100 ఎకరాల్లో దెబ్బతిన్న పంట.. తీరని నష్టం ..చేతులెత్తేసిన డీలర్లు
పెట్టుబడులు సైతం దక్కే పరిస్థితి లేక అన్నదాతల లబోదిబో
ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తాం : వ్యవసాయాధికారి
నవతెలంగాణ-కొత్తగూడ
ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు స్వల్పకాలిక రకాలపై ఆధారపడిన అన్నదాతలకు నకిలీ విత్తనాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లోని ఎంచగూడ గ్రామ రైతులను ‘మంగళం సీడ్స్ కంపెనీ సిద్ది 44 వంగడం వరి విత్తనాలు నిండా ముంచాయి. సుమారు 70 మంది రైతులకు చెందిన 100 ఎకరాలకు పైగా వరి చేలు దెబ్బతిని, పెట్టుబడులు సైతం దక్కే పరిస్థితి లేక రైతులు లబోదిబోమంటున్నారు. సాధారణంగా 130 నుంచి 140 రోజుల్లో పంట చేతికి రావాల్సి ఉండగా, నాట్లు వేసి 100 రోజులు దాటినా పంట ఇంకా పొట్ట దశలోనే ఉంది. 160 రోజులు దాటినా కోతకు వచ్చే సూచనలు కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల అరకొరగా కంకులు బయటకు వచ్చినా అవి చాలా చిన్నవిగా ఉన్నాయని, ఎకరాకు 20 బస్తాల దిగుబడి రావడం కూడా కష్టమేనని వాపోతున్నారు. మార్కెట్‌లో క్వింటాలుకు రూ.3,000 నుంచి రూ.3,200 వరకు ధర పలికే మేలైన రకమని చెప్పి డీలర్లు తమకు అంటగట్టారని రైతులు మండిపడుతున్నారు. గత 15 రోజులుగా ఈ సమస్యపై స్థానిక విత్తన డీలర్లతో చర్చలు జరుపుతున్నప్పటికీ వారు చేతులెత్తేసినట్టు సమాచారం.. వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశీలన పేరుతో కంపెనీ యాజమాన్యం కాలయాపన చేస్తుంది తప్ప నష్టపరిహారంపై స్పష్టత ఇవ్వడం లేదు. శాస్త్రవేత్తలు పరిశీలించినా తమ అనుమానాలు నివృత్తి కాలేదని, విత్తన నాణ్యతపై సమగ్ర విచారణ జరపాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. పరిష్కారం చూపకపోవడంతో విసుగు చెందిన రైతులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మంగళం సీడ్స్ యాజమాన్యం వెంటనే గ్రామానికి వచ్చి రైతులతో ముఖాముఖి మాట్లాడి, జరిగిన నష్టానికి పూర్తి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన బాట పడతామని రైతులు హెచ్చరించారు. ఇదే విషయమై వ్యవసాయ అధికారి జక్కుల ఉదయ్ కుమార్ వివరణ కోరగా... రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు క్షేత్ర పరిశీలన చేసి వరి వంగడాలను శాస్త్రవేత్తలకు పంపించామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని తెలిపారు.






కామెంట్‌లు (0)