Magazines

పీడీఎఫ్ అభ్యర్థి కొల్లి సత్యనారాయణకే ‌
సీపీఐ(ఎం) మద్దతు

12 నిమిషాల క్రితం

Satyanarayana
avatar
balaji

ప్రచురించబడింది నవం 23, 2026 | 3 నిమిషాల చదవడం

ప్రపంచవ్యాప్తంగా 
వామపక్ష భావజాలం

జెన్-జీ ఉద్యమాలకు 
కమ్యూనిస్టులే స్ఫూర్తి

కమ్యూనిస్టులు లేకపోతే 
దేశానికి భవిష్యత్ లేదు

​ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తి ఎర్రజెండానే

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తాం : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం పిలుపు

పీడీఎఫ్ అభ్యర్థి 
కొల్లి సత్యనారాయణ విజయాన్ని కాంక్షిస్తూ.. మూడు ఉమ్మడి జిల్లాల సన్నాహాక సమావేశం

సత్యనారాయణ విజయానికి సీపీఐ(ఎం) సర్వశక్తులూ ఒడ్డుతుంది : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

అన్ని వర్గాల ప్రజల గొంతుకగా గళమెత్తుతా : కొల్లి సత్యనారాయణ


నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుల వారసత్వం కొనసాగేలా నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి కొల్లి సత్యనారాయణను గెలిపించి శాసన మండలికి పంపిస్తే ప్రజల గొంతుకగా పనిచేస్తారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం పీడీఎఫ్ అభ్యర్థి, ప్రముఖ న్యాయవాది కొల్లి సత్యనారాయణ విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం ఖమ్మంలోని సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయం సుందరయ్య భవన్‌‌లో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల సన్నాహాక సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, ​సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. కొల్లి సత్యనారాయణకు సీపీఐ(ఎం) మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పీడీఎఫ్ అభ్యర్థులుగా గెలిచి ప్రజల కోసం పనిచేసిన చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్, లక్ష్మణ్ రావు, గేయానంద్, నర్సిరెడ్డి వంటి వారి వారసత్వాన్ని కొనసాగించేలా ప్రజాసంఘాల మద్దతు, ప్రగతిశీల శక్తుల అండతో ముందుకు వస్తున్న కొల్లి సత్యనారాయణ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యం ఉన్న కొల్లి సత్యనారాయణను గెలిపిస్తే అనేక ప్రజా ఉద్యమాలకు కేంద్రంగా ఉంటారన్నారు. విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకూ సీనియర్ న్యాయవాదిగా, బార్ కౌన్సిల్ సభ్యునిగా నిజాయితీగా సేవలందించిన చరిత్ర కొల్లి సత్యనారాయణకు ఉందన్నారు. ఏ ఉద్యమానికైనా ఎర్రజెండానే స్ఫూర్తి ​దేశంలో కమ్యూనిస్టులు లేరని కొందరు అంటున్నారని, కానీ కమ్యూనిస్టుల భవిష్యత్తు కంటే కమ్యూనిస్టులు లేకపోతే దేశానికే భవిష్యత్తు లేదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం లెఫ్ట్ భావజాలం ఆధిపత్యంలోకి వస్తోందని, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వివిధ దేశాల ప్రజలు వామపక్ష భావజాలంతో ఎన్నికల్లో విజయాలు సాధిస్తున్నారని తెలిపారు.


ఇందులో భాగంగా అమెరికా న్యూయార్క్ సిటీ మేయర్, శ్రీలంకలో కమ్యూనిస్టు అధ్యక్షుని గెలుపు, వెనిజులా వంటి దేశాల్లో వామపక్ష అభ్యర్థులు గెలుస్తున్న అంశాన్ని ప్రస్తావించారు. ​దేశంలో ఉద్యమాలు జెన్‌ జీ పేరుతో నడవొచ్చు కానీ, జెన్‌ జీ యువత లేవనెత్తిన ఎజెండా కమ్యూనిస్టుల ఎజెండా అని చెప్పారు. అనేక సంవత్సరాల నుంచి కమ్యూనిస్టులు ప్రజా సమస్యలపై ఏ నినాదాలు ఇచ్చారో, ఆ నినాదాలను ఇప్పుడు జెన్‌ జీ తరం స్ఫూర్తిగా తీసుకుని బీజేపీపై ఉద్యమం చేస్తోందని అన్నారు. దేశంలో ఏ ప్రజా ఉద్యమానికైనా ప్రధాన స్ఫూర్తి ఎర్రజెండానే అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఉద్యోగాల కల్పనలో 420 హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకపోవడం వల్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని అన్నారు. ఆ అసంతృప్తిని ప్రశ్నించగలిగే నాయకులు పీడీఎఫ్ అభ్యర్థి అని చెప్పారు.


ప్రజల గొంతుకగా ఉంటా : కొల్లి

తనను గెలిపించి శాసన మండలికి పంపిస్తే ప్రజల గొంతుకగా గళమెత్తుతానని ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థి కొల్లి సత్యనారాయణ స్పష్టంచేశారు. ప్రజల పక్షంగా ఉండి, ప్రజా క్షేత్రంలో ఉండి ప్రజాభ్యుదయానికి శ్రామిస్తానన్నారు. అన్ని వర్గాలు, విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగుల ఆత్మగా పని చేస్తానని తెలిపారు. అన్ని ప్రజా సంఘాలు, వామ పక్ష పార్టీల సూచనలు, సలహాలు, భాగస్వామ్యంతో త్వరలోనే మ్యానిఫెస్టోను తయారు చేసి, విడుదల చేస్తానని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ అబ్బాస్, మల్లు లక్ష్మి, బండారు రవికుమార్, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్‌, జనగామ, హనుమకొండ, ములుగు జిల్లాల కార్యదర్శులు మచ్చా వెంకటేశ్వర్లు, మల్లు నాగార్జున రెడ్డి, సాదుల శ్రీనివాస్, కనకారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సాంబశివ, సిద్దిపేట జిల్లా నాయకులు శశిధర్, ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు, బండి రమేష్, వై.విక్రమ్, మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి, జిల్లా నాయకులు యర్రా శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు.


కొల్లి సత్యనారాయణ విజయానికి సీపీఐ(ఎం) సర్వశక్తులూ ఒడ్డుతుంది : జాన్ వెస్లీ

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పీడీఎఫ్ అభ్యర్థి కొల్లి సత్యనారాయణను గెలిపించేందుకు సీపీఐ(ఎం) కృషి చేస్తుందని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ స్పష్టం చేశారు. తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం ఉన్న ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ఎర్రజెండా శక్తిని చాటేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు మద్దతు ఇవ్వకుండా ప్రజాసంఘాలు బలపర్చిన అభ్యర్థిగా ముందుకు వస్తున్న కొల్లి సత్యనారాయణ వెంట నిలబడతామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు సీపీఐ(ఎం)ని సంప్రదించినప్పటికీ పీడీఎఫ్ అభ్యర్థికే తమ మద్దతు అని తేల్చి చెప్పారు. ​హైదరాబాద్ స్థానానికి సంబంధించి బీజేపీని ఓడించగల రాజకీయ శక్తికి మద్దతు ఇచ్చే అంశంపై అప్పటి పరిస్థితులను బట్టి రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, నల్లగొండ కేంద్రంగా లక్షలాది మందితో జరిగిన ఏఐకేఎస్‌ ‌బహిరంగసభ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపిందని తెలిపారు. ​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్