Magazines

మురసు ఎఫెక్ట్‌

17 నిమిషాల క్రితం

Cyclone Mora
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 2 నిమిషాల చదవడం

ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు

నీట మునిగిన వరి, పత్తి, మిర్చి, ఉద్యాన పంటలు

వేలాది ఎకరాల్లో రైతులకు తీవ్ర నష్టం

జలదిగ్బంధంలో సత్తుపల్లి, అశ్వారావుపేట

నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

​ మురసు తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ​సత్తుపల్లి నియోజక వర్గంలో 200 మి.మీ., అశ్వారావుపేటలో 196 మి.మీ. అత్యధిక వర్షపాతం నమోదై అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ​చేతికి వచ్చిన వరి, పత్తి, ఉద్యాన పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందు తున్నారు. ​ఎల్‌‌నినో దెబ్బతో ఇప్పటికే నష్టపోయిన అన్నదాతలకు, మురసు తుఫాన్‌ ‌వల్ల కురిసిన వానలు వారిని ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీశాయి. ​ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేయాలని, ఆపన్న హస్తం అందించి తక్షణ పరిహారం చెల్లించాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది.

మొన్నటి వరకు అర్నాబ్ తుఫాన్ ప్రభావం చూపగా, తాజాగా మురసు తుఫాన్ కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరి, పత్తి, మిర్చి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సత్తుపల్లి నియోజకవర్గంలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేయగా, అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో పలుచోట్ల రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి.

తుఫానులతో కోలుకోలేని దెబ్బ

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వరుస తుఫానులతో వేలాది ఎకరాల్లో పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే ఎల్‌నినో ప్రభావంతో దిగుబడులు తగ్గగా, తుఫానులతో భారీ వర్షాలకు పత్తి కాయలు నల్లబారి చెట్లపైనే కుళ్లిపోతున్నాయి. కూలీ ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతకు సిద్ధమైన 30 నుంచి 40 శాతానికి పైగా వరి పంటలు నీట మునిగి నేలకొరిగాయి. నేలకొండపల్లి, కూసుమంచి, ఖమ్మం గ్రామీణ, కొణిజర్ల, వైరా, తల్లాడ, పెనుబల్లి, సత్తుపల్లి, కల్లూరు, టేకులపల్లి, ఇల్లందు, మణుగూరు, అశ్వారావుపేట తదితర మండలాల్లో భారీ నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు. భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాల్లో పంట నష్టంపై సంబంధిత అధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందించారు. ఇప్పటివరకు సుమారు 1600 ఎకరాల్లో మినుము పంట, 1500 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా అంచనా వేశారు.

అశ్వారావుపేట అతలాకుతలం

అశ్వారావుపేటలో భారీ వర్షం కురిసింది. బుధవారం ఉదయం 10 గంటల వరకు 196 మి.మీ. వర్షపాతం నమోదైంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రధాన రహదారులు, కాలనీలు నీట మునిగాయి. కిన్నెరసాని, తాలిపేరు, కట్టలేరు, బేతుపల్లి ప్రాజెక్టుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది.

ఆపన్న హస్తం కోసం రైతుల ఎదురుచూపులు

​ఎల్‌‌నినో ప్రభావంతో ఇప్పటికే నష్టపోయిన రైతులు, ప్రస్తుత తుఫాన్ల వల్ల పూర్తిగా అప్పులపాలై నిండా మునిగిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో వరి, పత్తి పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి వ్యవసాయ శాఖ యంత్రాంగాన్ని వెంటనే అప్రమత్తం చేసి తక్షణమే సర్వే చేపట్టాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్