ప్రధాన నిందితుడి, ప్రిన్సిపాల్, మరో ముగ్గురు కోర్టుకు తరలింపు
పాఠశాల ప్రిన్సిపాల్ ఝాన్సీపై సస్పెన్షన్
నవతెలంగాణ-అడ్డగూడూరు
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల స్కూల్‌లో విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా, అనుచితంగా ప్రవర్తించిన ఘటనలో పోలీసులు బుధవారం ఐదుగురిని అరెస్టు చేశారు. ఇందులో ప్రధాన నిందితుడు, ప్రిన్సిపాల్, మరో ముగ్గురు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తూర్పుగూడెం గ్రామానికి చెందిన శ్రీరాముల వెంకన్న సుమారు మూడు నెలలుగా అడ్డగూడూర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల స్కూల్‌లో వంట మనిషిగా పని చేస్తున్నాడు. కొన్ని రోజులుగా అతను విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులు ఆందోళన చేశారు. వారి ఫిర్యాదు మేరకు అడ్డగూడూరు పోలీసులు నిందితునిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన వెంకన్న హైదరాబాద్‌లోని మునగనూరులో తన అక్క ఇంట్లో ఉండగా అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాఠశాల ప్రిన్సిపాల్ ఝాన్సీని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రిన్సిపాల్ ఝాన్సీ, మెస్ అటెండర్ పూలమ్మ, మెస్ కాంట్రాక్టర్ మధు, సోమన్నను కూడా పోలీసులు అరెస్టు చేసి రామన్నపేట కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు విద్యార్థినులు బాధితులుగా ఉన్నట్టు గుర్తించారు.
పోలీసులకు క్యాష్ రివార్డులు
ఈ కేసు దర్యాప్తును అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో, డీఎస్పీ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
సీఐ రవి, వలిగొండ ఎస్ఐ శ్రీకాంత్ సహకారంతో అడ్డగూడూరు పోలీసులు ప్రధాన నిందితున్ని అరెస్టు చేయడంతోపాటు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. పోలీసుల పనితీరును అభినందించిన అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ సంబంధిత పోలీసులకు క్యాష్ రివార్డులు అందజేశారు. విద్యార్థినుల భద్రతకు సంబంధించిన ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.






కామెంట్‌లు (0)