జనగణనలో ఓబీసీ కాలమ్ కోసం అసెంబ్లీలో తీర్మానించాలి :ఓబీసీ డిక్లరేషన్ సభలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో అన్ని రకాల రిజర్వేషన్లను తొలగించేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అందుకే జనగణనలో ఓబీసీ కాలమ్‌ను చేర్చేందుకు మోడీ సర్కార్ ఒప్పుకోవడం లేదని ఆమె దుయ్యబట్టారు. బుధవారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్, తెలంగాణ బీసీ రైట్స్ ఫోరమ్ సంయుక్తంగా నిర్వహించిన ‘హైదరాబాద్ ఓబీసీ డిక్లరేషన్’ సభలో ఆమె మాట్లాడారు. ఓబీసీ కాలమ్ పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానించిందని గుర్తు చేశారు. మన రాష్ట్రంలోనూ అదే తరహాలో తీర్మానం చేసేందుకు వీలుగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తనకున్న అధికారాలను ఉపయోగించి జనగణనను అడ్డుకోవాలని ఆమె కోరారు. ఓబీసీల లెక్క తేల్చకుండా రూ.12 వేల కోట్ల ఖర్చుతో జనగణన ఎవరి కోసమని ఆమె ప్రశ్నించారు. ఓబీసీ సంఘాలు ఢిల్లీలో నిర్వహించబోయే ధర్నాలో టీఆర్ఎస్ పాల్గొంటుందని ఆమె తెలిపారు. రిజర్వేషన్లే భవిష్యత్ తరాలకు ఇచ్చే ఆస్తి అనీ, వాటి కోసం అందరం ఐక్యంగా పోరాడుదామని ఆమె పిలుపునిచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే హామీ అమలు పట్ల సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. పదే పదే ఢిల్లీకి వెళ్లే రేవంత్ రెడ్డి ఆ బిల్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నప్పటికీ దాని గురించి మాట్లాడటం లేదని తెలిపారు. బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వానికీ చిత్తశుద్ధి లేదనీ, కేంద్ర బడ్జెట్ రూ.50 లక్షల కోట్లలో బీసీలకు రూ.2 వేల కోట్లు మాత్రమే కేటాయించిందని ఆక్షేపించారు. రాష్ట్రంలోనూ బీసీ జనాభా తేల్చకపోవడంతో ఉద్యగ నియామకాల్లో వారు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వంద మంది అవకాశాలను కేవలం 10 మంది మాత్రమే అనుభవిస్తున్న పరిస్థితులు పోవాలంటే పోరాటం ఒక్కటే మార్గమని ఆమె స్పష్టం చేశారు. బీపీ మండల్ మనవడు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరజ్ మండల్ మాట్లాడుతూ కవిత తుఫాన్ తాకిడికి ఢిల్లీ సర్కార్ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం, కీలక శాఖల్లో ఒక్క ఓబీసీ లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓబీసీల కోసం పోరాడుతున్న కల్వకుంట్ల కవిత భవిష్యత్ లో తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. సభలో దేశ వ్యాప్తంగా ఓబీసీల కోసం పోరాటం చేస్తున్న నాయకులు యెజ్జురప్ప, ధర్మేంద్ర కుశ్వాహ, ఉమేశ్ కొర్రం సకల, గీతిక, సునీల్ వర్మ, రైజా బీబీ, బన్సీ లాల్ నీలం కుమారి, విశ్వజిత్ రతోనియా తదితరులు పాల్గొన్నారు.
తీర్మానాలివే
దేశ వ్యాప్తంగా జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలి. ప్రతి కులానికి ప్రత్యేకంగా యూనిక్ కోడ్ ఉండాలి. ఓబీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో జనాభా దామాషా ప్రకారం వాటా ఇవ్వాలి. 1931 జనగణన ప్రకారం బీసీల జనాభా 52 శాతానికి అనుగుణంగా వారికి రిజర్వేషన్లు 50 శాతం ఉండాలి. 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ తీసేయాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి. విశ్వ విద్యాలయాల్లో సోషల్ జస్టిస్ ఉండాలి. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి. తెలంగాణలో 42 శాతం, మధ్యప్రదేశ్ లో 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి.... అని హైదరాబాద్ ఓబీసీ డిక్లరేషన్ సభ తీర్మానించింది.







కామెంట్లు (0)