Magazines

మహిళలను లక్షాధికారులను చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా

11 నిమిషాల క్రితం

political
avatar
balaji

ప్రచురించబడింది నవం 23, 2026 | 2 నిమిషాల చదవడం

​500 రోజుల తర్వాత మళ్లీ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం ఖాయం

​4.71 లక్షల పింఛన్ల కోత.. 
ఇదేనా ప్రజాపాలన?

​కాంగ్రెస్‌ కమీషన్ల దందాను సొంత ఎమ్మెల్యేలే బయటపెడుతున్నారు : కేటీఆర్


​నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
ఎన్నికల హామీ ప్రకారం రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయడం అటుంచి, కనీసం లక్షాధికారులను చేసి చూపించినా తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఆదివారం హనుమకొండ జిల్లాలోని కేడీసీ మైదానంలో జరిగినసభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని, మరో 500 రోజుల తర్వాత (2028లో) కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో సంక్షేమ పథకాలు నిర్వీర్యమయ్యాయని కేటీఆర్ మండిపడ్డారు. ఉన్న 4.71 లక్షల పింఛన్లను తొలగించి, కొత్తగా 4.63 లక్షల పింఛన్లు మాత్రమే ఇస్తే పెంచినట్లా, తగ్గించినట్లా అని నిలదీశారు. వృద్ధులకు రూ.4 వేలు, మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. 36 నెలలుగా రూ.2,500 ఇవ్వకపోవడంతో ఒక్కో మహిళకు ప్రభుత్వం రూ.85,500 బాకీ పడిందని, ఇతర హామీలన్నీ కలిపితే ఆ బకాయి రూ.1.50 లక్షలకు చేరుతుందని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, విద్యార్థులకు ఆర్థిక సాయం వంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.

​​అవినీతిని బయటపెడుతున్న సొంత ఎమ్మెల్యేలే

రాష్ట్రంలో ప్రజాపాలన కాకుండా 20 శాతం కమీషన్ల పాలన సాగుతోందని కేటీఆర్ విమర్శించారు. ఐదు నుంచి పది లక్షల రూపాయల వరకు వసూళ్లు చేస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వెల్లడిస్తున్నారన్నారు. దేవాలయ భూములు, పారిశ్రామికవేత్తల బెదిరింపులపై మాజీ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలే ప్రభుత్వ అవినీతికి నిదర్శనమని ఆరోపించారు. ముఖ్యమంత్రి, మంత్రుల కుటుంబాలకు చెందిన ప్రయివేట్ విద్యాసంస్థలకు లబ్ది చేకూర్చేందుకే ఇంటర్మీడియట్ విద్యను రద్దు చేసి పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గోదావరి జలాలను ఒడిసిపట్టడంలో విఫలమయ్యారని, 750 టీఎంసీల నీళ్లు కిందకు పోతున్నా అడ్డుకోలేకపోతున్నారని విమర్శించారు.

​ఢిల్లీ పెద్దలకు గులాంగిరిపై ధ్వజం

రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢిల్లీ పెద్దలకు గులాంగిరి చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి గాంధీ కుటుంబానికి బాడీగార్డుగా మారారని, బీజేపీ నేతలు అమిత్ షా చెప్పులు మోస్తున్నారని ఎద్దేవా చేశారు. హామీలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా కేసీఆర్ పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నిరుద్యోగ యువత, మేధావులు, ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌ భాస్కర్‌, నన్నపునేని నరేందర్‌, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, సిరికొండ మధుసూదనచారి, బండ ప్రకాష్‌, పార్టీ జిల్లా నేతలు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్