ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాలి : జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశవ్యాప్తంగా “సర్” పేరుతో అక్రమంగా 13 కోట్ల ఓట్లను తొలగించడంపై ప్రజలు ఆందోళనలు చేస్తుంటే...మరో పక్క ఓట్ల తొలగింపునకు మద్దతుగా బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ తెలంగాణకు వచ్చి పాదయాత్ర నిర్వహించడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
“లోక్‌తంత్ర బచావో - అరాజకత హటావో” అనే నినాదంతో బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. నిజానికి దేశంలో, రాష్ట్రంలో అరాచకత్వాన్ని లేకుండా చేయాలంటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ముందుగా కేంద్రంలోని బీజేపీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
చనిపోయిన, రెండుచోట్ల ఓట్లు ఉన్నవారి ఓట్లను తొలగిస్తే ఎవరికీ అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ఇక్కడే పుట్టి పెరిగి పనుల కోసం, వృత్తుల కోసం, బతుకు దెరువు కోసం వలసెళ్లిన దేశ పౌరులను కూడా చొరబాటుదారులనే నెపంతో శాశ్వతంగా వారిని ఓటు హక్కుకు దూరం చేయడం దారుణమని తెలిపారు.
పశ్చిమ బెంగాల్, ఇతర రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలను చూస్తే బీజేపీ తన వ్యతిరేక ఓటు బ్యాంకు తొలగిస్తోందని అర్థమవుతున్నదని పేర్కొన్నారు.
తెలంగాణలోనూ 92 లక్షలకు పైగా ఓట్లను బ్లాక్ లిస్టులో పెట్టి అడ్డదారుల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే కుట్రకు బీజేపీ పాల్పడుతున్నదనీ, ‘మహా పాదయాత్ర’ల పేరుతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నదని విమర్శించారు. ఈ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనీ, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం కేవలం పగటి కల మాత్రమేనని అని తెలిపారు. రానున్న రోజుల్లో ఉన్న 8 ఎంపీ, 8 ఎమ్మెల్యే సీట్లు కూడా పుట్టగతులు లేకుండా పోవడం ఖాయమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం, లౌకికవాద పరిరక్షణ కోసం బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.





కామెంట్‌లు (0)