సాగర్ నుంచి ఏపీ ప్రతిపాదించిన
1.8 టీఎంసీల నీటి తరలింపుపై అభ్యంతరం చెప్పాం
తెలంగాణ చరిత్ర గుర్తుచేసుకోండి ..
కేసీఆర్‌ను అడిగి తెలుసుకో : బీఆర్‌ఎస్‌పై మంత్రి ఉత్తమ్ తీవ్ర విమర్శలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని విస్మరించి ఆమెపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శలు చేయడం సరికాదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సోనియా గాంధీ సంకల్పం లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదే కాదనీ, ఈ విషయాన్ని కేసీఆర్ కూడా శాసనసభలో చెప్పారని గుర్తుచేశారు. బుధవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన బీఆర్‌ఎస్ నాయకత్వం తీరుపై ఘాటు విమర్శలు చేశారు. ‘‘సోనియా గాంధీ పుస్తకంలో తెలంగాణ ప్రస్తావన ఉందా, లేదా అన్నది అసలు విషయం కాదు. తెలంగాణ ఏర్పాటు కోసం ఆమె తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని గుర్తుంచుకోవాలి. రాష్ట్రం ఏర్పడిన తరువాతే కేటీఆర్ కుటుంబానికి తెలంగాణలో పదవులు వచ్చాయి. ఆ విషయాన్ని మరిచి, తెలంగాణ ఇచ్చిన నాయకురాలిపై విమర్శలు చేయడం బీఆర్‌ఎస్ నాయకుల నైజాన్ని బయటపెడుతోంది’’ అని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలనూ మంత్రి తప్పుబట్టారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నెహ్రూ కృషిని కేటీఆర్ తక్కువ చేసి మాట్లాడటం విడ్డూరమని నిరసించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి సుమారు 21 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న నాగార్జునసాగర్ ఒక అద్భుతమైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. ‘‘లక్షలాది ఎకరాల ఆయకట్టుకు ఆధారమైన ప్రాజెక్టు గురించి మాట్లాడే ముందు, పదేండ్ల పాలనలో తాము పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్టులేమిటో బీఆర్‌ఎస్ చెప్పాలి’’ అని సవాల్ విసిరారు. సాగునీటి రంగంలో రూ.1.83 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పుకుంటున్న బీఆర్‌ఎస్, ఆ వ్యయానికి తగిన ఫలితాలను రైతులకు అందించలేకపోయిందని ఆరోపించారు.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, ఆర్డీఎస్ ఆధునికీకరణ, ఎస్‌ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టుల పురోగతిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ సాగునీటి వ్యయంలో దాదాపు 75 శాతం గోదావరి బేసిన్‌కే కేటాయించి, కృష్ణా బేసిన్‌కు సుమారు 25 శాతమే వెచ్చించారని గుర్తుచేశారు. దీంతో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల రైతులకు అన్యాయం జరిగిందన్నారు. కృష్ణా జలాల విషయంలోనూ బీఆర్‌ఎస్ వైఖరి తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని మంత్రి విమర్శించారు. 811 టీఎంసీల నీటిలో ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించే నిష్పత్తికి గత ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. తమ ప్రభుత్వం మాత్రం పరీవాహక ప్రాంతం, సాగునీటి అవసరాలు, జనాభా తదితర అంశాల ఆధారంగా తెలంగాణకు 555 టీఎంసీలు రావాలని కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ ముందు వాదిస్తోందని వివరించారు.
బీఆర్‌ఎస్ పాలనలో ఆంధ్రప్రదేశ్ 4,464 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకోగా, తెలంగాణ వినియోగం 1,993 టీఎంసీలకే పరిమితమైందని ఉత్తమ్ పేర్కొన్నారు. ప్రస్తుత జల సంవత్సరంలో అక్టోబరు 30 నాటికి ఆంధ్రప్రదేశ్ 98.16 టీఎంసీలు వినియోగించుకోగా, తెలంగాణ 122.74 టీఎంసీలు వినియోగించుకుందని చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి పథకాన్ని 2014లో ప్రకటించినప్పటికీ, దాని సమగ్ర ప్రాజెక్టు నివేదికను 2022లోనే సమర్పించారనీ, అనుమతుల సాధనలో జరిగిన జాప్యంతో ప్రాజెక్టు వ్యయం పెరిగిందని ఆరోపించారు. నాగార్జునసాగర్ జలాశయం నుంచి సుమారు 1.8 టీఎంసీల నీటిని తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన తాగునీటి పథకంపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర అభ్యంతరాలు తెలిపిందని మంత్రి వెల్లడించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తమ అభ్యంతరాలను పంపినట్టు చెప్పారు. తెలంగాణ నీటి హక్కులను ప్రభావితం చేసే ఏ పథకాన్నైనా వ్యతిరేకిస్తామనీ, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ స్పష్టం చేశారు.






కామెంట్‌లు (0)