అర్హుల్లో 21 శాతం మందికే పీఎంఎంవీవై ప్రయోజనాలు
80 శాతం మందికి అందని ఆర్థిక భరోసా
పశ్చిమ బెంగాల్లో మరీ దారుణం.. 100 మందిలో ముగ్గురికే సాయం
ఆన్లైన్ నిబంధనలు, ఆధార్ చిక్కులు, నిధుల కొరతే ప్రధాన అడ్డంకులు
న్యూఢిల్లీ: మహిళల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రసూతి ప్రయోజనాల పథకం ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. గర్భిణులు, బాలింతలకు ఆర్థిక భరోసా కల్పించాల్సిన ప్రధానమంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై) అర్హుల్లో దాదాపు 80 శాతం మందికి అందడం లేదు. కేవలం 21 శాతం మంది మహిళలకే ఆర్థిక సాయం అందుతున్నట్టు తాజా సర్వే వెల్లడించింది. ఆన్లైన్ దరఖాస్తు నిబంధనలు, ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాల్లో తేడాలు, నిధుల కొరత పథకం అమలుకు అడ్డంకులుగా మారాయి.
పశ్చిమ బెంగాల్లో మరీ దారుణం
రైట్ టు ఫుడ్ క్యాంపెయిన్ సంస్థ ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్య 12 రాష్ట్రాల్లో ఈ సర్వే నిర్వహించింది. మొత్తం 2,849 మంది మహిళలను పరిశీలించగా.. వారిలో 2,580 మంది పథకానికి అర్హులుగా తేలారు. వీరిలో 92 శాతం మంది అంగన్వాడీ కేంద్రాల్లో గర్భధారణ వివరాలు నమోదు చేసుకున్నారు. అయినప్పటికీ, 49 శాతం మందే పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. చివరకు 21 శాతం మందికే నగదు అందింది. పశ్చిమ బెంగాల్లో 100 మంది అర్హుల్లో ముగ్గురికే ప్రయోజనం చేకూరడం అక్కడి వాస్తవ పరిస్థితికి అద్ధం పడుతోంది.
డిజిటల్ నిబంధనలతో ఇబ్బందులు
పథకం ప్రయోజనం పొందాలంటే ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్, బ్యాంకు ఖాతా, అంగన్వాడీ ధ్రువీకరణ పత్రం, ప్రసవ ధ్రువీకరణ పత్రాలతోపాటు భర్త ఆధార్ వివరాలు కూడా సమర్పించాల్సి వస్తోంది. ఆధార్, బ్యాంకు ఖాతాల్లో పేర్ల అక్షరాల్లో తేడాలున్నా, బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం కాకపోయినా దరఖాస్తు ప్రక్రియ నిలిచిపోతోంది. మహిళల సొంత మొబైల్ నంబర్లు లేకపోవడం కూడా సమస్యగా మారింది. ఈ విషయాలను సర్వేలో పాల్గొన్న విద్యావేత్త దీపా సిన్హా వెల్లడించారు.
అవసరానికి సరిపోని నిధులు
2013లో పార్లమెంటు ఆమోదించిన జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం ప్రసూతి సమయంలో తల్లికి రూ.6 వేల సాయం అందించాలి. ఈ మేరకు పీఎంఎంవీవై పథకాన్ని ప్రవేశపెట్టారు. మొదటి కాన్పుకు రూ.5 వేలు, రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే రూ.6 వేలు ఇస్తారు. అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలు దీనికి అర్హులు. అయితే, పథకానికి ఏటా రూ.12 వేల కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా ఉండగా.. కేంద్రం సుమారు రూ.2,500 కోట్లే కేటాయి స్తోందని సర్వే పేర్కొంది. తక్కువ బడ్జెట్ కూడా ప్రయోజనాలు అందకపోవడానికి కారణమ వుతోందని దీపా సిన్హా అభిప్రాయపడ్డారు.
ప్రసవ ఖర్చులకు అప్పులే దిక్కు
ప్రసూతి సమయంలో మహిళలకు ఆర్థిక భారం తప్పడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేయించుకున్న వారిలో 81 శాతం మంది సుమారు రూ.3 వేల వరకు ఖర్చు చేశారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో ప్రసవానికి మధ్యస్థంగా రూ.25 వేల వరకు వ్యయమైంది. మొత్తం మహిళల్లో 23 శాతం మంది ప్రసవ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వచ్చింది. సర్వేలో పాల్గొన్న మహిళల్లో 98 శాతం మందికి ఆధార్, 92 శాతం మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నప్పటికీ.. ఇవి పథకం ప్రయోజనాలు పొందేందుకు దోహదపడటం లేదు. ప్రభుత్వం పథకం ప్రకటించడంతోనే బాధ్యత తీరిపోదని, అర్హులందరికీ సాయం అందేలా నిబంధనలను సరళీకరించి, బడ్జెట్ పెంచాల్సిన అవసరాన్ని ఈ సర్వే స్పష్టం చేస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు.





కామెంట్లు (0)