తొలిరోజు నాలుగు కిలోమీటర్ల మహా ప్రదర్శన..
రెడ్‌షర్ట్ వాలంటీర్ల కవాతు.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్తామని ప్రతిన
ఉత్తేజంగా ముగిసిన మహాసభ ఉద్యమస్ఫూర్తితో సొంత రాష్ర్టాలకు ప్రతినిధులు
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రకు సాక్షిగా నిలిచిన నల్లగొండ గడ్డపై అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలు రైతాంగ ఐక్యతను చాటిచెప్పాయి. వేలాది మంది రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, యువతీ యువకుల భాగస్వామ్యంతో సాగిన మహాసభలు ఎర్రజెండాల రెపరెపల మధ్య ఉద్యమ ఉత్సాహాన్ని నింపాయి. తొలిరోజైన ఈనెల 15న నాలుగు కిలోమీటర్ల భారీ ప్రదర్శన, రెడ్‌షర్ట్ వాలంటీర్ల కవాతు, భారీ బహిరంగ సభ, సాంస్కృతిక ప్రదర్శనలు, అగ్రి షో ఆద్యంతం ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రతినిధుల సభ, కీలక తీర్మానాలు ఈ మహాసభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సారంపల్లి మల్లారెడ్డి నగర్(నల్లగొండ) నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
నల్లగొండలోని సారంపల్లి మల్లారెడ్డి నగర్‌లో నిర్వహించిన అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలు ఉత్తేజపూరిత వాతావర ణంలో సాగాయి. తొలిరోజు మర్రిగూడ బైపాస్ రోడ్డు నుంచి ఎన్‌జీ కాలేజీ ప్రాంగణం వరకు చేపట్టిన రైతుల మహా ప్రదర్శన లాంగ్‌మార్చ్‌ను తలపించింది. నాలుగు కిలోమీటర్ల మేర సాగిన మహాప్రదర్శన, రెడ్ షర్టు వాలంటీర్ల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నల్లగొండ పట్టణం లాల్ జెండాల రెపరెపలతో ఎర్రవనంగా మారింది. ప్రదర్శన అగ్రభాగంలో జాతీయ నాయకత్వం నడిచింది. ఎన్‌జీ కళాశాల ప్రాంగణంలో వేలాది మందితో బహిరంగ సభ జరిగింది. మాజీ ఎంపీ బృందాకరత్, అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షులు అశోక్ ధావలే, ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్, ఆహ్వాన కమిటీ అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్, ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ ప్రసంగాలు మహాసభకు వచ్చిన రైతాంగంలోనూ, ప్రతినిధుల్లోనూ చైతన్యం నింపాయి.
స్ఫూర్తి నింపిన కల్చరల్ ఫెస్ట్..
నల్లగొండ పట్టణంలోని క్లాక్‌టవర్ సెంటర్‌లో మూడు రోజుల పాటు ప్రజానాట్యమండలి కళాకారుల ఆధ్వర్యంలో కల్చరల్ ఫెస్ట్ నిర్వహించారు. దీన్ని సినీ దర్శకులు బాబ్జీ ప్రారంభించారు. ఈ కళా ప్రదర్శనలను నల్లగొండ ప్రజలు ఆసక్తిగా తిలకించారు. 17న సారంపల్లి మల్లారెడ్డి నగర్ ప్రాంగణంలో పీఎన్‌ఎమ్ కళాకారులు ప్రదర్శించిన వీర తెలంగాణ నాటకం మహాసభ ప్రతినిధుల్లో పోరాట స్ఫూర్తిని నింపింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అగ్రనాయకుడు పుచ్చలపల్లి సుందరయ్యపై పాడిన పాటకు విజూ కృష్ణన్, యువతీ యువకులు, ప్రతినిధులు సైతం స్టెప్పులేశారు.
అన్నదాతలను ఆలోచింపజేసిన అగ్రిషో
ఈనెల 14, 15, 16 తేదీల్లో నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్‌లో నిర్వహించిన అగ్రిషో అన్నదాతలను ఆలోచింపజేసింది. వ్యవ సాయ రంగంలో వచ్చిన నూతన ఆవిష్కరణల గురించి అవగాహన చేసుకునేందుకు వేదికగా నిలిచింది. అధిక దిగుబడినిచ్చే నూతన వంగడా లకుచెందిన విత్తనాల ప్రదర్శన చేపట్టారు. ఉద్యాన పంటల పెంపు సాగుపై పలు స్టాళ్ల ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. తక్కువ నీటితో ఎక్కువ భూమిని సాగు చేసే, పంట దిగుబడులను పొందే డ్రిప్ ఇరిగేషన్‌పై ప్రదర్శన చేపట్టారు. అగ్రిషోలో ఫెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, వర్మి కంపోస్టుపై విడమర్చి చెప్పారు. నీటి సంరక్షణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. వివిధ రకాల వ్యవసాయ పనిముట్లను ప్రదర్శించారు.
ఉద్యమ బలోపేతమే లక్ష్యంగా...
సారంపల్లి మల్లారెడ్డి నగర్‌లో 15 నుంచి 18 వరకు నాలుగు రోజులపాటు సాగిన ఏఐకేఎస్ 36వ మహాసభలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు వ్యవసాయ రంగ సంక్షోభంపై విస్తృతంగా చర్చించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలు, రైతుల రుణభారం, పంటల కొనుగోలు, వ్యవసాయ కార్మికుల ఉపాధి, సాగునీటి సమస్యలు, కార్పొరేట్ శక్తుల పెత్తనం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పం దాల ప్రభావం వంటి అంశాలపై సుధీర్ఘంగా రాష్ట్రాల వారీగా ప్రతి నిధులు చర్చకు పెట్టారు. ప్రతి నిధుల సభలో సంఘం జాతీయ అధ్య క్షులు అశోక్ ధావలే, ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ రైతాంగ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలనీ, సంఘం స్వతంత్ర శక్తిని పెంచాలని పిలుపునిచ్చారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాటాలు నిర్మించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
భవిష్యత్ పోరాటాలకు దిశానిర్దేశం
మహాసభలో 10 తీర్మానాలను ఆమోదిం చారు. రైతులకు గిట్టుబాటు ధరలు, వ్యవసా యానికి ప్రభుత్వ మద్దతు, రైతుల రుణవిముక్తి, వ్యవసాయ కార్మికులకు ఉపాధి భద్రత, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాల నిర్మాణం వంటి అంశాలపై జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నేర్పిన ఐక్యత, త్యాగం, పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకొని దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాన్ని విస్తరించాలన్న సంకల్పం ఈ మహాసభల్లో ప్రస్ఫుటమైంది.
వాలంటీర్ల సేవలు భేష్
జాతీయ మహాసభల విజయవంతం కోసం ఆహ్వాన కమిటీ, నల్లగొండ జిల్లా నాయకత్వం చేసిన కృషి ఫలించింది. వాలంటీర్ల సేవలతో మహాసభ దిగ్విజయ మైంది. ట్రాన్స్‌ఫోర్టు, ఫుడ్, రిసెప్షన్ , మెడికల్, వసతి, ఇలా 27 కమిటీలతో కూడిన 500 మంది వాలంటీర్లు రేయిం బవళ్లు ప్రతినిధులకు సేవలందించారు. అతిథులకు లోటుపాట్లు రాకుండా చూసుకున్నారు.






కామెంట్‌లు (0)