డ్రైవింగ్ లైసెన్స్‌ల్లో రవాణాశాఖ కీలక సంస్కరణ
ప్రక్షాళనతో వాహనదారులకు మేలు..!
‘ఫారం-1ఏ’ మెడికల్ సర్టిఫికెట్ల జారీపై కీలక ఆదేశాలు
జనవరి 1లోగా ‘సారథి’ పోర్టల్‌లో రిజిస్టర్డ్ వైద్యుల నమోదు
జనవరి 2 నుంచి పోర్టల్ ఆమోదం పొందిన డాక్టర్ల ధ్రువపత్రాలే చెల్లుబాటు
నవతెలంగాణ-సిటీబ్యూరో
లెర్నర్స్ లైసెన్స్ (ఎల్‌ఎల్‌ఆర్), డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) దరఖాస్తుల్లో సమర్పించే మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల (ఫారం-1ఏ) పేరిట సాగుతున్న అక్రమాలకు, నకిలీ ధ్రువపత్రాల దందాకు అడ్డుకట్ట వేసేందుకు రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరివి పడితే వారి స్టాంపులు, సంతకాలతో కూడిన సర్టిఫికెట్లు చెల్లుబాటు కాకుండా పక్కాగా డిజిటల్ కళ్లెం వేస్తోంది. ‘సారథి పరివాహన్’ పోర్టల్‌లో రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు (నమోదిత వైద్యులు) తమ వివరాలను నమోదు చేసుకునేందుకు 2027 జనవరి 1వ తేదీని తుది గడువు (కటాఫ్ డేట్)గా ఖరారు చేసింది. ఈ మేరకు రవాణాశాఖ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (ఐటీ) మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ తాజాగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాలకూ(ఆర్టీవో) ఆదేశాలు జారీ చేశారు.
జనవరి 2 నుంచి ఆన్‌లైన్‌లోనే సర్టిఫికెట్లు
సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్-1989లోని నిబంధన 5 ప్రకారం, అవసరమైన సందర్భాల్లో ఎల్‌ఎల్‌ఆర్, డీఎల్ దరఖాస్తుదారులు నమోదిత వైద్యుడి నుంచి ఫారం-1ఏ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియను క్రమబద్ధీకరించి, ఏకరీతిలో అమలు చేసేందుకు రవాణా శాఖ కమిషనర్ ఈ నూతన విధానాన్ని తీసుకొచ్చారు. గతంలో జేటీసీ, డీటీసీల అనుమతితో ఆర్టీవో కార్యాలయాల ఆవరణలోనే వైద్యులు అందుబాటులో ఉండి సర్టిఫికెట్లు జారీ చేసేవారు. ఆ తర్వాత వారిని కార్యాలయాల బయటకు మార్చారు. ఇప్పటివరకు ఉన్న విధానంలో దరఖాస్తుదారుడు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత వైద్యుడి వద్దకు వెళ్లి ఫొటో వెరిఫికేషన్ చేయించుకుని, ఫారం-1ఏపై స్టాంప్, సంతకం తీసుకుని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేవారు. అయితే సిస్టమ్‌లో డాక్టర్ వివరాల ధ్రువీకరణ లేకపోవడంతో కొందరు నకిలీ స్టాంపులు, తప్పుడు పత్రాలతో సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.
నకిలీలకు చెక్!
వైద్యుడి ప్రాక్టీషనర్ నెంబర్‌ను సిస్టమ్ నేరుగా సరిచూస్తుంది కాబట్టి బోగస్ మెడికల్ సర్టిఫికెట్లకు, దళారుల మోసాలకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుంది. కేవలం అర్హులైన, రిజిస్టర్డ్ వైద్యులు మాత్రమే ఆరోగ్య, దృష్టి సామర్థ్యాన్ని నిర్ధారించి సర్టిఫికెట్ ఇస్తారు. ఇది పరోక్షంగా రోడ్డు భద్రతకు దోహదపడుతుంది. ఏయే వైద్యులు అధికారికంగా ఆమోదం పొందారో పోర్టల్‌లో స్పష్టత ఉంటుంది. వాహనదారులు సరైన డాక్టర్ల వద్దకు వెళ్లి సర్టిఫికెట్ పొందొచ్చు. తద్వారా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే ఇబ్బందులు ఉండవు.
సవాళ్లు.. వాహనదారుల్లో సందేహాలు!
ఈ నిర్ణయం స్వాగతించదగినదే అయినా, క్షేత్రస్థాయి అమలుపై కొన్ని ఆందోళనలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జనవరి 1 గడువులోగా ఆయా ఆర్టీవో పరిధిలో వైద్యులు పోర్టల్‌లో రిజిస్టర్ కాకపోతే, జనవరి 2 తర్వాత వాహనదారులు సర్టిఫికెట్ల కోసం తిప్పలు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పరిమిత సంఖ్యలో వైద్యులు మాత్రమే రిజిస్టర్ అయితే, వారి వద్ద డిమాండ్ పెరిగి వాహనదారులపై అదనపు ఫీజుల భారం పడే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. వైద్యులు పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫారం-1ఏ జారీ చేసేటప్పుడు దరఖాస్తుదారుడిని నేరుగా పరీక్షించి ఇస్తారా? లేక పాత పద్ధతిలోనే వాహనదారుడు డాక్టర్ వద్దకు వెళ్లి స్టాంప్ వేయించుకుని పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలా? ఇంటి నుంచో క్లినిక్ నుంచో ఆన్‌లైన్‌లో అప్రూవ్ చేస్తే శారీరక దృఢత్వాన్ని ఎలా నిర్ధారిస్తారు? అనే విధివిధానాలపై రవాణా శాఖ మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
ఆర్టీవోలకు కీలక ఆదేశాలు
ఈ నూతన విధానం పక్కాగా అమలయ్యేలా రాష్ట్రంలోని డీటీసీలు, ఆర్టీవోలు, డీటీవోలు చర్యలు తీసుకోవాలని రవాణాశాఖ ఆదేశించింది. జనవరి 1 తుది గడువుపై ఆయా కార్యాలయాల పరిధిలోని నమోదిత వైద్యులు, ఆస్పత్రులు, క్లినిక్‌లలో విస్తృతంగా ప్రచారం కల్పించాలంది. పోర్టల్‌లో నమోదు కోసం వచ్చే వైద్యుల దరఖాస్తులను క్షుణ్నంగా పరిశీలించి, వారి మెడికల్ రిజిస్ట్రేషన్‌ను ధ్రువీకరించి 2027 జనవరి 1 లేదా అంతకు ముందే ఆమోదించాలి. జనవరి 2 నుంచి పోర్టల్‌లో నమోదై, ఆమోదం పొందిన వైద్యులు మాత్రమే పోర్టల్ ద్వారా ఫారం-1ఏ జారీ చేసేలా చూడాలి. ఈ ఆదేశాల అమలును నిరంతరం పర్యవేక్షించాలని, ఎవరైనా నిర్లక్ష్యం వహించినా, నిబంధనలు ఉల్లంఘించినా తీవ్రంగా పరిగణించి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇకపై తప్పనిసరిగా..
‘సారథి పరివాహన్’ పోర్టల్‌లో ఆయా ఆర్టీవోల పరిధి కింద ప్రత్యేక మాడ్యూల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. ఆర్టీవో అధికారులు వారి మెడికల్ రిజిస్ట్రేషన్‌ను ధ్రువీకరించిన తర్వాతే పోర్టల్‌లో ఆమోదిస్తారు. కేవలం పోర్టల్‌లో నమోదై, ఆమోదం పొందిన వైద్యుల ప్రాక్టీషనర్ లైసెన్స్ నంబర్ ఆధారంగా జారీ చేసే ఫారం-1ఏ సర్టిఫికెట్లను మాత్రమే ‘సారథి’ సిస్టమ్ అనుమతిస్తుంది. ఇతరుల సర్టిఫికెట్లను సాఫ్ట్‌వేర్ స్వీకరించదు.






కామెంట్‌లు (0)