నవతెలంగాణ- హైదరాబాద్
విదేశీ న్యాయస్థానాల్లో కొనసాగుతున్న కేసుల విచారణను నిలిపివేయాలని ఆదేశించే యాంటీ సూట్ ఇంజంక్షన్ ఉత్తర్వులను అత్యంత అరుదైన సందర్భాల్లోనే జారీ చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలని పేర్కొంది. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు నిరూపణ కాకుండా సివిల్ నిర్బంధం విధించడం సాధ్యం కాదని స్పష్టం చేస్తూ భర్తను నిర్బంధించాలన్న కుటుంబ న్యాయస్థానం ఉత్తర్వులను రద్దు చేసింది. యాంటీ సూట్ ఇంజంక్షన్ పిటిషన్పై మార్గదర్శకాల ప్రకారం తిరిగి విచారణ జరపాలని ఆదేశించింది. వైవాహిక విభేదాలు పిల్లల పెంపకం బాధ్యత నుంచి తల్లిదండ్రులకు విముక్తి కల్పించవని హైకోర్టు పేర్కొంది. భార్యాభర్తల మధ్య ఎన్ని విభేదాలున్నా పిల్లలకు ప్రేమ, రక్షణ, మానసిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ఇద్దరిపైనా ఉంటుందని తెలిపింది. ముఖ్యంగా ఆటిజంతో బాధపడుతున్న పిల్లలకు వైద్య చికిత్సతోపాటు సుపరిచిత వాతావరణం, స్థిరమైన దినచర్య, తల్లిదండ్రుల ఆప్యాయత అవసరమని పేర్కొంది. కుటుంబ వివాదాల్లో కోర్టులు, న్యాయవాదులు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని, పిల్లల సంక్షేమానికి ప్రాధాన్యమివ్వాలని సూచించింది.





కామెంట్లు (0)