Magazines

ప్రమాదంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ

1 గంట క్రితం

Indian democracy in danger
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 2 నిమిషాల చదవడం


సర్‌కు వ్యతిరేకంగా విద్యార్థి, యువకులు ఉద్యమించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్

మిర్యాలగూడలో ‘స‌ర్‌’పై సదస్సు

నవతెలంగాణ- మిర్యాలగూడ టౌన్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను హైజాక్‌ చేసిందని, భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అత్యంత ప్రమాదంలో ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రంగారెడ్డి, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని శ్రీజ ఫంక్షన్ హాల్‌లో సోమవారం ‘స‌ర్‌’పై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలమైన విధానాలను అవలంబిస్తూ ఎన్నికల ప్రక్రియను కూడా హైజాక్ చేసిందని ఆరోపించారు. ఓటర్ల జాబితాను తారుమారు చేసి చట్టానికి అతీతంగా.. అన్ని నిబంధనలనూ గాలికి వదిలేసి మోడీ, అమిత్ షాకు మాత్రమే సేవ చేసే సంస్థగా ఎలక్షన్ కమిషన్‌ను మార్చిందన్నారు. ఇటీవల జంతర్ మంతర్ వద్ద, ఇతర చోట్ల ఆందోళన చేసిన విద్యార్థులు, యువజనులపై కేసులు పెట్టి జైల్లో పెట్టిందని విమర్శించారు. ప్రశ్నిస్తున్న ప్రజలను నిర్బంధం ద్వారా అణచివేయాలని బీజేపీ చేసే కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్ చట్టవిరుద్ధ వ్యవహారాలపై ఓటు నమోదుకు ఉపయోగించే ఫాం-6 విషయంలో చట్ట విరుద్ధంగా.. ఏకపక్షంగా మిగిలిన ఇద్దరు కమిషనర్లకు సమాచారం ఇవ్వకుండా మార్పులు చేశారని తెలిపారు. ఓటుకు అర్హత ఉండాలంటే పూర్వీకుల సమాచారం తప్పనిసరిగా ఉండాలని మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ‌ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఏకపక్ష నిర్ణయాల ఫై పది నెలల్లో 14సార్లు ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ జ్ఞానేష్ కుమార్ ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో ప్రజలకు వివరించాలన్నారు. ఫామ్ 7లో అక్రమాలు ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయన్నారు. ఫామ్‌-7 అక్రమంగా ఉపయోగించి ఒక్క ఫామ్.. ఏడు అప్లికేషన్లతో వందమంది మైనార్టీ ఓట్లను తొలగించారన్నారు. దీనిపై ఎలక్షన్ కమిషన్ ఎలాంటి సమాధానమూ ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఇలాంటి విధానాల వల్ల దేశంలో ఓటు హక్కు కలిగిన ప్రజలు, ఓటు హక్కు లేని ప్రజలుగా రెండు విధాలుగా విడిపోతారని, ఇది ప్రమాదకరమైన సూచికని తెలిపారు. ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్ రామయ్య అధ్యక్షత నిర్వహించిన ఈ సదస్సులో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, సీపీఐ నాయకులు బంటు వెంకటేశ్వర్లు, ప్రజా ఆలోచన వేదిక నాయకులు నాగయ్య, పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ రామారావు, డాక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్