ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
ఆటోను ఢీకొన్న లారీ
నవతెలంగాణ - వికారాబాద్ రూరల్
వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదివారం ఉదయం ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలతో పాటు ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో పెండ్లిమడుగు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ మండలం పెండ్లిమడుగు గ్రామానికి ఒక కుటుంబం కాళ్ల నొప్పుల మందు కోసం కేరెళ్లికి ఆటోలో ఉదయం బయలుదేరారు. అదే సమయంలో తాండూర్ నుంచి వికారాబాద్ వైపు లారీ వస్తోంది. ఈ క్రమంలో వికారాబాద్ పట్టణంలోని బుగ్గ రామేశ్వరం సమీపంలోని మలుపు వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్ నాగేష్(30)తో పాటు చంద్రమ్మ (62), పార్వతమ్మ(50), సరిత(33) మృతి చెందారు.
మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదం తీవ్రతకు ఆటో నుజ్జునుజ్జయింది. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కచ్ఛితమైన కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ స్నేహ మొహ్ర పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.. రోడ్డు ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ చేపడుతామన్నారు.
గ్రామంలో విషాదఛాయలు
రోడ్డు ప్రమాద సమాచారం తెలియగానే పెండ్లిమడుగు, గ్రామా ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనాస్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. అప్పటివరకు తమ మధ్య తిరిగిన కుటుంబ సభ్యులు ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేక గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.





కామెంట్‌లు (0)