ : సీఎం రేవంత్ రెడ్డి

భార‌త‌దేశ సమగ్రత, సమైక్యత, ఐక్యత కోసం త‌న జీవితాంతం కృషి చేసిన గొప్ప నాయకురాలు, పేద‌ల ఆత్మ బంధువు, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కొనియాడారు. దేశం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పని చేసిన ధైర్యశాలి ఇందిరాగాంధీ అని స్మరించుకున్నారు. ఆమె చూపిన మార్గం, అమలు చేసిన సంక్షేమ విధానాలు నేటికీ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా దేశానికి ఆమె చేసిన సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. దేశం ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న సమయంలోనూ ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్న నాయకురాలు ఇందిరాగాంధీ అని చెప్పుకొచ్చారు. బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు, 20 సూత్రాల కార్యక్రమం వంటి కీలక నిర్ణయాలతో దేశ ఆర్థిక, సామాజిక రంగాల్లో ఇందిరాగాంధీ అనేక మార్పులకు శ్రీకారం చుట్టారని సీఎం తెలిపారు. ఆమె ఆశయాలు, సంక్షేమ విధానాల స్ఫూర్తితోనే తెలంగాణలో ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్