Magazines

అచ్చంపేటను రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా

1 గంట క్రితం

Achampet
avatar
balaji

ప్రచురించబడింది నవం 27, 2026 | 2 నిమిషాల చదవడం

​నేను నల్లమల్ల బిడ్డను

కృష్ణా జలాలను జగన్‌‌కు రాసిచ్చింది కేసీఆరే

పదేండ్లు ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతోనే ఆంధ్రాకు నీళ్లు

త్వరలో 25 వేల ఉద్యోగాల భర్తీ : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

అచ్చంపేటలో ఇందిరమ్మ చీరల పంపిణీ, బహిరంగ సభ


నవతెలంగాణ-మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
‘‘నేను నల్లమల్ల బిడ్డను. నా రక్తాన్ని చెమటగా మార్చి పాలమూరును మరింత అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే అచ్చంపేటను ఆదర్శంగా తీర్చదిద్దడం నా బాధ్యత. ఈ జిల్లాను కృష్ణా జలాలతో తడపాల్సిన బాధ్యత నాపై ఉంది. అభివృద్ధి కోసం ఈ 34 నెలల్లో ఒక్క రోజూ సెలవు తీసుకోలేదు. అచ్చంపేట ఎమ్మెల్యే కోరిక మేరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి... మీ సమస్యలు తీరుస్తా’’ అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. 2034 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందనీ, అప్పటి వరకు తానే ముఖ్యమంత్రినని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గురువారం అచ్చంపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన - ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా కోటి మంది మహిళలకు ఆకుపచ్చ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదే విధంగా కొత్తగా మంజూరు చేసిన 6.12 లక్షల చేయూత పింఛన్లను కంప్యూటర్ మీట నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.


ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. 1948 నవంబరు 26న బాబా సాహెబ్ బీఆర్‌.అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని అందజేశారనీ, ఆ రాజ్యాంగ స్ఫూర్తితోనే అప్పటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం దేశంలో ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌ ‌రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టులను ప్రారంభించి పూర్తి చేశారని తెలిపారు. దీంతో కోట్లాది ఎకరాల భూములు తడిచి మారుమూల ప్రాంతాల్లో సైతం పంటలు పండుతున్నాయన్నారు. అదే విధంగా స్కూళ్ళు, కాలేజీలు, మెడికల్, ఇంజినీరింగ్, యూనివర్సిటీలు, ఐఐటీ, ఐఐఎం వంటి విద్యా సంస్థలు విస్తరించాయని తెలిపారు. కాంగ్రెస్‌ మూడేండ్ల పాలనలో 25.35 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామన్నారు. రైతుల కోసం ఈ మూడేండ్లలో రూ.1.78 లక్షల కోట్లు ఖర్చు చేశామని సీఎం గుర్తు చేశారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులను కేసీఆర్‌ ‌పదేండ్ల పాలనలో పడావు పెట్టారని తెలిపారు. దీంతో ప్రాజెక్టులు పూర్తి కాక నేడు కృష్ణా జలాలు ఏపీ‌కి పోతున్నాయన్నారు. అప్పట్లో బీఆర్‌‌ఎస్‌ ‌ప్రభుత్వ పెద్దలు ఢిల్లీలో సంతకాలు చేసి మరణశాసనం రాశారని, మిగులు జలాలు, వరద జలాల్లో కూడా అన్యాయం చేయడమే కాకుండా శాశ్వతంగా తాకట్టు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.


కేసీఆర్ కృష్ణా జలాలను జగన్‌‌కు రాసిచ్చాడని, రోజా ఇంటికెళ్లి రొయ్యల పులుసు తిని రాయలసీమ రతనాల సీమ కావాలని చెప్పింది ఆయన కాదా అని ప్రశ్నించారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తై ఉంటే నీళ్లను ఎత్తిపోసుకునే వాళ్లమని తెలిపారు. పాలమూరు బిడ్డగా ఈ జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత తనపై ఉందన్నారు. కేసీఆర్‌ ‌పంచిన చీరలను ఏ మహిళా కట్టుకోలేదనీ, చేలకు చుట్టేందుకు మాత్రమే అక్కరకొచ్చాయని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక 75 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, త్వరలోనే మరో 25 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీలు మల్లు రవి, బలరామ్ నాయక్, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కసిరెడ్డి, దామోదర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, డాక్టర్ రాంచంద్రనాయక్, తోట లక్ష్మీకాంతరావు, డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి, ఈర్లపల్లి శంకర్, బాలూనాయక్, కుందూరు జయవీర్, వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ మంత్రులు చిత్తరంజన్ దాస్, ఆయా కార్పొరేషన్ల చైర్మెన్లు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్