Magazines

అవిశ్రాంత పనులు.. ఐనా దక్కని పదోన్నతులు

15 నిమిషాల క్రితం

promotions
avatar
balaji

ప్రచురించబడింది నవం 11, 2026 | 3 నిమిషాల చదవడం

ఒకే ఉద్యోగికి తలకుమించిన బాధ్యతలు

పంచాయతీ కార్యదర్శుల గోడు పట్టని పాలకులు

జీపీలకు గ్రేడింగ్‌ వ్యవస్థ అమలుపైనే ఆశలు

కొలిపాక నాందేవ్‌
శ్రమకు తగ్గ వేతనం, పనికి తగిన గుర్తింపు ఏ ఉద్యోగైనా కోరుకుంటాడు. అది తన హక్కుగా కూడా భావిస్తాడు. ఈ హక్కుల అమలుకు అనేక చట్టాలున్న ప్రయివేటు కొలువుల్లో ఇది అంత సులువు కాదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యజమానులు, కంపెనీల ప్రయోజనాలే మిన్నగా భావిస్తున్న పాలకులున్న చోట దీన్ని ఎలాగూ ఆశించలేము. కానీ ప్రభుత్వరంగ శాఖల్లోనూ ఇది దక్కకపోతే ఏమనాలి. రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ శాఖల్లో వివిధ స్థాయిలో ఉద్యోగులు ఈ సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ కోవకే చెందిన వారిలో మొదటి బాధితులు పంచాయతీ కార్యదర్శులే అని చెప్పక తప్పదు. తలకు మించిన బాధ్యతలు మోస్తున్న వీరి వెతలపై ‘నవతెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.. పంచాయతీ కార్యదర్శి.. ఇతనొక ఒక గ్రామస్థాయి పరిపాలన అధికారి. గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర వీరిదే. ఊరి పరిశుభ్రత, తాగునీటి వసతి, వీధి దీపాల కల్పన, గ్రామసభలు, జనరల్‌బాడీల తీర్మానాలు, నిర్ణయాల రికార్డుల నిర్వహణ వీరి విధుల్లో ప్రధానమైనవి. ఆదాయ, వ్యయాల నిర్వహణ, ఆడిట్‌ రిపోర్టులు, వాటికి వివరణలు వంటివి వీరి జాబ్‌చార్టులో భాగంగానే ఉన్నాయి.

కానీ వీటిని మించి లెక్కలేనన్ని పనులు ప్రభుత్వం వీరి నెత్తిన మోపుతోంది. ప్రభుత్వం చేపడుతున్న ఏ సంక్షేమ పథకమైన వీరి జోక్యం లేకుండా అమలయ్యే పరిస్థితే లేదన్న అతిశయోక్తి లేదు. ఇందిరమ్మ ఇండ్ల ఫొటో క్యాప్చర్‌, బీఎల్‌ఓ డ్యూటీలు, సర్‌ డ్యూటీలు, పింఛన్ల వెరిఫికేషన్‌ వంటి పనులూ సెక్రెట్రీలు చేస్తున్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లు, వీడయో కాన్ఫరెన్స్‌లు, వీటికి సంబంధించి సమగ్ర రిపోర్టులు, వాటి ఫాలో అప్‌లు వీరు చేయాల్సిందే. జిల్లాస్థాయి సమావేశాలు, సమీక్ష, పురోగతి వంటి అంశాలపై అవసరమైన సమాచారాలు అనేక సందర్భాల్లో పై అధికారులకు ఇవ్వాల్సిందే. ఇంటి పన్నుల మధింపు, వసూళ్లు వీరే చేయాలి. ఉపాధిహామీ చట్టం పనుల పర్యవేక్షణ బాధ్యతల్లోనూ పాలు పంచుకుంటున్నారు. సోషల్‌ ఆడట్‌ నిర్వహణకు సంబంధించిన డేటాఎంట్రీ, పరిశీలన వంటి పనులూ చేస్తున్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లు లేనిచోట ఆ పనుల భారం సైతం వీరిపైనే పడుతోంది. ఈ క్రమంలోనే సోషల్‌ ఆడిట్‌ తప్పులకూ బలవుతున్న పరిస్థితి నెలకొంది.

సామాజిక ఆర్థిక సర్వేలోనూ భాగస్వా ములవుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే క్షేత్రస్థాయిలో చేపడుతున్న ఏ ప్రభుత్వ పనైనా వీరు ముట్టుకోకపోతే ముందుకే సాగని పరిస్థితి.. వీటన్నింటి అమలు కోసం ఏడు రకాల యాప్‌లు నిర్వహిస్తున్నామని గ్రామీణ ప్రాంత సమస్యలపై సర్వే కోసం పల్లెల్లో పర్యటిస్తున్న ‘నవతెలంగాణ’ ప్రతినిధులతో పలువురు కార్యదర్శులు తమ గోడును వెల్లబోసుకున్నారు. రోజువారీ విధుల్లో భాగంగానే 52 రకాల రికార్డుల నిర్వహణతో పాటు రెండు రకాల ఆడిట్‌లను ఎదర్కోవాల్సి ఉంటుంది. ఎంపీఓ, ఎంపీడీఓ, డీఎల్‌పీఓ, డీపీఓ, జెడ్‌పీ సీఈఓ, డీఆర్‌డీఓ, ఆఖరుకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వంటి ఉన్నతాధికారులకు జవాబుదారీగా పని చేయాలి. ఎన్నికల సమయంలో ఎంఆర్‌ఓలు, ఆర్‌డీఓలకు సైతం చెప్పింది వినాల్సిందే. వీటన్నింటినీ నెరవేర్చడం కోసం సెలవులు, విశ్రాంతిని సైతం కోల్పోతున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ సెక్రెటరీ వాపోయాడు.

కుటుంబ సభ్యులకు తగిన సమయం ఇవ్వలేక, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక అనేక అనారోగ్యాల బారిన పడుతున్నట్టు మరొకరు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో డీఎస్‌ఆర్‌(డెయిలీ శానిటరీ రిపోర్టు) కోసం ఉదయం 8 గంటలకే ఉరుకులు, పరుగులతో వచ్చే వారమని, ఈ క్రమంలో అనేక మంది రోడ్డు ప్రమాదాల బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత చేసినా తమకు బాధ లేదని, కానీ పనికి తగిన వేతనం, సీనియారిటీకి తగిన గుర్తింపు, పదోన్నతి దక్కడం లేదని వాపోయారు. ప్రభుత్వ ఉద్యోగులే..ఐనా అత్తెసరు వేతనాలే.. బండెడు చాకిరీ చేస్తున్నా పనికి తగ్గ వేతనం లభించడం లేదు. ప్రభుత్వ పరిధిలోని రెగ్యులర్‌ ఉద్యోగులే అయినప్పటికీ తక్కువ స్కల్‌ ఉన్న పోస్టు ఇదే. కొన్ని శాఖల్లో ఇంటర్‌ విద్యార్హతతో నియమించిన పోస్టులకు సైతం తమకన్నా ఎక్కువ స్కలు ఉందని, డిగ్రీ క్వాలిఫికేషన్‌తో నియమిం చబడిన తమకు కనీసం సీనియర్‌ అసిస్టెంట్‌ స్కల్‌ అయిన ఉండాలని కోరుకుం టున్నారు.

గ్రేడ్‌-2 వారికి సూపరింటెండెంట్‌ స్కల్‌, గ్రేడ్‌-1 వారికి ఎంపీఓ స్కల్‌ ఉండాలనేది తమ డిమాండ్‌గా చెబుతున్నరు. పదేండ్ల కింద నియమించబడిన, గ్రేడ్‌-3 పోస్టుల్లో ఉన్న వారు సైతం అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్న దుస్థితి వీరిది. 2014లో ఉద్యోగంలో చేరిన పదోన్నతి రానివారు రాష్ట్రవ్యాప్తంగా వందలాది మందే ఉన్నారంటే నమ్మాల్సిందే. గతంలో మాదిరిగా జీపీలకు గ్రేడ్‌లను పునరుద్ధరించి, కేడర్‌ స్ట్రెంత్‌ అమలు చేస్తేనే న్యాయం జరుగుతుందని చెబుతున్నారు. జీపీలకు గ్రేడింగ్‌ అమలుపైనే ఆశలు పంచాయతీ కార్యదర్శుల పదోన్నతుల విషయంలో జీపీలకు గ్రేడింగ్‌ ప్రక్రియ అత్యంత కీలకంగా మారింది. గతంలో రద్దు చేసిన దీనిని పునరుద్ధరిస్తేనే పైసమస్యలకు పరిష్కారం దొరుకు తుంది. దీనికోసం ప్రభుత్వం ముందు రెండు రకాల ప్రతిపాదనలున్నాయి. ఒకటి శాతం ప్రాతి పదిక, రెండోది వార్షిక ఆదాయం ప్రాతిపదికన.

రెండో రకం ప్రతిపాదనలో పంచాయతీల ఆదాయంపై స్పష్టమైన లెక్కలు అందుబాటులో ఉంటాయి. కావున కొత్త మార్గద ర్శకాలు అవసరం లేదు. కానీ శాతం ప్రాతిపదికన గ్రేడ్‌లు ఇచ్చే పరిస్థితి అయితే మాత్రం దానికి నూతన మార్గదర్శకాలతో ప్రత్యేక జీఓ జారీ చేయాల్సి ఉంటుంది. ఈ పేరుతో కాలయాపన చేస్త ప్రమోషన్ల ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే ప్రమాదముం టుంది. పదోన్నతుల అంశం కొలిక్క వస్తే వేతనాల్లో వ్యత్యాసాల సమస్యా తీరుతుంది. రాష్ట్రం యునిట్‌ గా కాకుండా జోన్‌లను యూనిట్‌గా తీసుకొని ఈ గ్రేడింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేస్తే అన్ని జిల్లాలకూ సమన్యయం జరుగుతుందని ఉద్యోగులు చెబుతు న్నారు. ప్రభుత్వ పరిశీలనలో కూడా ఉన్న ఈ అంశంపై ఇంకే మాత్రం తత్సారం చేయకుండా వెంటనే ముందడుగు వేసి తమ వెతలు తీర్చాలని కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్