వాటిని వ్యూహాత్మకంగా నిర్మించాలి : ఏఐకేఎస్ అఖిల భారత అధ్యక్షుడు అశోక్ ధావలే పిలుపు
రైతాంగ ఉద్యమాలను బలోపేతం చేయాలని దిశా నిర్దేశం
ప్రజాస్వామ్య, రాజ్యాంగ రక్షణ కోసం ఐక్యంగా పోరాడాలి : విజూ కృష్ణన్
నల్లగొండలో ముగిసిన 36వ మహాసభ
సారంపల్లి మల్లారెడ్డి నగర్ నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మతతత్వ, కార్పొరేట్ అనుకూల విధానాలను వ్యతిరేకిస్తూ ప్రతిఘటనోద్యమాలను వ్యూహాత్మ కంగా నిర్మించాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) అఖిల భారత అధ్యక్షునిగా ఎన్నికైన అశోక్ ధావలే పిలుపునిచ్చారు. అందుకనుగుణంగా ప్రచారం, ఆందోళన కార్యాచరణ రూపొందించాలని ఆయన సూచించారు. దేశంలో రైతు ఉద్యమ బలోపేతమే లక్ష్యంగా రాబోయే కాలంలో అవిరళ కృషి సల్పాలని కోరారు. రైతుల సమస్యలపై కలిసొచ్చే సంఘాలతో ఐక్య ఉద్యమాలు నిర్మించాలని, ఇదే సమయంలో సంఘం స్వతంత్ర బలాన్ని మరింతగా పెంచుకోవాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. సారంపల్లి మల్లారెడ్డి నగర్ (నల్లగొండ)లో నాలుగు రోజులపాటు కొనసాగిన ఏఐకేఎస్ 36వ మహాసభ బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా ధావలే ప్రతినిధులనుద్దేశించి ప్రసంగిస్తూ...
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మనువాద, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా, ప్రత్యామ్నాయాల సాధన కోసం జరిగే ఉద్యమాల్లో రైతు-వ్యవసాయ కూలీ- కార్మిక ఐక్యత సాధించాలని మార్గదర్శనం చేశారు. ఉద్యమంలో మహిళలు, యువత భాగస్వామ్యాన్ని పెంచాలనీ, ఐక్య, స్వతంత్ర ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. రైతు సమస్యలపైనే కాకుండా ఆర్థిక, సామాజిక, రాజకీయ పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సమస్యలపై కేంద్రీకరించి పని చేయాలని సూచించారు.
ప్రతి రైతునూ
సమీకరించాలి: విజూ కృష్ణన్
‘ప్రతి గ్రామంలో ఏఐకేఎస్ జెండా ఎగరాలి... ప్రతి రైతూ సంఘంలో సభ్యునిగా చేర్చాలి..’ అనే నినాదాన్ని గత మహాసభలో తీసుకున్నామని, ఈ నాలుగేండ్లలో గుర్తించదగిన స్థాయిలో సంఘం అభివృద్ధి చెందిందని ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి విజూకృష్ణన్ తెలిపారు. అదే నినాదంతో రాబోయే కాలంలో మరింత పట్టుదలతో పని చేయాలని కోరారు.
బీజేపీ ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పోరాడాలన్నారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నెల 26న సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు దేశ వ్యాప్త ఆందోళనల్లో పాల్గొనాలని కోరారు. సీఐటీయూ పిలుపు మేరకు కార్మిక హక్కుల కోసం డిసెంబర్ 1 నుంచి 3 వరకు జరిగే ఢిల్లీ ముట్టడికి సంఘీభావంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్పొరేటీకరణ దుష్పరిణామాలపై వారం పాటు ప్రచారం నిర్వహించాలన్నారు. నిర్ధిష్టమైన తేదీలు త్వరలో నిర్ణయమవుతాయని తెలిపారు. కేంద్ర బడ్జెట్ సందర్భంగా రైతు సమస్యలపై సదస్సులు ఉంటాయని చెప్పారు.
క్రెడెన్షియల్ రిపోర్టు...
మొత్తంగా మహాసభలో పది తీర్మానాలు ఆమోదం పొందాయి. కార్యదర్శి నివేదికపై మూడు రోజుల్లో 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 64 మంది ప్రతినిధులు ఉత్సాహంగా చర్చల్లో పాల్గొన్నారు. చర్చలపై ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ సమాధానమిచ్చారు. అనంతరం కార్యదర్శి నివేదిక ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అర్హతల నివేదికను సుభోజిత్డే, ఆర్థిక నివేదికను పి కృష్ణ ప్రసాద్ ప్రవేశపెట్టగా మహాసభ ఆమోదించింది. గతం కంటే మహాసభ ప్రతినిధుల్లో మహిళా ప్రాతినిధ్యం పెరిగిందని అర్హతల నివేదికలో తెలిపారు. మహాసభకు హాజరైన ప్రతినిధుల్లో కేరళ నుంచి 82 ఏండ్ల ఎంఎం మాని అతి పెద్ద వయస్కులు కాగా పశ్చిమబెంగాల్‌కు చెందిన 26 ఏండ్ల సోరభ్ అతి పిన్న వయస్కులు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన రాకేష్ సింఘాల్ అత్యధికంగా ఐదేండ్ల ఎనిమిది నెలల జైలు జీవితం అనుభవించారు. మహాసభ ముగింపు కార్యక్రమానికి అశోక్ ధావలే అధ్యక్షత వహించి ప్రసంగించారు. గత మహాసభ నుంచి ఇప్పటి వరకు నాలుగేండ్లలో సంఘ సభ్యత్వం 21 లక్షలు పెరిగిందని తెలిపారు. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే రైతాంగ సమస్యలపై పని చేస్తున్న అతి పెద్ద సంఘం ఏఐకేఎస్ అని ప్రకటించారు.
అందరికీ ధన్యవాదాలు : జూలకంటి
ఆహ్వాన కమిటీ చైర్మెన్ జూలకంటి రంగారెడ్డి వందన సమర్పణతో మహాసభ ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చిన్న పట్టణమైనప్పటికీ తమ శక్తి మేరకు కృషి చేసి మహాసభలను విజయవంతం చేశామని చెప్పారు. మహాసభల జయప్రదానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రతువులో ఆహ్వానకమిటీ, వాలంటీర్ల కమిటీల కృషిని ఆయన కొనియాడారు. నల్లగొండ జిల్లాలో వామపక్ష ఉద్యమానికి ఈ మహాసభ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో దేశంలో బలమైన రైతాంగ ఉద్యమాలు రావాలని ఆకాంక్షించారు. మహాసభల విజయవంతానికి కృషి చేసిన వారిని వేదికపైకి పిలిచి పరిచయం చేశారు.






కామెంట్లు (0)