ఆర్ఎస్ఎస్, బీజేపీ ఎజెండాను అమలు చేస్తున్న జ్ఞానేశ్‌కుమార్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొల్లి సత్యనారాయణకు కేవీపీఎస్ సంపూర్ణ మద్దతు
అంబేద్కర్ అభయహస్తం అమలుకు ఐక్య ఉద్యమాలు : ఆవాజ్, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శులు ఎండీ అబ్బాస్, టి స్కైలాబ్ బాబు
నవతెలంగాణ-బయ్యారం
దేశంలో 13 కోట్ల మంది ఓటర్లను తొలగిస్తూ సర్ పేరుతో ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడుస్తున్న జ్ఞానేశ్ కుమార్, బీజేపీ విధానాలపై ఐక్యంగా ఉద్యమాలు నిర్మించాలని ఆవాజ్, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శులు ఎండీ అబ్బాస్, టీ. స్కైలాబ్ బాబులు పిలుపునిచ్చారు. బుధవారం బయ్యారం సీఐటీయూ కార్యాలయంలో కేవీపీఎస్ మహబూబాబాద్ జిల్లా స్థాయి విస్తృత సమావేశం సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నిడిగొండ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎండీ అబ్బాస్, టీ. స్కైలాబ్ బాబులు హాజరై మాట్లాడారు. రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి పూనుకున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రస్తుతం ఓట్లను రద్దు చేయడం ద్వారా తమ వ్యతిరేక ఓట్లను లేకుండా చేయాలనే దురుద్దేశంతోనే దళితులు, గిరిజనులు, మైనారిటీల ఓట్లను తొలగిస్తుందని చెప్పారు. సర్ పేరిట ఎన్నికల కమిషన్ బీజేపీ జేబు సంస్థగా మారిందని, జ్ఞానేశ్‌కుమార్ ఆర్ఎస్ఎస్, బీజేపీ ఎజెండాను అమలు చేస్తున్నాడని విమర్శించారు. ఎన్నికల కమిషన్ స్వతంత్ర పని విధానాన్ని తుంగలో తొక్కుతున్నాడని అన్నారు. జ్ఞానేశ్ కుమార్ ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రముఖ న్యాయవాది కొల్లి సత్యనారాయణకు కేవీపీఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరిగే ఆలిండియా కిసాన్ సభ జాతీయ మహాసభలకు సామాజిక శక్తులు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కేవిపీఎస్ జిల్లా కార్యదర్శి దుడ్డేల రామ్మూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు జిన్న లచ్చయ్య, చింత ఎల్లయ్య, జిల్లా సహాయ కార్యదర్శులు మందుల యాకూబ్, ప్రశాంత్, జిల్లా కమిటీ సభ్యులు పెంటిక వెంకట్రాములు, నాగెల్లి సురేష్, కురంది సురేష్, మచ్చ వెంకన్న, ఎస్కే. ఖాదర్ బాబా, మాదాసు రాము తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)