తక్షణమే కరువు సాయం, పంట నష్టపరిహారం ప్రకటించాలి
వరికి రూ.30 వేలు, వాణిజ్య పంటలకు రూ.50 వేలు చెల్లించాలి
కేంద్రం రూ.50 వేల కోట్ల నిధులు కేటాయించాలి
కరవు నిధులు తెచ్చేందుకు ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి
రేషన్ కార్డుపై 14 రకాల నిత్యావసరాలు అందించాలి :జాన్ వెస్లీ
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండి, ఇప్పటికే 360కి పైగా మండలాల్లో కరువు పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అంచనా వేసి ప్రకటించినప్పటికీ, కరువు వల్ల నష్టపోయిన రైతులను, ప్రజలను ఆదుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఖమ్మంలోని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యాలయం సుందరయ్య భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, పలు జిల్లాల కార్యదర్శులతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో దాదాపు 24 లక్షల ఎకరాలకు పైగా పంటలు నష్టపోయాయని చెబుతున్నా, వాస్తవంగా మరో ఐదారు లక్షల ఎకరాలు అదనంగా నష్టపోయినట్టు తెలిపారు. ఒక ఎకరంలో వాణిజ్య పంటలకు రూ.50 వేల వరకు, వరి లాంటి పంటలు వేస్తే రూ.30 వేలకు తక్కువ కాకుండా ఖర్చవుతుందని అన్నారు.
ఇంత పెద్ద ఎత్తున పంట నష్టం జరిగినా రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు. పక్కనున్న తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు రైతులకు నష్టపరిహారం అందిస్తుంటే, మన ప్రభుత్వం మాత్రం ఎలాంటి సాయం ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కరువు కారణంగా బోర్లన్నీ ఎండిపోయి తాగు, సాగునీటి సమస్యతో పాటు ఉపాధి సమస్య కూడా తీవ్రమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం సమీక్షలు, సమావేశాలు జరపడం తప్ప రైతులను ఆదుకునే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గానీ, మంత్రివర్గం గానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదని విమర్శించారు. తక్షణమే వరి పంటకు ఎకరాకు రూ.30 వేలు, ఇతర వాణిజ్య పంటలకు రూ.50 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కేంద్రం రూ.50 వేలు కోట్లు ఇవ్వాలి
కరువు నష్టాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కనీసం రూ.50 వేల కోట్లు డిమాండ్ చేయాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలని జాన్ వెస్లీ ముఖ్యమంత్రిని కోరారు. పంటలు లేకపోవడంతో దాని ప్రభావం ఉపాధి కూలీలపై తీవ్రంగా పడిందని, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను 90 శాతం నుంచి 60 శాతానికి కుదించడం వల్ల పని దినాలు, కూలీల ఆదాయం తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా పట్టణాల్లో ఉండే వారికి కూడా ఉపాధి హామీని అమలు చేయాలని, ఉపాధి కూలీకి రోజుకు రూ.800 వేతనం వచ్చేలా, సంవత్సరానికి 200 రోజుల పని కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మహబూబ్నగర్ జిల్లా తరహాలోనే మిగతా జిల్లాల్లోనూ కూలీలు మళ్లీ వలసల బాట పట్టే ప్రమాదం ఉందన్నారు.
సర్ పేరుతో ఓట్ల చోరీ
బీజేపీ నేతలు ‘డబుల్ ఇంజన్ సర్కార్’ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారని, కానీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ప్రజల వ్యతిరేకత ఎదుర్కొంటుందని వెస్లీ అన్నారు. దాంతో ‘సర్’ పేరుతో ఓట్ల దొంగిలింపు కార్యక్రమానికి తెరలేపిందని, దీనికి ఎన్నికల కమిషన్ కూడా వంతపాడుతోందని విమర్శించారు. బెంగాల్లో 24 లక్షల ఓట్లను తొలగించిన తరహాలోనే, తెలంగాణలోనూ దాదాపు 93 లక్షల ఓట్లను బ్లాక్ లిస్టులో పెట్టి బీజేపీకి వ్యతిరేకంగా ఉండే ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని తెలిపారు. ఓట్లను కాపాడుకోవడానికి ఈ నెల 26న దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు, సామాజిక సంస్థలు తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు సీపీఐ(ఎం) పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు.
‘చలో ఢిల్లీ’ కార్యక్రమానికి సీపీఐ(ఎం) మద్దతు
కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ యజమానులకు అనుకూలంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 1 నుండి 3 వరకు కార్మిక సంఘాలు తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమానికి సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని జాన్వెస్లీ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై శ్రామిక వర్గాలన్నీ సంఘటితమై బలమైన పోరాటాలకు సిద్ధం కావాలని, ప్రభుత్వాలు తక్షణమే స్పందించకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కరవుపై అసెంబ్లీలో చర్చించాలి : జూలకంటి రంగారెడ్డి
ప్రత్యేకంగా కరువు సమస్యపై శాసనసభ సమావేశం నిర్వహించి, తీర్మానం చేయాలని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మెజారిటీ మండలాల్లో కరువు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, రైతులు, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఎక్కడ కరువు ఉందో, ఎక్కడ రైతులు పంట నష్టపోయారో గ్రామ స్థాయి నుంచి పరిశీలించి నివేదికలు తయారు చేయాలని కోరారు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరువు బారిన పడిన ప్రజలను ఆదుకునే విషయంలోగానీ, కేంద్రం నుంచి అందించే సాయంపై గానీ ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపారు. కేవలం వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, సీట్లు వస్తాయని రాజకీయ ప్రసంగం మాత్రమే చేశారని అన్నారు.
అర్హులైన పేదలకు ఇండ్లు, పెన్షన్లు మంజూరు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్షత చూపుతున్నదని విమర్శించారు. ఇటీవల వచ్చిన రెండు తుఫానుల సందర్భంగా ఖమ్మం జిల్లాలో సుమారు 28 వేల ఎకరాల్లో వరి, పత్తి పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వం పరిహారం ఇస్తామని ప్రకటించినప్పటికీ ఆచరణలో చర్యలు వేగవంతం కావాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మీ, బండారు రవికుమార్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల పార్టీ కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, పి.వీరారెడ్డి, మల్లు నాగార్జునరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, జహంగీర్, ఖమ్మం డివిజన్ కార్యదర్శి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
మద్దతు ధర పెంచి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
వరి కొనుగోలు మద్దతు ధర విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోందని, దిగుబడి తక్కువగా ఉన్నందున ప్రయివేట్ వ్యాపారులు ధాన్యాన్ని అడ్డగోలుగా కొనుగోలు చేసి, ఆ తర్వాత బియ్యం ధరలు పెంచి పేదలను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని జాన్వెస్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగానే నడుస్తున్నాయని, తక్షణమే ప్రభుత్వమే మద్దతు ధర పెంచి పూర్తిస్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. కేజీ బియ్యం రూ.100కు చేరుకున్నా ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చోవడం సరికాదని, ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. అలాగే, సంక్షేమ పథకాల కోసం 16 లక్షలకు పైగా నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకున్నా ఒక్క పైసా కేటాయించలేదని, తక్షణమే ఉద్యోగాల భర్తీతో పాటు ఉపాధి కల్పనకు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల హామీ కూడా అమలు కావడం లేదని, సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో 100 కేంద్రాల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు కనీసం ఇండ్ల స్థలాలకు పట్టాలైనా ఇవ్వకుండా, హైదరాబాద్ చుట్టూ ఉన్న వేల ఎకరాల ప్రభుత్వ భూములను అభివృద్ధి పేరుతో అమ్ముకుని రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కోటీ 16 లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా, కార్డుపై మనిషికి 6 కేజీల బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదని అన్నారు. బయట నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో, బియ్యాన్ని 10 కేజీలకు పెంచడంతో పాటు పప్పు, మంచినూనె సహా 14 రకాల సరుకులను రేషన్ కార్డుపై అందించాలని, తద్వారా దేశంలో ఉన్న 40 శాతం మంది మహిళల రక్తహీనత, పిల్లల పోషకాహార లోపాన్ని నివారించవచ్చని సూచించారు.





కామెంట్లు (0)