Magazines

విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ పెంపు

1 గంట క్రితం

DA
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 2 నిమిషాల చదవడం

19.272 నుంచి 21.815 శాతానికి పెంపు

జులై ఒకటి నుంచి వర్తింపు..

71,360 మందికి ప్రయోజనం

సర్కార్‌‌పై ప్రతి నెలా రూ.14.63 కోట్ల అదనపు భారం : 
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వారికి చెల్లించే కరువు భత్యం (డీఏ), కరువు ఉపశమనం (డీఆర్) పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ సంస్థల సీఎమ్‌డీలను ఆదేశించారు. ప్రస్తుతం 19.272 శాతంగా ఉన్న డీఏ, డీఆర్‌ను 2.543 శాతం పాయింట్లు పెంచి 21.815 శాతానికి సవరించనున్నారు. ఈ పెంపు 2026 జులై ఒకటి నుంచి వర్తించనుంది. కార్మిక శాఖ పరిధిలోని లేబర్ బ్యూరో ప్రకటించే అఖిల భారత ధరల సూచీ ఆధారంగా డీఏ, డీఆర్‌ను సవరిస్తారు. ధరల సూచీలో వచ్చే మార్పులకు అనుగుణంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి జనవరి, జూలై నెలల్లో ఈ సవరణ చేపడుతున్నారు.

తాజాగా చేపట్టిన ప్రతిపాదిత పెంపునకు ఆమోదం లభించి అమల్లోకి వస్తే రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ సంస్థల పరిధిలో 71,360 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఇందుకోసం విద్యుత్ సంస్థలపై నెలకు సుమారు రూ.14.63 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది. సంస్థల వారీగా లబ్ధిదారులు ఇలా.. టీజీ ట్రాన్స్‌కో పరిధిలో 3,081 మంది ఉద్యోగులు, 3,644 మంది ఆర్టిజన్లు, 2,469 మంది పెన్షనర్లు కలిపి మొత్తం 9,194 మందికి ప్రయోజనం కలగనుంది. టీజీ జెన్కోలో 7,197 మంది ఉద్యోగులు, 3,544 మంది ఆర్టిజన్లు, 3,426 మంది పెన్షనర్లు కలిపి 14,167 మంది లబ్ధి పొందనున్నారు. టీజీ ఎస్పీడీసీఎల్‌లో 11,719 మంది ఉద్యోగులు, 8,493 మంది ఆర్టిజన్లు, 8,269 మంది పెన్షనర్లు కలిపి 28,481 మందికి, టీజీ ఎన్పీడీసీఎల్‌లో 9,936 మంది ఉద్యోగులు, 3,435 మంది ఆర్టిజన్లు, 6,147 మంది పెన్షనర్లు కలిపి 19,518 మందికి ప్రయోజనం చేకూరనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్